ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది.
స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది...
ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి?
అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో.
చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది.
చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసింది.
ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది.
కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి.
ఫొటోల ద్వారా ఎన్విరాన్‌మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది.
‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి.
‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది.
ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది.
‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి.
‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి.
ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,,
‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’
అయితే ఆరతిలాంటి ఎన్విరాన్‌మెంటల్ ఫొటోగ్రాఫర్‌లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment