హార్ట్‌ టచింగ్‌ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే.. | Full Story Behind The Viral Grandmother-Granddaughter Photo | Sakshi
Sakshi News home page

హార్ట్‌ టచింగ్‌ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..

Published Wed, Aug 22 2018 7:17 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

Full Story Behind The Viral Grandmother-Granddaughter Photo - Sakshi

వృద్ధాశ్రమంలో కలుసుకున్న నాన్నమ్మ-మనవరాలు

అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్‌ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. 

ఓ స్కూల్‌ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్‌ ఫీల్డ్‌ ట్రిప్‌లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్‌లోని ఓ ఫోటోగ్రాఫర్‌ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్‌’లో ఫ్రంట్‌ పేజీలో పబ్లిష్‌ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్‌గా మారింది. ఆ ఫోటో ఫేస్‌బుక్‌లో పెద్ద ఎత్తున షేర్‌ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.      

2007 సెప్టెంబర్‌ 12న ఫోటోజర్నలిస్ట్‌ కల్పెష్ ఎస్‌ భరేచ్‌కు గుజరాత్‌ మనినగర్‌లోని జీఎన్‌సీ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్‌ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్‌ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్‌ ట్రిప్‌ను కవర్‌ చేయమని ప్రిన్సిపాల్‌ కోరారు. భరేచ్‌, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్‌ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్‌ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్‌ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్‌ చెప్పాడు. 

ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్‌లో ఫ్రంట్‌ పేజీలో పబ్లిష్‌ చేశారు. గుజరాత్‌ అంతటా అప్పట్లో ఇదే బిగ్‌ డిబేట్‌. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్‌ స్టోరీగా బ్రాడ్‌కాస్ట్‌ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్‌ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 

10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్‌ అవుతుంది....
ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లను తమ కెరీర్‌లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్‌ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్‌.. తన బెస్ట్‌ ఫోటోలన్నింటిన్నీ షేర్‌ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. భరేచ్‌ ప్రస్తుతం దివ్య భాస్కర్‌లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్‌ మీడియా వైరల్‌ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్‌ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్‌ కొడుకు దీపమ్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టులో తెలిపాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement