Environment Budget Finish - Sakshi
Sakshi News home page

ఖర్చు తగ్గించుకోకుంటే ఎలా? నేటినుంచి మనమంతా భూమికి అప్పే!

Published Thu, Aug 3 2023 3:37 AM

Environment budget finish - Sakshi

ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్‌ బుధవారంతో పూర్తిగా ఖర్చయిపోయింది. గురువారం నుంచి భూమి అప్పుగా సమకూర్చేదే. కాస్త వింతగా అన్పించినా ఇది వాస్తవం.

ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉన్నట్టే పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్‌ ఉంది. గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ తాజా అంచనా ప్రకారం.. ఆ బడ్జెట్‌ ఆగస్టు 2తో అయిపోయింది. అంటే.. భూగోళానికున్న పర్యావరణ వనరుల సామర్థ్యం (బయో కెపాసిటీ) అంతవరకేనన్నమాట. దీన్నే ‘వరల్డ్‌ ఎర్త్‌ ఆఫ్‌ షూట్‌ డే’అని పిలుస్తున్నారు.

ఇక ఆగస్టు 3 నుంచి మనం వాడేదంతా భూమితన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగాసమకూర్చే అప్పు (అదనపు వనరులు) మాత్రమే.

1.75 భూగోళాలు కావాలి  
గత ఏడాది ఈ పర్యావరణ బడ్జెట్‌ ఆగస్టు 1తోనే అంటే ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే ఒకరోజు ముందే అయిపోయింది. ఈ ఏడాదిలో కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరగడంతో ఒక రోజు అదనంగా సమకూరిందన్నమాట. పర్యావరణ బడ్జెట్‌ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడే ఉండేదట. అంటే 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్‌ ఫుట్‌ప్రింట్‌ నెట్‌వర్క్‌ అంచనా వేసింది.

ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెర గడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కలిసి 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. 

ఎక్కువ వ్యయం చేస్తున్న సంపన్న దేశాలు 
ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాల పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. ఇక ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్‌ 20% మిగులులోనే ఉంటుందన్న మాట. 

ఖతార్‌ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే ఖతం! 
ప్రపంచవ్యాప్తంగా తలసరి వార్షిక పర్యావరణ వనరుల సామర్ధ్యం (బయో కెపాసిటీ) 1.6 గ్లోబల్‌ హెక్టార్లు (బయో కెపాసిటీని, ఫుట్‌ప్రింట్‌ (ఖర్చు)ని ‘గ్లోబల్‌ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఖర్చు (ఫుట్‌ప్రింట్‌) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్‌ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. తక్కువ ఖర్చు చేస్తే ఎక్కువ రోజులు కొనసాగుతుంది.

భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్‌ 1.04 గ్లోబల్‌ హెక్టార్లు. అంటే లభ్యత కన్నా ఖర్చు తక్కువగా (20% మిగులు బడ్జెట్‌) ఉందన్న మాట. ఇక అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతార్‌ పర్యావరణ బడ్జెట్‌ ఫిబ్రవరి 10నే అయిపోవడం గమనార్హం. కెనడా, యూఏఈ, అమెరికాల బడ్జెట్‌ మార్చి 13తో, చైనా బడ్జెట్‌ మే 1తో అయిపోగా, ఆగస్టు 12న బ్రెజిల్, డిసెంబర్‌ 20న జమైకా బడ్జెట్లు అయిపోతున్నాయి.  

ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. 
వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టే భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వర్షాలు, కరువు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం పర్యావరణ వనరులు అతిగా కొల్లగొడు తున్న దాని ఫలితమే. పర్యావరణ లోటు బడ్జెట్‌తో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. పర్యావరణ వార్షిక బడ్జెట్‌ 365 రోజులకు సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి.  

ముఖ్యంగా ఐదు పనులు చేయాలి. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి వనరుల తక్కువ వినియోగానికి వీలుగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. 
– సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement