శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా ఆ దేశంకంటే మనకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం రివాజుగా మారింది. ఈసారి కూడా అదే అయింది. శ్రీలంక తీరును నిరసిస్తూ బ్రిటన్ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన తీర్మానానికి 47మంది సభ్య దేశాలుండే మండలిలో మంగళవారం రాత్రి ఓటింగ్ జరిగింది. తీర్మానాన్ని 22 దేశాలు సమర్థించగా, 11 దేశాలు వ్యతిరేకించాయి. 25 ఓట్లతో తీర్మానం గెలిచివుంటే లంకకు సమస్యలెదురయ్యేవి.
కానీ భారత్‌తోపాటు 14 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. తీర్మానం గెలిచితీరాలని బ్రిటన్, దాని మిత్ర దేశాలు శతవిధాల ప్రయత్నించగా, ఇది వీగిపోవాలని శ్రీలంక బలంగా కోరుకుంది. ఏ స్థాయిలో అంటే... లంక ప్రధాని మహిందా రాజపక్స కరోనా భయాన్ని కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్ సందర్శించి ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆ దేశ ప్రధాని హసీనాను కోరారు. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)ను లంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స సంప్రదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా గోతబయ మాట్లాడారు.
తమిళ టైగర్లను అణిచే పేరిట మహిందా రాజపక్స ప్రభుత్వం 2009–10 మధ్య నరమేథం సాగించింది. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతోపాటు ఆ సంస్థలోని వారందరినీ మట్టుబెట్టింది. ఆ నరమేథంలో 40,000మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ తేల్చినా...వాస్తవానికి లక్షకు మించి ప్రాణనష్టం జరిగిందని అనధికార గణాంకాలు చెబుతున్నాయి. ఎల్‌టీటీఈ మహిళా విభాగం కార్యకర్తలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు జరిగాయని, సజీవంగా దహనం చేసిన ఘటనలు కూడా వున్నాయని ఆరోపణలొచ్చాయి.
లక్షలాది తమిళ కుటుంబాలు ప్రాణభయంతో వలస బాటపట్టాయి. ఇందుకు బాధ్యులెవరో గుర్తించి శిక్షించాలని కోరినా శ్రీలంక పెడచెవిన పెట్టడంతో మానవ హక్కుల మండలి పదే పదే ఆ దేశాన్ని అభిశంసిస్తోంది. 2009 మొదలుకొని ఇప్పటివరకూ 8 దఫాలు తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలపై ఓటింగ్ జరిగిన ప్రతిసారీ ఒకే మాదిరి ఫలితం వుంటుంది. చైనా, పాకిస్తాన్, రష్యాలు వాటిని వ్యతిరేకిస్తాయి. లంక సార్వభౌమత్వాన్ని ఈ తీర్మానాలు దెబ్బతీస్తాయని, వీటి వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆ దేశాలు ఆరోపిస్తాయి. సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానంపై రాజకీయ పక్షాలు స్పందిస్తాయి. విమర్శించటమో, సమర్థించటమో చేస్తాయి. రాష్ట్రాలు దాని జోలికిపోవు. కానీ శ్రీలంక విషయంలో తమిళనాడు స్పందిస్తుంది. అక్కడున్న తమిళులకు ఏం జరిగినా తల్లడిల్లుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని, ఆ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతుంది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అది మరింత చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఎవరో కాదు...బీజేపీ మిత్ర పక్షమైన అన్నాడీఎంకే ఆ తీర్మానాన్ని సమర్థించాలని కోరింది. డీఎంకే, ఇతర తమిళ పక్షాలు సైతం ఈ రకమైన డిమాండే చేశాయి. లంక తమిళుల ప్రయోజనాలు కాపాడతామన్న హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ జీరో అవర్‌లో కూడా అన్నా డీఎంకే విజ్ఞప్తి చేసింది. కానీ అందుకు భిన్నంగా మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరు కావటంతో తాజా ఎన్నికల్లో అది చర్చనీయాంశమవుతుంది.
ఆ సంగతెలావున్నా శ్రీలంక విషయంలో దూకుడుగా పోరాదని మొదటినుంచీ మన దేశం భావిస్తోంది. 2009–13 మధ్య మూడు సందర్భాల్లో ఓటింగ్ జరగ్గా, ఆ మూడుసార్లూ మన దేశం లంక వ్యతిరేక తీర్మానాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో యూపీఏలో భాగస్వామిగా వున్న డీఎంకే పట్టుబట్టేది. అది తప్పుకుంటే ప్రభుత్వానికి సమస్యలెదురవుతాయన్న భయంతో చివరివరకూ ఊగిసలాడి, చివరకు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు.
2014లో ఎన్‌డీఏ సర్కారు వచ్చాక మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు మన దేశం గైర్హాజరైంది. అటుపై మూడుసార్లు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేంద్రం ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి కావాలన్న శ్రీలంక తమిళులను సమర్థిస్తున్నామని... అదే సమయంలో లంక సమైక్యత, సుస్థిరత, దాని ప్రాదేశిక సమగ్రత కోరుకుంటున్నామని మన దేశం తెలిపింది. ఈ రెండింటినీ పరిగణించే ఓటింగ్‌కు దూరంగా వున్నట్టు వివరించింది.
అయితే మన పొరుగు దేశంగా వున్న లంకతో లౌక్యంగా వ్యవహరించకతప్పదన్న ఆలోచనే తాజా నిర్ణయానికి కారణమని చెప్పాలి. ఇప్పటికే రాజపక్స సోదరుల ఏలుబడిలో లంక చైనాకు దగ్గరైంది. మన దేశం ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. అక్కడ చైనా పలుకుబడి మరింత పెరగటం భద్రత కోణంలో కూడా మంచిది కాదన్న అభిప్రాయం మన ప్రభుత్వానికుంది. తమిళుల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగ సవరణలను అమలు చేయాలని, లంక ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు జరిపి అధికారాలు వికేంద్రీకరించాలని మన దేశం కోరుతోంది.
ఆ విషయంలో లంక సర్కారు అనుకూలంగానే వున్న సూచనలు వచ్చాయి. హక్కుల మండలి వంటి సంస్థల పాక్షిక ధోరణులపై విమర్శలున్నా నరమేథంపై ఇన్నేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్టున్న లంక తీరు కూడా సమంజసం కాదు. అంతిమంగా అక్కడి తమిళులకు న్యాయం జరిగేలా, వారు ప్రశాంతంగా జీవనం సాగించేలా రాజపక్స ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment