టైరే కదా అని నిర్లక్ష్యం వద్దు.. పేలుతుంది.. జాగ్రత్త..! | Scorching Heat, How To Prevent Tyre Bursts? Check Important Tips | Sakshi
Sakshi News home page

టైరే కదా అని నిర్లక్ష్యం వద్దు.. పేలుతుంది.. జాగ్రత్త..!

Published Fri, Apr 25 2025 3:36 PM | Last Updated on Fri, Apr 25 2025 3:58 PM

Scorching Heat, How To Prevent Tyre Bursts? Check Important Tips

 వేసవి వేడికి టైర్లపై అదనపు ఘర్షణ 

పాత టైర్లు అధిక ఒత్తిడికి పేలే ప్రమాదం 

దూర ప్రయాణాల్లో ప్రమాదం అధికం  

టైర్లను పరీక్షించాకే ప్రయాణం చేయండి 

పాత టైర్లను మార్చివేయటమే ఉత్తమం 

వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు పైనుంచి ఎండ.. మరోవైపు రోడ్డు వేడి.. బైకో, కారో తీసుకొని రోడ్డుపైకి వెళ్తే టైర్లు ఉన్నట్టుంది పేలిపోయే ప్రమాదం ఈ సమయంలో అధికంగా ఉంటుంది. పాత టైర్లకైతే ఈ ప్రమాదం మరీ ఎక్కువ. ప్రతి వేసవిలోనూ టైర్లు పేలి రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్తలు చూస్తూనే ఉంటాం. అందుకే ఈ సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాలకు ముందు వాహన టైర్ల పటుత్వం కచ్చితంగా తెలుసుకోవాలి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు టైర్ల లోపల గాలిపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో టైర్లు వేడెక్కి సమస్యలు సృష్టిస్తుంటాయి. 

వేసవిలోనే ఎందుకంటే..  
టైర్ల వయస్సు: అరిగిపోయిన పాత టైర్లు అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఒత్తిడిని తట్టుకోలేకపోవచ్చు. అవి పగిలిపోయే అవకాశం అధికం. 
టైర్‌ ప్రెజర్‌: టైర్‌ పగిలిపోవడానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి ఒత్తిడి. తక్కువగా గాలి ఉన్నప్పుడు డ్రైవింగ్‌ చేస్తుంటే టైర్‌ పైకి కిందికి బౌన్స్‌ అవుతుంది. దీంతో అదనపు ఘర్షణ ఏర్పడుతుంది. వేసవి వేడితో ఈ అదనపు ఘర్షణ తోడవడం వల్ల టైర్లు బలహీనపపడి పగిలిపోతాయి. ఈ సమస్య వేసవిలో మరీ ఎక్కువ.  

అధిక వేగం: టైర్లు పగిలిపోవడానికి మరొక సాధారణ కారణం అధిక వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించటం. దీనివల్ల వేడి జనించి టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. వాహనం బరువు, రోడ్డు ఉపరితలం నుంచి వచ్చే వేడితో టైర్లు అధిక ఒత్తిడికి గురై పగిలిపోవచ్చు.  

లోపభూయిష్ట టైర్లు: టైర్లు అరిగిపోయాయా, దెబ్బతిన్నాయా? అని నిర్ధారించుకోవాలి. ఎల్లప్పుడూ వాటి నాణ్యతను తనిఖీ చేయాలి. కోతలు, పగుళ్లు, ఉబ్బెత్తులు లేదా దెబ్బతిన్న టైర్లు వేసవిలో అధిక ఒత్తిడి కారణంగా పగిలిపోతాయి.  

వాహన బరువు: వాహనం బరువు ఎక్కువ లేకుండా జాగ్రత్తపడాలి. తద్వారా వేసవిలో టైర్లపై ఒత్తిడిని తగ్గించడంతోపాటు ఇంధన సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది.  

టైర్‌ పగిలిపోతే: ప్రశాంతంగా ఉండాలి. వాహనంపై నియంత్రణతో ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ భయపడకూడదు. భయాందోళనకు గురైతే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు.  

భారీ బ్రేకింగ్‌ను నివారించాలి: హఠాత్తుగా బ్రేక్‌ వేయాలనుకున్నప్పటికీ పేలిన టైర్‌పై ఎక్కువగా బ్రేక్‌ వేస్తే వాహనంపై నియంత్రణ కోల్పోవచ్చు. మంచు మీద డ్రైవింగ్‌ చేస్తున్నట్టు ఊహించుకొని సున్నితంగా బ్రేక్స్‌ వాడాలి. ముందు వైపున్న టైర్లు పగిలిపోతే బ్రేక్‌ అస్సలు ఉపయోగించవద్దు. వెళ్లాల్సిన దిశలో వాహనాన్ని నెమ్మదిగా నడిపించాలి. ట్రాఫిక్‌లో ఉన్నా, ఇతర వాహనదారులు చుట్టూ ఉన్నా సమస్య ఉందని వారికి తెలిసేలా హజార్డ్‌ లైట్లను ఆన్‌ చేయాలి.  

ఇదీ చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!

యాక్సిలరేటర్‌ని ఉపయోగించాలి: బ్రేక్స్‌కు బదులు యాక్సిలరేటర్‌ను ఉప యోగించాలి. స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకోవాలి. తద్వారా వాహనాన్ని సరళ రేఖలో నడిపించగలుగుతారు.  

సురక్షిత ప్రదేశంలో: వాహనాన్ని సురక్షిత ప్రదేశం వైపు తీసుకెళ్లి ఆపాలి. హజార్డ్‌ లైట్లను ఉంచడం మర్చిపోవద్దు. రిఫ్లెక్టివ్‌ వార్నింగ్‌ ట్రయాంగిల్‌ పరికరాలు ఉన్నట్టయితే వాహనం ముందు, వెనుక వైపు ఉంచాలి.  

చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్‌, లగ్జరీ కారు : ఎవరీ నటుడు

తప్పనిసరి జాగ్రత్తలు:  
అరిగిన, కాలం చెల్లిన టైర్లను తక్షణమే మార్చుకోవాలి.  
టైర్లు పరీక్షించి ఎక్కడ లోపం ఉన్నా సరిదిద్దుకోవాలి.     

 -సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement