ఉత్తర భాగానికి నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్‌హెచ్‌ఏఐ
అందుకు వీలుగా టెండర్ డాక్యుమెంటేషన్ ప్రక్రియ కొలిక్కి
పర్యావరణ అనుమతులు వచ్చాక నిర్మాణ సంస్థ ఖరారు
ఈలోపు రోడ్డు నంబర్ కేటాయింపు.. అటవీ అనుమతుల జారీ
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్‌ఆర్ (రీజినల్ రింగురోడ్డు) నిర్మాణానికి కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి వీలుగా ఎన్‌హెచ్‌ఐఏ ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగం టెండర్ డాక్యుమెంటేషన్‌పై దృష్టి సారించింది. వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు పిలిచే అవకాశాలున్నాయి.
పర్యావరణ అనుమతులు రాకుండానే..
ట్రిపుల్‌ఆర్ విషయంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. దీంతో భవిష్యత్‌లో మరింత ఆలస్యం జరగకుండా చూడాలని ఎన్‌హెచ్‌ఏఐ భావిస్తోంది. పర్యావరణ అనుమతులు రాకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయటానికి వీలులేదు. కానీ, టెండర్లు పిలిచేందుకు అది అడ్డంకి కాదు. దీంతో పర్యావరణ అనుమతులు వచ్చేలోగా టెండర్లు పిలిచి, పర్యావరణ అనుమతులు వచి్చన తర్వాత టెండర్లు ఖరారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. టెండర్లు తెరిచే నాటికి అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్
జాతీయ రహదారి హోదాలో కేంద్రం ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు చేపడుతోంది. ఉత్తర భాగం విషయంలో ఆ స్పష్టత ఉంది. దక్షిణభాగాన్ని కేంద్రం కాకుండా సొంతంగానే చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర భాగాన్ని సొంత నిధులతో కేంద్రమే నిర్మిస్తోంది. గతంలో కేవలం జాతీయ రహదారిగా మాత్రమే దాన్ని పరిగణించింది. కానీ, ఇటీవల దాన్ని ఎక్స్‌ప్రెస్‌వే జాబితాలో చేర్చింది. అప్పటి వరకు తాత్కాలికంగా దానికి 161ఏ నంబర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పుడు అది కాకుండా ఎక్స్‌ప్రెస్‌వేగా కొత్త నంబర్ కేటాయించనున్నారు. ఈ నంబర్ అలాట్ అయిన తర్వాతే ఫారెస్టు క్లియరెన్సు వస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు సంబంధించి పబ్లిక్ హియరింగ్స్ ప్రక్రియ పూర్తి చేశారు. పర్యావరణ అనుమతులకు అది కీలకం.
రోడ్డు నంబర్ అలాట్ అయిన తర్వాతనే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. త్వరలో ఆ రోడ్డు నంబర్ కేటాయించే అవకాశముంది. పర్యావరణ అనుమతులు వచ్చిన తర్వాతే టెండర్లు తెరవాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తయ్యే వరకు టెండర్ల కోసం ఎదురు చూడకుండా, ముందు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు భూపరిహారం పంపిణీకి వీలుగా గ్రామాల వారీ అవార్డులు పాస్ చేసే ప్రక్రియ కూడా నిర్వహించాల్సి ఉంది.
ఇది జరగాలంటే పరిహారం నిధులు ఎన్‌హెచ్‌ఏఐకి కేటాయించాలి. ఉత్తర భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని భరించాల్సి ఉన్నందున, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఈ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. సమాంతరంగా ఈ ఏర్పాట్లు చేస్తూనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. వచ్చేనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి నిర్ధారిత గడువులోపు నిర్మాణ సంస్థను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత వీలైనంత తొందరలో పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment