జాగ్రఫీ, పర్యావరణ అంశాల సమన్వయంతో... | Environmental, geography subjects in Civils services mains exams | Sakshi
Sakshi News home page

జాగ్రఫీ, పర్యావరణ అంశాల సమన్వయంతో...

Published Thu, Nov 7 2013 2:26 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Environmental, geography subjects in Civils services mains exams

కలల కెరీర్ సివిల్ సర్వీసెస్ దిశగా అడుగులు వేస్తూ.. మొదటి దశ ప్రిలిమ్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని   అత్యంత కీలకమైన మెయిన్స్ దశకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు.. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.  ఓ అభ్యర్థి బుద్ధికుశలతను, సామాజిక, సమకాలీన సమస్యలపై అవగాహనను పరీక్షించాలన్న ఉద్దేశంతో మెయిన్స్‌లో మార్పులు చేశారు. కామన్ పేపర్‌‌సతోపాటు ఎస్సే, ఆప్షనల్‌గా జాగ్రఫీని ఎంచుకున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి.. ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, సమాధానాలు రాయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమైన అంశాలు తదితర అంశాలపై సూచనలు..

 

 ఎ.డి.వి. రమణరాజు,

 సీనియర్ ఫ్యాకల్టీ,

 ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్.

 

 మానవునికి సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పరిపాలన, సాంస్కృతిక  అంశాలన్నింటినీ ప్రభావితం చేసే విజ్ఞానశాస్త్త్రమే భూగోళశాస్త్రం.

 

 సమన్వయంతో:

 మారిన విధానంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్‌‌స పరీక్షల కోసం నిర్దేశించిన సిలబస్ అంశాలను విశ్లేషిస్తే.. జాగ్రఫీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనాలు బహుళంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సబ్జెక్టులోని అధిక శాతం అంశాలను పేపర్-1 (ఎస్సే), పేపర్-2 (జనరల్ స్టడీస్-1-Indian Heritage and Culture, History and Geography of the World and Society), పేపర్-4 (జనరల్ స్టడీస్-3-Technology, Economic Development, Bio-diversity, Environment, Security and Disaster Management)లలో భాగంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాగ్రఫీ, పర్యావరణ విభాగాలకు సంబంధించిన అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. జాగ్రఫీకి సంబంధించి ఏ మూల నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. జాగ్రఫీ ఆప్షనల్‌తో పరీక్షకు సిద్ధమవుతున్నవారికి ఈ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి వీలుంది.

 

 జాగ్రఫీ ఆప్షనల్ పేపర్-1:

 ఇందులో భౌతిక, మానవ భూగోళ శాస్త్రాలకు సంబంధించిన భావనలు, సిద్ధాంతాలను పొందుపరిచారు. ఇందులో సెక్షన్-ఎను పరిశీలిస్తే..

 

 భూస్వరూప శాస్త్రానికి సంబంధించి భూ అయస్కాంతత్వం (జియోమాగ్నటిజం) ప్రాథమిక భావనలు, భూ అభినితి (జియోసింక్లైన్), భూ సమస్థితి, డబ్ల్యు.జె. మోర్గాన్ ప్రతిపాదించిన పలకవిరూపక సిద్ధాంతం ఆధారంగా భూకంపాలు, సునామీలు ఏర్పడే విధానం- విశ్లేషణ, మోరిస్, పెంక్‌లు ప్రతిపాదించిన భూ స్వరూప చక్ర ప్రక్రియలు, వాటి మధ్యగల తేడాలు, పోలికలు, విశ్లేషణ, అనువర్తిత భూ స్వరూప శాస్త్త్రం, వాలుల అభివృద్ధి, విశ్లేషణ, జియోహైడ్రాలజీ మొదలైన అంశాలు కీలకమైనవి.

 వీటిపై పరిపూర్ణ పట్టు సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి.

 శీతోష్ణస్థితి శాస్త్రానికి సంబంధించి క్షితిజ సమాంతర ఉష్ణోగ్రతా విస్తరణ దాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఊర్ద్వ ఉష్ణోగ్రతా విస్తరణ, ఉష్ణ సమతుల్యం, రుతుపవనాలు, జెట్‌స్ట్రీమ్, వాయురాశులు, వాతాగ్రాలు, సమ శీతోష్ణ మండల, ఉష్ణమండల చక్రవాతాలు, వాటి మధ్యగల తేడాలు, వర్షపాత రకాలు, విస్తరణ, కొప్పెన్, థార్న్ థ్వైట్‌లు ప్రతిపాదించిన ప్రపంచ శీతోష్ణ స్థితుల వర్గీకరణ, ఆయా వర్గీకరణల మధ్యగల తేడాలు, జల సంబంధిత చక్రం, అనువర్తిత శీతోష్ణస్థితి శాస్త్రం మొదలైన విశ్లేషణాత్మక దృష్టితో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.

 సముద్ర శాస్త్రానికి సంబంధించి అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల భూతల విభజన, సముద్రజల లవణీయత, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, సముద్ర నిక్షేపాలు, ప్రవాళ బిత్తికలు, అవి విక్షాళనం చెందడానికి గల కారణాలు, సముద్ర జల కాలుష్యం, దానికి గల కారణాలు తదితరాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొందడానికి ప్రయత్నించాలి.

 జైవిక భూగోళ శాస్త్రానికి సంబంధించి మృత్తిక వర్గీకరణ, విసృ్తతి, మృత్తిక క్రమక్షయం, నిమ్నీకరణకు గల కారణాలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అటవీ నిర్మూలన వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సామాజిక అడవుల పెంపకం, ఆగ్రో ఫారెస్ట్రీ మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.

 ఎన్విరాన్‌మెంటల్ జాగ్రఫీకి సంబంధించి ఆవరణశాస్త్ర ప్రాథమిక భావనలు, పర్యావరణంపై మానవ ప్రభావం, ఆవరణ వ్యవస్థల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలు, వాటి సంరక్షణ, జీవ వైవిధ్యత సంరక్షణలో సుస్థిరాభివృద్ధి పాత్ర, నూతన పర్యావరణ విధానం, పర్యావరణ వైపరీత్యాలు, వాటి నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.

 

 పేపర్-1, సెక్షన్-బి:

 ఇందులోని కీ లక అంశాలను పరిశీలిస్తే..

 మానవీయ భూగోళ శాస్త్త్రంలోని దృక్పథాలకు సంబంధించి పర్యావరణ వాదం, పరిణామాత్మక విప్లవం, ద్వంద్వ భావన, రాడికల్, ప్రవర్తనా వాద దృక్పథాలు, ప్రపంచ సాంస్కృతిక మండలాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.

 ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించి, వనరులు వాటి విస్తరణ, ఇంధన సమస్య, ప్రపంచ వ్యవసాయ మండలాలు - రకాలు, ఆహార భద్రత, దుర్భిక్షం -కారణాలు - ప్రభావాలు - నివారణ చర్యలు మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.

 జనాభా భూగోళ శాస్త్రానికి సంబంధించి ప్రపంచ జనాభా పెరుగుదల, విస్తరణను ప్రభావితం చేసే అంశాలు, ప్రపంచ జనాభాలో వలసలకు గల కారణాలు, ఉచ్ఛ-నిమ్న-అభిలషణీయ జనాభా భావనలు, జనాభా సిద్ధాంతాలు, ప్రపంచ జనాభా సమస్యలు, విధానాలు, పట్టణ జనాభా క్రమానుగత శ్రేణి, ప్రెమేట్ నగర భావన, రాంక్-సెజ్ నియమం, శాటిలైట్ టౌన్‌‌స, పట్టణ-గ్రామీణ ఉపాంతపు అంచు, పట్టణీకరణ వల్ల ఎదురయ్యే సమస్యలు, నివారణ చర్యలు మొదలైన అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి.

 ప్రాంతీయ భూగోళ శాస్త్త్రంలో ప్రాంతీయత భావన, రకాలు, ప్రాంతీయ అసమానతలకు గల కారణాలు, వాటి అభివృద్ధి వ్యూహాలు, ప్రాంతీయ ప్రణాళికలను రూపొందించడంలో పర్యావరణ సంబంధిత అంశాల పాత్ర మొదలైన అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి.

 మానవ భూగోళ శాస్త్త్రంలోని నమూనాలు, సిద్ధాంతాలు, శాసనాలకు సంబంధించి మాల్ధూషియనీ, మార్ష్కియన్, జనాభా పరివర్తన నమూనాలు, క్రిష్టలర్ కేంద్ర స్థాన సిద్ధాంతం, లోస్చే, క్రిష్టలర్ సిద్ధాంతాల మధ్యగల తేడాలు, ఓస్టోవ్‌‌స నమూనాలోని వృద్ధి దశలు, హృదయభూమి, అంచుల భూమి సిద్ధాంతాలు మొదలైన అంశాలను చదవాల్సి ఉంటుంది.

 

 పేపర్-2:

 ఇందులో భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికంగా దృష్టి సారించాల్సినవి:

 భారతదేశ భూభౌతిక అమరికకు సంబంధించి భారతదేశం - పొరుగు దేశాలతో ఉన్న భూ సరిహద్దు సమస్యలు, వాటి నేపథ్యం, హిమాలయ, ద్వీపకల్ప నదీ వ్యవస్థల మధ్యగల తేడాలు, భారతదేశ నైసర్గిక స్వరూపాలు, వాటి ప్రాముఖ్యత, భారతదేశ శీతోష్ణస్థితిపై రుతుపవనాల పాత్ర, దేశ భూభాగంలో రుతుపవన విస్తరణ విధానం, దాన్ని ప్రభావితం చేసే అంశాలు, భారతదేశంలో వర్షపాత విస్తరణపై ఉష్ణమండల చక్రవాతాలు, పశ్చిమ అలజడుల ప్రభావం, దుర్భిక్షం, వరదలు, భారతదేశంలో ఉద్భిజ సంపద, రకాలు తదితరాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి..

 భారతదేశంలో భూగర్భ, ఉపరితల జలవనరుల పరిమాణం విస్తృతి, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి నిర్వహణ, శక్తి వనరులు, ఖనిజ వనరులు, వాటి సంరక్షణ, ఇంధన సమస్యలు మొదలైన అంశాలను చదవాలి.

 వ్యవసాయ రంగానికి సంబంధించి భారతదేశంలో వ్యవసాయ మౌలిక వసతులు, సాగునీటి సౌకర్యాలు, విత్తనాలు, ఎరువులు, విద్యుత్తు మొదలైన అంశాలు కీలకమైనవి. వీటిని విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాలి. అదేవిధంగా పంటల విధానం, పంటల సరళి (క్రాప్ కాంబినేషన్), వ్యవసాయ రంగంలో హరిత విప్లవం పాత్ర దానివల్ల ఏర్పడే సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరమైన సమస్యలు, ఆగ్రో-క్లైమాటిక్ ప్రాంతాలు, ఆగ్రో - ఎకలాజికల్ రీజియన్‌‌స మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి.

 పరిశ్రమలకు సంబంధించి నూలు వస్త్త్ర పరిశ్రమ, ఇనుము-ఉక్కు, అల్యూమినియం, ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఉనికి, వాటి ఏర్పాటుకు దేశంలోని అనుకూల అంశాలు. పారిశ్రామిక నివాసాలు, పారిశ్రామిక సముదాయాలు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌లు), ఎకోటూరిజం మొదలైన అంశాలను చదవాలి.

 రవాణా, సమాచార రంగాలకు సంబంధించి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం చేపట్టిన ఎన్‌హెచ్‌డీపీ ప్రాజెక్టు అమలు తీరు, బూట్ (ఆైఖీ) (బిల్డ్, ఆపరేట్, ట్రాన్‌‌సఫర్) పాత్ర , రోడ్డు రవాణా, రైల్వే రవాణా మధ్యగల పరస్పర పూరకాలు, వ్యతిరేకాలు (కాంప్లిమెంటరీ, కాంట్రడిక్టర్‌‌స) దేశ వాణిజ్యంలో ప్రధాన ఓడరేవుల ప్రాముఖ్యత, ఓడరేవుల అభివృద్ధిలో పీ3 (ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్) పాత్ర మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి.

 సాంస్కృతిక అంశాలకు సంబంధించి భారత సమాజంలో భాషాపరమైన, జాతి పరమైన వైవిధ్యతలు, గిరిజన ప్రాంతాలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి.

 జనావాసాలకు సంబంధించి భారతదేశంలో గ్రామీణ జనావాసాల రకాలు, విధానాలు, వాటి భౌతిక స్వరూపాలు, భారతీయ నగరాల భౌతిక స్వరూపాలు, విధుల పరంగా భారతీయ నగరాల వర్గీకరణ, మెట్రోపాలిటన్ ప్రాంతాలు, మురికివాడలు, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణీకరణ వల్ల ఏర్పడే సమస్యలు, నివారణ చర్యలను విశ్లేషణాత్మక దృష్టితో చదవాలి.

 ప్రాంతీయ ప్రణాళికలు, అభివృద్ధికి సంబంధించి దేశంలో ప్రాంతీయ అసమానతలను రూపుమాపడంలో ప్రాంతీయ ప్రణాళికల పాత్ర, పంచాయతీరాజ్, వికేంద్రీకరణ ప్రణాళికలు, వాటర్‌షెడ్ నిర్వహణ, వెనుకబడిన ప్రాంతాలు, ఎడారి, దుర్భిక్ష, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రణాళికలు మొదలైన అంశాలను స్థూలంగా అధ్యయనం చేయాలి.

 రాజకీయ పరమైన దృక్పధాలకు సంబంధించి భారత సమాఖ్య విధానానికి సంబంధించిన భౌగోళిక పరమైన ప్రేరకాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతీయ ధోరణులు, అంతర్రాష్ట్ర అంశాలు, భారత అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించిన అంశాలు, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతాలలో భౌగోళిక రాజకీయాలు, సీమాంతర ఉగ్రవాదం మొదలైన అంశాలపై కూడా దృష్టి సారించాలి.

 సమకాలీన అంశాలకు సంబంధించి పర్యావరణ పరమైన  విపత్తులకు సంబంధించి భూపాతాలు (ల్యాండ్‌స్లైడ్‌‌స), భూకంపాలు, భారతదేశంలో భూకంపజోన్‌‌స, సునామీజోన్‌‌స, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలు, పర్యావరణ ప్రభావ నిర్ధారణ (ఇఐఎ), పర్యావరణ నిర్వహణ భావనలు, నదీ అనుసంధానం మొదలైన అంశాలను చదవాలి.

 

 పరిధి పెరిగింది

 గతంతో పోలిస్తే జనరల్ స్టడీస్ పేపర్‌లో జాగ్రఫీ సబ్జెక్టు పరిధి విస్తృతమైంది. గతేడాది కేవలం ఇండియా జాగ్రఫీని మాత్రమే సిలబస్‌లో పేర్కొంటే ఈసారి వరల్డ్ జాగ్రఫీని అదనంగా చేర్చారు. ఓ విషయం గురించి చదువుతున్నప్పుడు ఆ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశముందో ఆలోచించి చదవాలి. అప్పుడే ప్రిపరేషన్ సఫలీకృతమవుతుంది. జాగ్రఫీలోని అంశాలకు ఆకాశమే హద్దు. అందువల్ల ప్రిపరేషన్‌లో భాగంగా తొలుత బేసిక్ విషయాలపై పట్టు సాధించాలి. ఆ తర్వాత ముఖ్యమైన అంశాలను, సమకాలీన అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి.

 

 సమాధానాలు ఇలా

 అభ్యర్థులు నేరుగా ఎస్సే రాయడానికి ఉపక్రమించడం అభిలషణీయం కాదు. ప్రశ్నను రెండుమూడుసార్లు చదివి, అర్థం చేసుకోవాలి.

 వాక్యాలు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. కఠిన పదబంధాలు ఉపయోగించకూడదు.

 అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ సిద్ధం చేసుకున్న స్ట్రక్చర్‌ల ఆధారంగా ఎస్సే రాయాలి. ఎస్సేను పేరాగ్రాఫ్‌లుగా రాయాలి. అవసరమైన సబ్ హెడ్డింగ్స్ పెట్టాలి.

 ఒక పేరాకు తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.

 గణాంకాలను సాధ్యమైనంతవరకు శాతాల్లో చూపేందుకు యత్నించాలి. వ్యాసంలో అతిముఖ్యమైన సమాచారాన్ని అండర్‌లైన్ చేయాలి.

 ఎస్సే రాయడంలో సమతూకం పాటించడం చాలా ప్రధానం. ప్రశ్నలో అడిగిన అంశానికి సంబంధించి వివిధ పార్శ్వాలు ప్రతిబింబించేలా సమాధానం రాయాలి. ఏదో ఒక కోణాన్ని మాత్రమే ప్రస్తావించి వదిలేయకూడదు.

 వివిధ సమస్యల పరిష్కారానికి అభ్యర్థి సూచనలు నిర్మాణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement