భూతాపం, వాతావరణంలో హరిత వాయువుల గాఢత రెట్టింపవుతోంది. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాలు ఉడికిపోతున్నాయి.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: భూతాపం, వాతావరణంలో హరిత వాయువుల గాఢత రెట్టింపవుతోంది. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని వివిధ పట్టణాలు ఉడికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేకపోతున్నారు. పచ్చదనం కనుమరుగవడమే వీటన్నింటికీ ప్రధాన కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పట్టణీకరణ పేరుతో విచక్షణా రహితంగా చెట్లను నరికేస్తుండటంతో చూద్దామన్నా పచ్చదనం కనిపించడం లేదు. మున్సిపల్, కార్పొరేషన్ అధికార యంత్రాంగం మొక్కలు నాటించడంపై కనీస దృష్టి కూడా సారించడం లేదు.
సర్వేలో భయానక వాస్తవాలు:
వాతావరణ శాఖ, పర్యావరణ, సామాజిక అటవీ శాఖలకు చెందిన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నగరాలు, పట్టణాల్లో పచ్చదనంపై సర్వే నిర్వహిం చాయి. ఆ సర్వేలో భయానక వాస్తవాలు వెలుగుచూశాయి. దీంతో ఆందోళన చెందిన ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సేకరించిన పచ్చదనం శాతాలను ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు పలు శాఖలకు పంపించారు. దీనిపై తక్షణమే స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా నగరం, పట్టణం భూ విస్తీర్ణంలో 33 శాతం మొక్కలు, చెట్లు, వనాలతో నిండి ఉండాలి. అలాంటిది ఊహకందని రీతిలో పచ్చదనం కనుమరుగవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో ఒంగోలు నగరంతోపాటు ఏడు మున్సిపాలిటీలున్నాయి. పచ్చదనం విషయంలో అన్నీ వెనుకబడే ఉన్నాయి. ఒంగోలు నగరం పరిస్థితి అత్యంత దారుణం. ఒంగోలు నగర విస్తీర్ణం 135 చదరపు కిలోమీటర్లు. ఇందులో 33 శాతం విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు, పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. అలాంటిది ఇటీవల లెక్కల ప్రకారం ఒంగోలు నగరంలో కేవలం 3 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు తేలింది.
అద్దంకి మున్సిపాలిటీలో ప్రస్తుతం కేవలం 2 శాతం మాత్రమే పచ్చదనం ఉంది. అదేవిధంగా చీమకుర్తిలో 18, చీరాలలో 4, గిద్దలూరులో 20, కందుకూరులో 3, కనిగిరిలో 16, మార్కాపురంలో 2 శాతం మాత్రమే పచ్చదనం ఉన్నట్లు అధికారుల సర్వేల్లో తేటతెల్లమైంది.
మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలి
ఏ.కోటేశ్వరరావు, వృక్ష శాస్త్ర నిపుణుడు, సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్
పట్టణాలు, నగరాల్లో మొక్కల పెంపకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక చెట్టును కొడితే రెండు చెట్లు పెంచే విధంగా కఠినమైన చర్య లు తీసుకోకపోతే భవి ష్యత్ తరాలకు మంచి ఆరోగ్యాన్ని అందించలేం. శీతోష్ణస్థితిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయంటే మొక్కలను విచక్షణా రహితంగా నరకడమే ప్రధా న కారణం. మన దేశం లో పర్యావరణం, చెట్ల సంరక్షణపై కఠిన చట్టాలున్నప్పటికీ వాటి ఆచరణ లోపం వల్లనే ఈ పరిస్థితి ఎదురవుతోంది.