పర్యావరణ పరిరక్షణ అవశ్యం
సందర్భం
నదులు ఎండిపోవడం, ప్రాజెక్టులు బీటలువారిపోవడం, కనుచూపు మేర తాగునీరు దొరక్క కోట్లమంది అల్లాడిపోవడం, సరుకులు నీళ్లను రైళ్లు సరఫరా చేయడం, వడగాడ్పులకు వేలాదిమంది పిట్టల్లాగా రాలి పోవడం, అవసరం లేనిచోట అతివృష్టి, అవసరమైన చోట అనావృష్టి, గడ్డి గాదం కరువై, పోషణ బరువై, పెంచుకున్న జంతువులను వేలాదిగా కబేళాలకు తోలడం.. ఇదే పర్యావరణ విధ్వంసం అంటే. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, సునామీలు, వరదలు, అతివృష్టి, అనావృష్టి, కరువులు, గతి తప్పిన రుతు పవనాలు, జీవావరణ సమతుల్యతలో లోపం, నీరు, గాలి, భూమి కలుషితం కావడం, ప్రజారోగ్యం ప్రత్య క్షంగా, పరోక్షంగా దెబ్బతినడం ఇవన్నీ మనిషి ఇటీవలి కాలంలోనే చూస్తున్న వైపరీత్యాలు. భూగోళంపై మనిషి సాగించిన, సాగిస్తూ వస్తున్న సకల హింసారూపాలకు ప్రతిఫలం మన కళ్లముందే ఇలా కనిపిస్తోంది. భూమిపై సుమారు 17,70,000 జీవజాతులు మనిషితోపాటుగా జీవిస్తు న్నాయి. కాని నేడు విశ్వరూపం దాల్చిన పర్యావరణ క్షీణతకు కారకుడు మానవుడు మాత్రమే. అనాలోచితంగా, స్వార్థంతో మనిషి గత రెండు మూడు శతాబ్దాల్లో చేస్తూ వస్తున్న చర్యలతోనే పర్యావరణ సమస్యలు ముంచుకొచ్చాయి.
ప్రస్తుతం భూగోళానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసకు మరోపేరు పర్యావరణ విధ్వంసం. ఇందులో రేపటితరం వనరులను నేటి తరం దోచుకుంటోంది. అడ వులను, రోడ్లకు ఇరువైపులా చెట్లను విపరీతంగా నరికి వేయడం, వాహనాలు, పరిశ్రమల ద్వారా విపరీతమైన కాలుష్యం ఏర్పడటం, ప్లాస్టిక్ వాడకం పెరగటం, వ్యవ సాయంలో మితిమీరిన రసాయనాలు వాడటం, ప్రకృతి, సహజ వనరులను అవసరాలకు మించి వాడటం, ప్రతి పనీ యంత్రంతోనే చేయడంతో జీవన శైలిలో మార్పులు ఇవీ భూమిపై మనిషి హింసకు నిదర్శనాలు. అడుగు పెట్టిన చోటల్లా పర్యావరణ విధ్వంసానికి కారకుడైన మనిషి తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నాడు.
పర్యావరణ విధ్వంసంపై ఐక్యరాజ్య సమితి 1972 జూన్ 5న స్టాక్‌హోమ్‌లో ‘మానవుడు - పర్యావరణం’ అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆవిర్భావానికి దారి తీసింది. ప్రపంచ స్థాయిలో ఆలోచించు - ప్రాంతీయంగా ఆచరించు అనేది పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు ఇచ్చిన నినాదం. మనం విశ్వమంత విశాలంగా ఆలో చించి సమస్యను అవగాహన చేసుకున్నా, మనం కర్త వ్యాన్ని నిర్వహించాల్సింది మనం ఉన్నచోటే. ఇక్కడే మన చిత్తశుద్ధి బయటపడుతుంది. ఉదాహరణకు మనం బహుమతిగా ఇచ్చే ఒక బొకే విలువ గంట సేపు మాత్రమే కాగా గ్రీటింగ్ కార్డు విలువ కొన్ని రోజుల వరకే ఉంటుంది. స్వీట్ బాక్స్ విలువ కొన్ని గంటలు మాత్రమే. కానీ వాటికన్న తక్కువ ధరతో ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి నాటి, స్నేహానికి గుర్తుగా పెంచితే అది 50 ఏళ్ల కాలంలో 15 లక్షల 70 వేల వస్తుసేవలను మనకు ఇస్తుందని ఒక అంచనా. ఇంతకన్నా మానవసేవా, దేశభక్తి వేరే ఏముంటుంది? మనం వ్యక్తులుగానూ, సంస్థాగతంగానూ మన చుట్టూ ఉన్న పరిసరాలను చక్కదిద్దుకోలేకపోతున్నాం కాబట్టే ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 నగరాలు భారతదేశానికి చెందినవే ఉంటున్నాయి.
భారత్‌లోని 290 నదుల్లో 66 శాతం నదులు రసాయన కాలుష్యాలతో నిండిపోయాయి. దేశంలో 30 కోట్ల మంది కరువు బారిన పడ్డారు. వర్షపాతం లేమి కంటే ప్రణాళికా లేమి, ముందుచూపు లేకపోవడం, నేరపూరితమైన నిర్లక్ష్యం దీనికి కారణమంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. గత నాలుగు దశాబ్దాలకు పైగా పర్యావరణంపై అంతర్జాతీయంగా అనేక సదస్సులు, నిర్ణయాలు, అవగాహన లు జరుగుతూ ఉన్నాయి. ప్రతిదేశం కర్బన ఉద్గారాలు తగ్గించుకోవాలని 1997లో జపాన్‌లో తీర్మానించిన క్యోటో ప్రొటోకాల్ సంపూర్ణంగా అమలైతే భూతాపం తగ్గుతుంది. అందుకు ప్రతి ఒక్క వ్యక్తీ, దేశం కృషి ఎంతైనా అవసరం.
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా)
వ్యాసకర్త జాతీయ కన్వీనర్ జనవిజ్ఞానవేదిక పర్యావరణ విభాగం మొబైల్: 9959806652
సి. యాగంటేశ్వరప్ప