ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం | Sakshi Editorial on Kedarnath Helicopter Crash | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తోడేస్తున్న నిర్లక్ష్యం

Published Fri, Oct 21 2022 12:17 AM | Last Updated on Fri, Oct 21 2022 12:17 AM

Sakshi Editorial on Kedarnath Helicopter Crash

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో మంగళవారం పైలెట్‌తో సహా ఏడుగురి మరణానికి దారితీసిన హెలికాప్టర్‌ ప్రమాదం ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. కేదార్‌నాథ్‌ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను దించాల్సిన ప్రాంతంలో దట్టమైన మంచు అలుముకుని ఉన్నదని పైలెట్‌ గ్రహించి, వెనక్కి మళ్లించేందుకు ప్రయత్నించినప్పుడు దాని వెనుక భాగం నేలను తాకడంతో ప్రమాదం జరిగిందంటున్నారు. కేదార్‌నాథ్‌ గగనంలో హెలికాప్టర్ల సందడి మొదలై పదిహేనేళ్లు దాటుతోంది. ఏటా మే నెల మధ్యనుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకూ సాగే చార్‌ధామ్‌ యాత్ర సీజన్‌లో హెలికాప్టర్లు ముమ్మరంగా తిరుగుతాయి. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలలోని క్షేత్రాలను భక్తులు సందర్శిస్తారు. ఇతర  ప్రయాణ సాధనాల విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. హెలికాప్టర్ల వినియోగమే వద్దని ఆదినుంచీ పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన హిమవన్నగాలతో నిండిన సున్నితమైన పర్యావరణ ప్రాంతం కేదార్‌నాథ్‌. ఇక్కడ హెలికాప్టర్ల రొద వన్య ప్రాణులకు ముప్పు కలిగిస్తుందనీ, వాతావరణంలో కాలుష్యం పెరుగుతుందనీ పర్యావరణవేత్తల అభియోగం. తక్కువ ఎత్తులో ఎగురుతూ చెవులు చిల్లులుపడేలా రొద చేస్తూ పోయే హెలికాప్టర్ల తీరుపై స్థానికులు సైతం తరచు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటి చప్పుడు తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందనీ, పిల్లల చదువులకు కూడా వాటి రాకపోకలు ఆటంకంగా మారాయనీ చెబుతున్నారు. అయినా వినే దిక్కూ మొక్కూ లేదు. హెలికాప్టర్లు నడిపే సంస్థలకు లాభార్జనే తప్ప మరేమీ పట్టదు. అందుకే లెక్కకుమించిన సర్వీసులతో హడావిడి పెరిగింది.

పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు కనీసం హెలికాప్టర్ల భద్రతనైనా సక్రమంగా పర్యవేక్షిస్తున్న దాఖలాలు లేవు. తాజా దుర్ఘటనలో మరణించిన పైలెట్‌ అనిల్‌ సింగ్‌కు ఆర్మీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. అయితే మొదట్లో హెలికాప్టర్లు నడిపినా మిగిలిన సర్వీసంతా విమానాలకు సంబంధించిందే. అలాంటివారు కొండకోనల్లో హెలికాప్టర్లు నడపాలంటే అందుకు మళ్లీ ప్రత్యేక శిక్షణ పొందటం తప్పనిసరి. పైగా వాతావరణంలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకునే కేదార్‌నాథ్‌ వంటిచోట్ల సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్లు నడపాలంటే ఎంతో చాకచక్యత, ఏకాగ్రత అవసరమవుతాయి. ఆ ప్రాంతంలో అంతా బాగుందనుకునేలోగానే హఠాత్తుగా మంచుతెర కమ్ముకుంటుంది. హెలికాప్టర్‌ నడిపేవారికి ఏమీ కనబడదు. అదృష్టాన్ని నమ్ముకుని, దైవంపై భారం వేసి ముందుకు కదిలినా, వెనక్కిరావడానికి ప్రయత్నించినా ముప్పు పొంచివుంటుంది. ఆ ప్రాంతం గురించి, అక్కడ హెలికాప్టర్‌ నడిపేటపుడు ప్రత్యేకించి పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి క్షుణ్ణంగా తెలిసినవారైతేనే ఈ అవరోధాలను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా 600 మీటర్ల (దాదాపు 2,000 అడుగులు) కన్నా తక్కువ ఎత్తులో హెలికాప్టర్లు నడపరాదన్న నిబంధన ఉంది. కానీ చాలా హెలికాప్టర్లు 250 మీటర్ల (820 అడుగులు)లోపు ఎత్తులోనే దూసుకుపోతున్నాయని స్థానికులు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌ సైతం తక్కువ ఎత్తులో ఎగురుతున్నందునే వెనక్కు మళ్లుతున్న క్రమంలో దాని వెనుక భాగం అక్కడున్న ఎత్తయిన ప్రదేశాన్ని తాకి మంటల్లో చిక్కుకుంది. ఈ సీజన్‌లో ఇంతవరకూ 14 లక్షలమందికిపైగా యాత్రికులు కేదార్‌నాథ్‌ను సందర్శించగా అందులో దాదాపు లక్షన్నరమంది తమ ప్రయాణానికి హెలికాప్టర్లను ఎంచుకున్నారు. ఈ ప్రాంతంలో హెలికాప్టర్ల వినియోగాన్ని నిషేధించాలని కొందరు పర్యావరణవేత్తలు అయిదేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినప్పుడు దాన్ని తోసిపుచ్చిన ట్రిబ్యునల్‌... వాటి నియంత్ర ణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అవి నిర్దేశిత ఎత్తులో ఎగిరేలా చూడాలనీ, సర్వీసుల సంఖ్యపై కూడా పరిమితులు విధించాలనీ ఆదేశించింది. కానీ ఎవరికి పట్టింది? 

మన దేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో, వాణిజ్య ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో శబ్ద కాలుష్యం ఏయే స్థాయిల్లో ఉండాలో నిర్దేశించారు. ఈ శబ్దకాలుష్యానికి సంబంధించిన నిబంధనల్లో పగలు, రాత్రి వ్యత్యాసాలున్నాయి. కానీ విషాదమేమంటే దేశానికే ప్రాణప్రదమైన హిమశిఖర ప్రాంతాల్లో శబ్దకాలుష్యం పరిమితులు ఏమేరకుండాలో నిబంధనలు లేవు. అక్కడ తిరిగే హెలికాప్టర్ల వల్ల ధ్వని కాలుష్యం సగటున 70 డెసిబుల్స్‌ స్థాయిలో, గరిష్ఠంగా 120 డెసిబుల్స్‌ స్థాయిలో ఉంటున్నదని పర్యావరణవేత్తల ఆరోపణ. దీనిపై నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం లేదా? పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవాలనుకునేవారినీ, ఆ ప్రాంత ప్రకృతిని కళ్లారా చూడాలని తహతహలాడే పర్యాటకులనూ ప్రోత్సహించాల్సిందే. ఇందువల్ల ప్రభుత్వ ఆదాయం పెరగటంతోపాటు స్థానికులకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది. అయితే అంతమాత్రంచేత పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ధోరణి మంచిది కాదు. పర్వత ప్రాంతాల్లో హెలికాప్టర్లు నడపటంలో అనుభవజ్ఞులైనవారిని మాత్రమే పైలెట్లుగా అనుమతించటం, తగిన ఎత్తులో హెలి కాప్టర్లు రాకపోకలు సాగించేలా చూడటం, అపరిమిత శబ్దకాలుష్యానికి కారణమయ్యే హెలికాప్టర్ల వినియోగాన్ని అడ్డుకోవటం తక్షణావసరం. ఈ విషయంలో సమగ్రమైన నిబంధనలు రూపొందిం చటం, అవి సక్రమంగా అమలయ్యేలా చూడటం ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ బాధ్యత. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement