world photography day
-
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం.. ‘సాక్షి’ స్పెషల్ ఫొటోలు
-
న్యూస్ ఫొటో కాంపిటీషన్లో ఉత్తమ చిత్రాల ఎంపిక
కాచిగూడ (హైదరాబాద్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫొటో జర్నలిస్టుల సంఘం నిర్వహించిన రాష్ట్రస్థాయి న్యూస్ ఫొటో కాంపిటీషన్–2024లో 31 జిల్లాల నుంచి 100 ఎంట్రీలు వచ్చాయని సంఘం అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, కార్యదర్శి కేఎన్ హరి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్, ముఖ్యమంత్రి సీపీఆర్ఓ బి.అయోధ్య రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్ సుశీల్ రావు, సీనియర్ ఫొటో జర్నలిస్టు హెచ్.సతీష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.మోహనాచారి (హైదరాబాద్), బి.శివప్రసాద్ (సంగారెడ్డి), వి.భాస్కరాచారి (మహబూబ్‌నగర్) తీసిన చిత్రాలు కన్సొలేషన్ విభాగంలో విజేతలుగా నిలిచాయన్నారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఈ ఛాయా చిత్ర ప్రదర్శనను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారని, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. -
World Photography Day: వారియర్ కెమెరా: కర్తవ్యాన్ని గుర్తు చేసే కెమెరా కన్ను
ఆరతి కెమెరాతో మాట్లాడి చూడండి... చేపల సవ్వడి లేని నదుల దీనత్వాన్ని గురించి చెబుతుంది. చేవ లేని జీవజాలాన్ని గురించి చెబుతుంది. పచ్చదనాన్ని కోల్పోయి నేలకూలనున్న నిర్జీవ వృక్షాల మృత్యుఘోష చెబుతుంది. నదుల నీటిలోని విషాన్ని గురించి వివరంగా చెబుతుంది. స్థూలంగా చెప్పాలంటే...కనిపించే అందాల వెనుక కనిపించిన నిశ్శబ్ద విధ్వంసాన్ని గురించి కళ్లకు కడుతూ చెబుతుంది. బెంగళూరుకు చెందిన ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్ ఆరతి కుమార్ రావు తన కెమెరాతో పర్యావరణ సంరక్షణం గురించి క్షణం క్షణం గుర్తు చేస్తోంది... ప్రతి కెమెరాకు ఒక దృష్టి ఉంటుంది. మరి ఆరతి కెమెరా చూసేది ఏమిటి? అట్టడుగున పడి కన్పించని కథలు, నిజజీవిత కథలు, పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నా ఎవరూ పట్టించుకోని కథలు, సంప్రదాయ జీవనశైలులు, వాటిలో వస్తున్న అనూహ్య మార్పులు, పదాలకు దొరకని దృశ్యాలు...ఇలా ఎన్నో ఎన్నెన్నో. చిన్నప్పటి నుంచి ‘నేషనల్ జియోగ్రఫి’ పత్రికలను చూస్తూ పెరిగింది ఆరతి. ఆ ఎల్లో బార్డర్ విండోస్ నుంచి విశాలమైన ప్రపంచాన్ని చూసింది. ఆ పత్రికలోని ఫొటోగ్రాఫ్స్ తనపై ఎంతో ప్రభావం చూపాయి. పదాలతోనే కాదు చిత్రాలతో కూడా గొప్ప సత్యాలు చెప్పవచ్చుననే విషయం అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఫిజిక్స్ అంటే ఇష్టం ఉన్న ఆరతి బయోఫిజిక్స్లో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ‘లైఫ్‌టైమ్ టు–డూ’ రూపంలో భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దానిలో నదులతో పరిచయం ఒకటి. నదులను, వాటి చుట్టూ ఉండే జీవితాన్ని ఫొటోల రూపంలో డాక్యుమెంట్ చేయాలనుకుంది. కాళ్లకు బలపాలు, కళ్లకు కెమెరాలు కట్టుకొని ఊరూరు తిరిగినా తల్లిదండ్రులు ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివిధ ప్రాంతాలలో తన ఫొటోగ్రఫీకి సంబంధించిన విషయాలను కుటుంబసభ్యులతో పంచుకునేది ఆరతి. ఫొటోల ద్వారా ఎన్విరాన్మెంటల్ స్టోరీ టెల్లింగ్‌లో నేర్పు సంపాదించిన ఆరతి తన ప్రయాణంలో ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. పర్యావరణం గురించి మాట్లాడే వారిని అభివృద్ధి వ్యతిరేకులుగా భావించే వారిని కూడా చూసింది. ‘రివర్ డైరీస్’ అనేది ఆమె ప్రస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకుంది. నదుల అందాలతో పాటు వాటికి ఎదురవుతున్న ఆపదలకు ‘రివర్ డైరీస్’ అద్దం పడతాయి. ‘హింస, వివాదాలు మాత్రమే హెడ్‌లైన్‌గా కనిపిస్తాయి. అయితే పర్యావరణ విధ్వంసం అనే భయానకమైన కనిపించని హింస చాపకింద నీరులా కొనసాగుతుంది’ అంటుంది ఆరతి. ఆ కనిపించని హింసమూలాలను నలుగురికి తెలియజేసేలా చేయడంలో తన కెమెరాను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటోంది. ఆరతి ఫొటోగ్రాఫర్ మాత్రమే కాదు రచయిత్రి కూడా. ఆమె పుస్తకాలలో ‘మార్జిన్‌ల్యాండ్స్: ఇండియన్ ల్యాండ్‌స్కేప్స్ ఆన్ ది బ్రింక్’ ఒకటి. ఇందులో లడఖ్ నుంచి సుందరబన్ వరకు ప్రకృతికి సంబంధించిన ఎన్నో సుందరచిత్రాలను కళ్లకు కడుతుంది. గంగ– బ్రహ్మపుత్ర–మేఘన పరీవాహక ప్రాంతాలకు తీసుకువెళుతుంది. భౌగోళిక అందాలతో పాటు ఎదురవుతున్న ప్రమాదాలను, అక్కడి ప్రజలు మాట్లాడుకునే పదాలను పరిచయం చేస్తుంది. ‘నిర్మాణాలు, ఇతరత్రా విధ్వంసక కార్యకలాపాల వల్ల ప్రమాదం అంచున ఉన్న ప్రకృతిని కాపాడు కోవడం అనేది మన చేతిలోనే ఉంది’ అని ఈ పుస్తకం ద్వారా చెబుతుంది ఆరతి. ‘పర్యావరణంలో వచ్చే మార్పులు, అవి మన జీవితాల్లో తెచ్చే మార్పులను నా కెమెరా ద్వారా ఇక ముందు కూడా కథలుగా చెప్పాలనుకుంటున్నాను’ అంటోంది ఆరతి. ఒకానొక సందర్భంలో తన నిరసన గళాన్ని ఇలా వినిపించింది ఆరతి,,,, ‘కరువుకాటకాలు, వరదలలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మాత్రమే పర్యావరణ విధ్వంసం, పరిరక్షణ గురించి మాట్లాడుకుంటారు. ఆ తరువాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు’ అయితే ఆరతిలాంటి ఎన్విరాన్మెంటల్ ఫొటోగ్రాఫర్లు తమ చిత్రాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. -
డిలీట్.. డిలీట్.. డిలీట్... ఒకప్పటిలా ఆ కిక్కు ఇప్పుడు లేదు
పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కుమార్తె ఫొటో తండ్రికి జీవిత కాలపు తోడుయవ్వనంలో ఉన్నప్పుడు నాన్న తీయించుకున్న ఛాయా చిత్రం అమ్మ దాచుకున్న రహస్యం. బీరువాలో దొరికే నానమ్మ ఫొటో బాల్యానికి దగ్గరి దారి. గోడ మధ్యన వేలాడుతూ కనిపించే టెన్త్ క్లాస్ గ్రూప్ ఫొటో ఎన్నో జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్. పెళ్లి ఆల్బమ్‌లు, విహారాల ఫొటోలు చిటికెలో బాధను మాయం చేయగల మందులు. ఫొటో అంటే కేవలం కాగితం కాదు .. అందరి గతం. కాలాన్ని బంధించే శక్తి దీనికి మాత్రమే ఉంది. జ్ఞాపకాల ఖజానా టెక్కలి: ఫొటో తీయడం.. బాగులేకపోతే డిలీట్ చేయడం. ఫొటోగ్రఫీ గతం కంటే ఈజీ అయిపోయింది. డిజిటల్ వచ్చినప్పటి నుంచి ఫొటోలు తీయడంలో ఉన్న కిక్కు పోయింది. కెమెరా కడుపులో రీళ్లు ఉన్నప్పుడు అపురూప క్షణం కోసం గంటల కొద్దీ వేచి ఉండడం, సరైన చిత్రాన్ని తీయడానికి ఏకాగ్రతతో ఎదురు చూడడం, తదేక దీక్షతో క్లిక్ మనిపించడం చాలా మందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. మెమొరీ కార్డులు వ చ్చి రీళ్లకు సమాధి కట్టేశాయి. పాత తరం కెమెరాను చూస్తే చాలాకాలానికి చూసిన బంధువులా అనిపిస్తుంది. బాల్య జ్ఞాపకమేదో కళ్ల ముందు కనిపిస్తుంది. అలాంటి జ్ఞాపకాల పెట్టెలను టెక్కలికి చెందిన హనుమంతు మల్లేశ్వరరావు సేకరిస్తున్నారు. వృత్తిరీత్యా వీడియో ఎడిటర్ అ యిన మల్లేశ్వరరావు పాతతరం కెమెరాలు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద ఉన్న పా తతరం కెమెరాలను సేకరించడం మొదలు పెట్టారు. 50 ఏళ్ల నాటి కెమెరాను పరిశీలిస్తున్న మల్లేశ్వరరావు గత కొన్ని రోజులుగా పాతతరం కెమెరాల సేకరణ వేటలో నిమగ్నమయ్యారు. యాభై ఏళ్ల కిందటి కెమెరాలను కూడా సేకరించారు. సాగరసంగమం సినిమాలోని ఓ సన్నివేశంలో కమల్‌హాసన్‌కు ఓ బాలుడు ఫొటోలు తీసే కెమెరా అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కెమెరాను కూడా సంపాదించారు. రీల్ కెమెరా నుంచి ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్షన్ డిజిటల్ కెమెరాల వరకు వివిధ రకాల వీడియో, ఫొటో కెమెరాలను సేకరించి భద్రపరిచారు. మల్లేశ్వరరావు వీడియో కెమెరాల్లో ఎన్ఈజీఎస్, త్రీసీసీడీ, 3500 తో పాటు మరి కొన్ని పాతతరం వీడియో కెమెరాలు మల్లేశ్వరరావు వద్ద ఉన్నాయి. వీటితో పాటు వివిధ రకాల రీల్ కెమెరాలతో పాటు సరికొత్త 7డీ, 70డీ, ఫోర్‌కె, గోప్రో, గింబల్, స్లైడర్ తదితర కెమెరాలను సేకరించారు. విహంగాలతో దోస్తీ జి.సిగడాం: వృత్తి రీత్యా ఆయన ఇంజినీర్. ఓ ఉన్నత సంస్థలో ఉద్యోగం. తలమునకలయ్యే పని. కానీ ఆయన ఒక రోజు పని చేస్తున్న సమయంలో ఓ పక్షి ప్రాణాల కోసం కొట్టుకుంటూ నేల మీద పడింది. ఆయన దాన్ని రక్షించి పంజరంలో పెట్టి కాపాడారు. ఆ క్షణం నుంచి ఆ ఇంజినీర్ జీవితం మరో మేలి మలుపు తిరిగింది. పక్షులపై ప్రేమ పెరిగింది. కెమెరా కంటితో పక్షుల కదలికలు చూడడం అలవాటైంది. సాధారణంగా పక్షులను చూసి ఆస్వాదించే కంటే ఫొటోలు తీసి ఆ క్షణాలను నిక్షిప్తం చేయడంలో మజా తెలిసింది. ఇంకే ముంది అప్పటి నుంచి పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 105 రకాల పక్షుల ఫొటోలు తీసి భద్రపరిచారు. కిశోర్ తీసిన పక్షుల చిత్రాలు జి.సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన పెరుంబుదూరి నర్సిహంమూర్తి పెద్ద కుమారుడు పెరుంబుదూరి కిశోర్ పక్షుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇటీవలే సొంత ఊరికి వచ్చి కిశోర్ ప్రతి రోజు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి పక్షుల ఫొటోలు సేకరిస్తున్నారు. అవి ఎలా గుడ్లు పెడుతున్నాయి, బుల్లి పిట్టలు ఎలా జన్మిస్తున్నాయి, వాటి ఆహారం ఎలా పంచుకుంటున్నాయి అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల తామర ఆకులపై నెమలి తోక జకనా అనే పక్షి రాకపోకలు, విన్యాసాలను ఫొటోలు తీసి నిక్షిప్తం చేశారు. గుడ్లు పెట్టిన దశ నుంచి పొదిగే దశ వరకు అన్నింటినీ సేకరించారు. ఈ ఫొటోల కోసం సెలవుల్లో అటవీ ప్రాంతాలకు వెళ్తుంటారు. -
World Photography Day: ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు’
World Photography Day 2022: ఇల్లు అలకగానే పండగ కాదు. సెల్‌ఫోన్‌తో అల్క(తేలిక)గా క్లిక్ అనిపించగానే ఫొటో కాదు. కాస్త కళా పోసన ఉండాలా. అది ఉంటే... పబురన్ బసు మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చు... పబురన్ బసు తండ్రి కెమెరాను చేతుల్లోకి తీసుకునే నాటికి తన వయసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. తండ్రి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కావడం వలన ఉత్తర కోల్‌కతాలోని ఆ ఇంట్లో ఎటు చూసినా రకరకాల ఫొటోగ్రాఫిక్ ఎక్విప్మెంట్లు కనిపించేవి. తనకు తోచినట్లు గా వాటితో ఏవో ప్రయోగాలు చేస్తుండేవాడు బసు. కోవిడ్ కల్లోలంతో అందరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ తీరిక సమయాన్ని బాగా ఉపయోగించుకున్నాడు బసు. ఫొటోగ్రఫీపై పూర్తిగా దృష్టి పెట్టాడు. మ్యూజియం ఆఫ్ మోడ్రన్ ఆర్ట్, న్యూయార్క్ ఆన్లైన్ ఫొటోగ్రఫీ కోర్స్ పూర్తిచేశాడు. ఫొటోగ్రఫీ లోతుపాతులు తెలుసుకోవడానికి ఇది తనకు ఎంతగానో ఉపయోగపడింది. ఫొటోగ్రఫీకి సంబంధించిన మ్యాగజైన్లు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. PC: Pubarun Basu ‘ఇలా నేను తీయగలనా?’ సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్‌ల గురించి ఎప్పుడూ వింటుండేవాడు బసు. బహుమతి గెలుచుకున్న ఫొటోలను చూస్తూ అబ్బురపడేవాడు. ‘ఇలా నేను తీయగలనా?’ అనుకునేవాడు. పోటీలో తొలిసారి పాల్గొన్నప్పుడు ఎలాంటి అవార్డ్లు రాలేదుగానీ, తన ఫొటో గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రశంసాపూర్వకమైన వాక్యాలు రాశారు ఎడిటర్. ఇది తనకు ఎంతో కిక్ ఇచ్చింది. తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. అద్భుతం ఆవిష్కృతం! కొన్నిసార్లు సందర్భాలు అద్భుతమైన అవకాశాన్ని సృష్టిస్తాయి. అలాంటి సువర్ణ అవకాశం ఒకరోజు తనకు వచ్చింది. అవి లాక్డౌన్ రోజులు. కిటికీ నుంచి వస్తున్న సూర్యకిరణాల నీడ కర్టెన్పై పడుతోంది. తనకు వెంటనే ఒక ఐడియా తోచింది. ‘అమ్మా! తెర వెనుక వెళ్లి చేతులు ఆనించు’ అన్నాడు తల్లితో. ఆమె అలాగే చేసింది. నిజంగా ఒక అద్భుతం ఆవిష్కారం అయింది. ఆ ఫొటోకు ‘నో ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ’ అని పేరు పెట్టి ‘సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్–2021’కి పంపాడు. ఆ ఫొటో తనని ‘యూత్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ గెలుచుకునేలా చేసింది. ‘ఇది నిజమేనా?’ అని తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కేలేదు! అంతర్జాతీయ అవార్డ్ దక్కించుకున్నంత మాత్రాన ‘ఇక నాకు ఎదురులేదు’ అనుకోవడం లేదు బసు. అలా అనుకోకూడదు! ‘ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను... అని ఎప్పుడూ అనకూడదు. నేర్చుకుంటూనే ఉన్నాను అని మాత్రమే అనాలి’ అంటూ తండ్రి చెప్పిన మాట తనకు బాగా గుర్తుండిపోయింది. బీబిసి, నేషనల్ జాగ్రఫీ... మొదలైన ఫొటోగ్రఫీ పోటీల్లో కూడా బహుమతులు గెలుచుకున్నాడు బసు. PC: Pubarun Basu ‘సెల్కెమెరా కావచ్చు, మామూలు కెమెరా కావచ్చు అవి ఫొటోగ్రాఫర్ క్రియేటివిటీకి పరిమితులు విధించలేవు. ఖరీదైన కెమెరాలతో మాత్రమే ఆహా అనిపించే ఫొటోలు వస్తాయనడంలో నిజం లేదు. తమ దగ్గర ఉన్న సాదాసీదా కెమెరాలతోనే అద్భుతమైన ఫొటోలు తీస్తున్న స్ట్రీట్ ఫొటోగ్రాఫర్లే దీనికి ఉదాహరణ’ అంటున్న బసు తన కెమెరా ద్వారా సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చెప్పాలనుకుంటున్నాడు. ఫిల్మ్‌మేకింగ్‌లోకి వెళ్లాలనేది అతడి భవిష్యత్ కల. చదవండి: Divine Space: శ్వాసపై ధ్యాస Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! -
సిటీలో ఇండియన్ ఫొటో ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్ ఫొటో ఫెస్టివల్, హెచ్ఎండీఏ, క్రెడాయ్ సంయుక్తంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికోసం 85 దేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు తమ అత్యుత్తమ ఫోటోలను ఎంట్రీలుగా పంపించారని ఇండియన్ ఫోటో ఫెస్టివల్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అక్విన్ మాథ్యూస్ తెలిపారు. ఫొటో జర్నలిజం, డాక్యు మెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, పోట్రెయిట్, వెడ్డింగ్, మొబైల్స్... మొత్తం 8 కేటగి రీల్లో ఎంపికైన అత్యుత్తమ ఫోటోలకు మొత్తం రూ.25లక్షల పారితోషికాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఫొటో ఉత్సవానికి వచ్చిన ఎంట్రీల ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. వివిధ దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఈనెల 19 నుంచి వచ్చేనెల 19వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును బహూకరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడారు. -
ఫొటోలు తీసిన పశ్చాత్తాపం.. ఊపిరిలో విషా(దా)న్ని నింపింది
World Photography Day 2021: 1993 మార్చి 26 ఉదయం.. పబ్స్ట్ హోటల్లోని ‘న్యూయార్క్ టైమ్స్’ పేపర్ హెడ్ ఆఫీసులో ఫోన్ మారుమోగుతోంది. రిసెప్షనిస్ట్ రెబెకా అవతలి నుంచి అడుగుతున్న ఒక్కటే ప్రశ్నకు.. ‘తెలీదండీ’ అనే సమాధానం చెప్పీ చెప్పీ విసుగెత్తిపోయింది. ఆ వెంటనే పార్ట్ టైం ఫొటోగ్రాఫర్ కెవిన్ కార్టర్‌కు ఫోన్ కాల్ కలిపింది. ‘సర్.. ఆ పాప ఇంతకీ బతికి ఉందా? లేదా? అని చాలామంది అడుగుతున్నారు ఏం చెప్పామంటారు’ అంటూ విసుగ్గా అడిగింది రెబెకా. ‘నేను ఆఫీస్‌కు వస్తున్నా..’ అంటూ ఫోన్ పెట్టేశాడు కెవిన్. ఈ ప్రశ్న కెవిన్నూ చనిపోయేంత వరకు వెంటాడుతూనే వచ్చింది. వాంటింగ్ ఏ మీల్.. ఆకలి కేకలతో బక్కచిక్కిన పసికందు.. ఆ వెనకాలే ఆకలితో పసికందు మరణం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రాబందు.. ఇదీ కెవిన్ తీసిన ఫొటో. ఆ స్థితిలో అక్కడుంది ఒక్క రాబందు కాదు.. రెండు!. ఆ పాపకు పట్టెడు అన్నం పెట్టే పరిస్థితి ఉన్నా.. కనికరం లేకుండా కెమెరాలెన్స్ ఎక్కుపెట్టిన కెవిన్ కార్టర్ కూడా ఓ రాబందే. యావత్ ప్రపంచం నుంచి మానవత్వం ఈ విమర్శను ఎక్కుపెట్టింది. దిగజారిన ప్రొఫెషనల్ ఫొటో జర్నలిజం పోకడకు అద్దం పట్టిన ఆ చిత్రం.. చరిత్రకెక్కింది. 1994 మే 23.. కొలంబియా యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో చప్పళ్ల మధ్య ‘వాంటింగ్ ఏ మీల్’ ఫొటోకు పులిట్జర్ అవార్డును స్వీకరించాడు కెవిన్. కానీ, ఆ ఫొటో తీసిన పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో కెవిన్‌కు తన గతాన్ని గిర్రున తిరిగేలా చేసింది. ఎక్కడో యూరప్ నుంచి దక్షిణాఫ్రికాకు వలసవచ్చి స్థిరపడింది కెవిన్ కుటుంబం. కానీ, కెవిన్‌కు నల్లజాతీయులపై ఫుల్ సింపథీ ఉండేది. ఫార్మసీ చదివి.. అక్కడున్న రూల్స్ మూలంగా సైన్యంలో చేరాడు. ఓరోజు.. తన తోటి సైనికుడ్ని(నల్ల జాతీయుడ్ని) మిగతావాళ్లు కొడుతుంటే అడ్డుకున్నాడు. బానిసలను వెనకేసుకొస్తావురా... ‘ని** లవర్’ అంటూ వారు కెవిన్‌ను తన్నారు. ఆ అవమానం భరించలేక డర్బన్ పారిపోయాడు కెవిన్. ఉద్యోగం దొరక్క.. ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చేర్పించడంతో ఎలాగోలా బతికి బట్టకట్టాడు. వేరే దారిలేక మళ్లీ జోహాన్నెస్ బర్గ్ కే వచ్చి సైన్యంలో చేరాడు. అక్కడ ఓ బాంబు పేలుడులో గాయపడి.. ఆర్మీ సర్వీసు నుంచి బయటికొచ్చాడు. కెమెరాలతో సహజీవనం మళ్లీ ఉద్యోగాల వేటలో ఓ కెమెరాల షాపులో పనికి కుదిరాడు. చుట్టూ కెమెరాలు.. లెన్స్‌లు కెవిన్‌కు ఇష్టం పెరిగింది. ఫొటోగ్రఫీలో అత్యంత కీలకమైన లైవ్ క్యాప్చర్ మూమెంట్స్‌ను తీయడమెలాగో నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు స్థానికంగా ఓ పత్రికలో పార్ట్ టైం స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్ గా చేరాడు. పేరుకే అందులో ఉన్నా.. సెన్సేషన్ కథనాలపైనే అతని ఫోకస్ ఉండేది. కెవిన్ అతని మరో ముగ్గురు స్నేహితులూ(ముగ్గురూ పొటోగ్రాఫర్లే) కలిసి.. దక్షిణాఫ్రికా ఉద్యమాన్ని చిత్రీకరించేవాళ్లు. అందరికంటే ముందుగా అక్కడ వాలిపోవడం, అరుదైన కోణాల్లో ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడం.. కెవిన్ అండ్ కోకు బాగా అలవాటైంది. బ్యాంగ్ బ్యాంగ్ క్లబ్ పేరు వచ్చేసింది వాళ్ల సాహసాలకు. ఒకసారి నల్లవారు ఒక శ్వేత యువకుణ్ని పట్టుకుని విపరీతంగా హింసించి తగలబెట్టిన దృశ్యాల్ని చిత్రీకరించారు. ఆ సీన్‌తో కెవిన్లో భయాందోళనలు పెరిగాయి. దాని నుంచి ఊరట కోసం డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు కెవిన్. 1991లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతుదారులైన నల్లవాళ్లు.. ఓ శ్వేత జాతీయుణ్ని హత్యచేస్తుండగా తీసిన ఫొటోకు గాను కెవిన్ క్లోజ్ ఫ్రెండ్ ఊస్టర్ బ్రోక్ కు పులిట్జర్ అవార్డు వచ్చింది. స్నేహితుడి విజయం.. కెవిన్లో అసూయను పెంచింది. ఎలాగైనా తాను పులిట్జర్ కొట్టాలని కసిగా ప్రయత్నాలు చేశాడు. అందుకోసం మరో స్నేహితుడైన సిల్వాతో కలిసి సుడాన్ కరవును చిత్రీకరించడానికి వెళ్లాడు. అక్కడ తీసిందే ఈ పసికందు-రాబందు ఫొటో. డిప్రెషన్.. పశ్చాత్తాపం ఆ తర్వాత కెవిన్ కెరీర్.. సిగ్మా, రాయ్ టర్స్ లాంటి ప్రముఖవార్తా సంస్థలతోనూ సాగింది. రిస్క్ చేసి తీసిన ఫొటోలు.. ఫ్రంట్ పేజీ ఫొటోలుగా ఇంటర్నేషనల్ మాగజీన్లలో పబ్లిష్ అయ్యాయి. 1994 ఏప్రిల్ 18న కెవిన్.. తన మిగతా ఇద్దరు స్నేహితులతో కలిసి టొకోజా టౌన్ షిప్లో జరుగుతున్న అల్లర్లను చిత్రీకరించడానికి వెళ్లాడు. కానీ, హడావిడిగా ఏదో పని మీద మధ్యలోనే వెళ్లిపోయాడు. కాసేటికే అక్కడ కాల్పులు జరిగి ఊస్టర్ బ్రోక్ చనిపోయాడు. ఆ వార్త విని కెవిన్ గుండె బద్ధలయ్యింది. డ్రగ్స్‌ను ఎక్కువగా వాడేశాడు. చేతిలో డబ్బులు లేవు. పైగా అప్పులు. భార్య అతణ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఉద్యోగం రిస్క్‌లో పడింది. ‘తట్టుకోలేకపోతున్నాను.. ఫోన్ లేదు, డబ్బులేదు, అప్పులు... కళ్లముందే ఘోరమైన చావులు, బతుకుపోరాటాలు, హాహాకారాలు, ఆకలితో పేగులు మాడిన చిన్నారులు... విసిగిపోయాను. నాకింక శక్తి లేదు. అందుకే వెళ్లిపోతున్నాను... నా స్నేహితుడు ఊస్టర్ బ్రోక్ దగ్గరికి... అంతటి అదృష్టం నాకు ఉంటే’.. ఇది కెవిన్ కార్టర్ రాసిన సూసైడ్ లేఖ. 1994, జులై 27.. చిన్నతనంలో ఎక్కడైతే ఆడుకున్నాడో.. అక్కడే తన వ్యాన్ సైలెన్సర్ కు ఒక పైపు బిగించి దాన్ని కిటికీ గుండా లోపలికి చేరవేసి బండి స్టార్ట్ చేశాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్ మెన్లో తనకిష్టమైన పాటలు వింటూ కళ్లు మూసుకున్నాడు. అలా ఆ విష వాయువుకు అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఏ ఫోటో అయితే అతనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందో.. అదే అంతకు మించిన నిర్వేదాన్ని కెవిన్‌కు మిగిల్చింది. కనిపించేంత దూరంలో ఆకలి తీర్చే కేంద్రం. కానీ, ఆ పసికందుకు ఓపిక లేదు. వెనుకనే రెక్కలు విప్పిన రాబందు ఇద్దరి ఆకలి తీరడానికి కొన్ని అడుగులే దూరం... ఎండలో ఎంతోసేపు చూసి విసిగిపోయిన కెవిన్ ‘క్లిక్’మనిపించాడు. వాంటింగ్ ఏ మీల్... ఎవరి ఆకలి తీరింది? కోంగ్ న్యోంగ్.. ఆ పసికందు పేరు. అదృష్టవశాత్తూ ఆ పసివాడు బతికాడు. యూఎన్ శరణార్థ శిబిరానికి తరలించారు. ఆ ఫొటో వైరల్ తర్వాత చాలాకాలం శ్రమించిన ఓ స్పానిష్ న్యూస్ పేపర్(ఎల్ ముండో)కు న్యోంగ్ తండ్రి ఇంటర్వ్యూ దొరికింది. కానీ, అప్పటికే కెవిన్ చనిపోయాడు. మరోవైపు 2007లో న్యోంగ్.. వైరల్ ఫీవర్‌తో కన్నుమూశాడు. ఏదైతేనేం ప్రపంచాన్ని కన్నీళ్లు పెట్టించిన ఫొటోగా.. జర్నలిజానికి, తన జీవితానికి మాయని ఓ మచ్చగా మిగిలిపోయింది కెవిన్ తీసిన ఆ ఫొటో. -ఆగష్టు 19.. వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా.. -
World Photo Graphy Day: రీల్ నుంచి.. ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): మనిషి జీవన ప్రస్థానంలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. ప్రతీ మలుపును పదిలంగా కళ్ల ముందుంచేది ఫొటో. అందులో వేల భావాలు దాగుంటాయి. మారుతున్న రూపాన్ని జీవితాంతం కళ్లకు కడుతుంది. మన ఇంట్లోని ప్రతీ ఫొటో వెనక ఒక జ్ఞాపకం, అనుభూతి ఉంటుంది. పుట్టిన రోజైనా.. వివాహ వేడుకైనా.. సమావేశమైనా.. టూర్‌కు వెళ్లినా.. ఇలా ఎక్కడ ఏం జరిగినా.. అక్కడ ఆ జ్ఞాపకాలను పది కాలాలపాటు పదిలంగా ఉంచేందుకు కావాల్సింది ఫొటోగ్రఫీ. కదిలిపోతున్న కాల ప్రవాహంలో చెదరని మధుర స్మృతుల ప్రతిబింబాలు ఫొటోలు. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫొటోగ్రఫీ. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫొటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడమని అర్థం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోల కాలం నుంచి నేడు ఫోన్ ద్వారా సెల్ఫీ, డ్రోన్ కెమెరాల దశకు కెమెరా కన్ను విస్తరించింది. నేడు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వృత్తి పోలీస్.. ప్రవృత్తి ఫొటోగ్రఫీ రామడుగు(చొప్పదండి): రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన దాసరి మల్లేశ్ వృత్తిపరంగా ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చే స్తున్నారు. ఆయన తన కళ్లకు కనిపించిన అందమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ఫొటోగ్రఫీని ప్రవృత్తిలా మార్చుకున్నారు. అంతేకాదు పెయింటింగ్ కూడా వేస్తున్నా రు. మహిమల కేదార్‌రెడ్డి వద్ద ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఆయన తీసిన ఫొటోలను చూచి చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, పోలీస్ అధికారులు అభినందించారు. 1827లో ఫొటో తీసే పరికరం.. 18వ శతాబ్దంలో కెమెరాని కనుగొనడంతో ఫొటోగ్రఫీ ప్రారంభమవగా 1820లో రసాయనిక ఫొటోగ్రఫీ మొదలైంది. ఫొటోగ్రఫీకి జీవం పోసిన వారు ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్ జాక్వెస్ మాండే డాగురే. స్వతహాగా చిత్రకారుడైన ఆయనకు ఒక్కో చిత్రం గీయడానికి 8 గంటల సమయం పట్టేది. దీన్ని సులభతరం చేయడానికి 1827లో జోసెఫ్ నెఫ్సర్ తన మిత్రుడు నిప్సెతో కలసి ప్రయోగాలు చేసి, ఫొటో తీసే పరికరాన్ని కనుగొన్నారు. డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రఫిక్ ప్రాసెస్ కనిపెట్టి, అదే ఏడాది ఆగస్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయోడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. దీనికి గుర్తుగా 2010 నుంచి ‘వరల్డ్ ఫోటోగ్రఫీ డే’ జరుపుకుంటున్నారు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియాలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పోర్టరైట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ ప్రారంభిచారు. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్‌తో కలర్ ఫొటోగ్రఫీ వచ్చింది. కలర్ ఫొటోగ్రఫీ.. 1907లో లూమియర్ సోదరులు కనుగొన్న ఆటోక్రోమ్ అనే కలర్ ఫొటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైంది. 1935లో కొడాక్ మొట్టమొదటి కలర్ ఫిలిం (ఇంటెగ్రల్ ట్రైప్యాక్ లేదా మోనోప్యాక్)ని కొడాక్రోమ్ పేరుతో పరిచయం చేసింది. అగ్ఫా కలర్ న్యూ 1936లో రూపుదిద్దుకుంది. డిజిటల్ ఫొటోగ్రఫీ.. 1981లో సోనీ మావికా అనే కెమెరా ఛార్జీ కపుల్డ్ డివైస్ ఫర్ ఇమేజింగ్ అనే పరకరం ఉపయోగించి, కెమెరాలో ఫిలిం వాడే అవసరం లేకుండా చేశారు. 1991లో కొడాక్ ఈసీ 100 వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. ఇది డిజిటల్ ఫొటోగ్రఫీకి నాంది పలికింది. ప్రీ వెడ్డింగ్ షూట్... ఫొటోగ్రఫీ రంగంలో వచ్చిన ఆధునికత, డిజిటల్ ప్రక్రియతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. గతంలో పెళ్లి వేడుకలను పెళ్లి రోజు తీసే ఫొటోలతోనే సరిపెట్టుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి ముందు అందమైన లోకేషన్లలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేసుకుంటూ ఆ ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకుంటున్నారు. 15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న నేను 15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న. గోవాలో సిగ్మా ఆర్ట్ ఫొటోగ్రఫీ ఇండియా నిర్వహించిన పోటీల్లో జాతీయస్థాయిలో సిల్వర్మెడల్ పొందాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది. – బత్తుల రాజు, గోదావరిఖని కొత్త టెక్నాలజీ వచ్చింది ఫొటోగ్రఫీలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ప్రజలు ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్తోపాటు ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టెక్నాలజీ పరంగా ముందుకెళ్లినా కరోనాతో రెండేళ్లు వెనక్కి వెళ్లినట్లయింది. ఇప్పుడు శ్రావణమాసం కావడంతో కొద్దిగా గిరాకీ పెరుగుతూ వస్తోంది. – గాలిపల్లి రవివర్మ, రవివర్మ డిజిటల్ స్టూడియో యజమాని -
మూడోకన్నుకు... 182 వసంతాలు
1839వ సంవత్సరంలో ఫొటోగ్రఫీ ఆవిష్కరణ జరిగిన తరువాత క్రమంగా ప్రపంచ దేశాలు అన్నిటిలోకి ఈ ప్రక్రియ వ్యాపించటం మొద లైంది. ఈ క్రమంలో మన దేశంలోకి కూడా ఫొటోగ్రఫీ ప్రవేశించింది. ఆధా రాలని బట్టి సుమారు 1840లోనే మనదేశంలోకి ప్రవేశించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఆరోజుల్లో మొట్ట మొదటి వ్యాపారసంస్థను ఎఫ్. స్వ్రాన్‌హోపర్ అనే కమర్షియల్ ఫొటోగ్రాఫరు కలకత్తాలో కేలోటైపు ఫొటోగ్రఫీ ప్రక్రియతో ఒక స్టూడియోను ప్రారంభించినట్లుగా ఋజువులున్నాయి. ఇదే భారతదేశంలో మొట్టమొదటి స్టూడియో. యజమాన్యాలు ఎన్నిమారినా ఆ స్టూడియో ఇప్పటికి 8 చౌరంగీరోడ్డు కల కత్తాలో నిల్చి ఉన్నది. ఆ రోజుల్లోనే 1853లో రాయల్ ఫొటో గ్రాఫిక్ సొసైటీని ఇంగ్లాండులో స్థాపించారు. 1854లో ఫొటో గ్రాఫిక్ సొసైటీ ఆఫ్ బాంబే స్థాపించబడింది. మనదేశంలో ఇది మొట్టమొదటి ఫొటోక్లబ్బు. ఆ తర్వాత ఇది ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియాగా మార్పు చెందింది. ఇది ఇప్పటికీ ఫొటోగ్రఫీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. 1855లో ఈ క్లబ్బు మొట ్టమొదట ఫొటో ప్రదర్శనని ఏర్పాటు చేసింది. 1840 తరువాత నెమ్మదిగా అనేక ఫొటోస్టూడి యోలు స్థాపితమై, ఫొటోగ్రఫీకి కావలసిన రసాయనాలు, పరికరాలు విక్రయించటం మొదలు పెట్టాయి. హైదరాబాద్ సంస్థానంలో రాజా లక్ష్మణరావు నైజాం నవాబుల సంస్థానంలో సేవచేస్తూ గొప్ప పరిపాలనాదక్షతతో పేరుపొందారు. రాజాలక్ష్మణరావుకి ముగ్గురు కుమారులు: రాజ రామ్రాజ్, రాజాత్రయంబక్రాజ్, రాజా థోండేరాజ్ రాజా దీన్‌దయాళ్ ప్రోత్సాహంతో రాజాత్రయం బక్ కెమె రాని చేపట్టి ఛాయా చిత్రకారుడిగా పేరు పొందారు. ఛాయా చిత్రకళలో, ముద్రణలో, చిత్ర నిర్మాణంలో నిష్ణాతులైన, ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఆంగ్ల గురువుల వద్ద అభ్యాసం కోసం సాంకేతిక నైపుణ్య సాధనకు ఇంగ్లాండు వెళ్ళారు. ఛాయాచిత్ర కళకు మొదటిరోజులలో ప్రామాణికత అనేది లేదు. అటువంటి పరిస్థితులలోనే మంచి ఛాయా చిత్రకారుడిగా పేరు పొంది ఇంగ్లాండు దేశంలోని రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటి నుంచి తన ఛాయాచిత్రనైపుణ్యానికి గుర్తింపుగా ఎసోసియేట్ రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటి గౌరవపట్టాను తన మొదటి ప్రయత్నం లోనే సాధించగలిగారు. కెమెరా కంటే కెమెరా వెనుక ఉన్న కన్ను ఎంతో ముఖ్యమనేది ఆయనభావం. భారతదేశంలో కార్బన్ ప్రాసెస్‌లో వర్ణచిత్రాలను తయారు చేసిన ఘనత ఆయనదే. రాజాత్రయంబక్ ఆంధ్రరాష్ట్ర అకాడమీ ఆఫ్ ఫొటోగ్రఫీకి ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ 20వ తేదీ నవంబరు 1969వ సంవత్సరంలో పరమపదించారు. డా. ఎన్ భగవాన్‌దాసు బ్రిటీస్ ఎయిర్‌ఫోర్సులో స్క్వాడ్రెన్ లీడరుగా పనిచేసి 1947లో కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో ఆఫీసరుగా నియమితులయ్యారు. ఆంధ్రరాష్ట్రంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో ఉన్న ఫొటోగ్రా ఫర్లని అందరినీ కలిపి ఒక సంఘం ఏర్పరచాలని నిర్ణయించి, ఎడ్వర్డ్స్. వి. బాపిరాజు ఇలా ఇంకా కొందరిని కలిసి వారితో చర్చించి రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఫొటో గ్రాఫర్స్ అనే సంస్థని 1963 సంవత్సరంలో స్థాపించారు. అప్పటి నుంచి నిర్విరామంగా కృషి సల్పుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఫొటోగ్రఫీ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. తరువాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శిగా నియమించబడ్డారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను కనీసం ఒక ఫొటోక్లబ్ ఉండాలనే ధ్యేయంతో ఎంతో కృషి చేశారు. 1966లో తొలిసారిగా ఎ.పి. శాలన్ ఆఫ్ ఫొటోగ్రఫి తెలు గునేలపై తొలిసారిగా ఫొటో ప్రదర్శనను ఏర్పాటుచేయగా నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రారంభించారు. గడచిన 54 ఏళ్ళలో ఎంతోమంది ఆర్ట్ ఫొటోగ్రఫీలో జాతీయ, అంత ర్జాతీయ పురస్కారాలు సాధించి దేశంలోనే ఫొటోగ్రఫీ రంగం లోను ఆకర్షినీయమైన రాష్ట్రంగా నిలిపారు. 2015లో జరిగిన రాజకీయ మార్పులతో అప్పటివరకు కొనసాగుతున్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అకాడమీ ఆఫ్ ఫొటోగ్రíఫీ మార్పు చెంది తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ పేర్లుతో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థ లలో దాదాపుగా 300 మందికి పైగా సభ్యులు వివిధ అంశాల్లో వారివారి ప్రతిభకు గుర్తిస్తూ అంతర్జాతీయ పురస్కారాలు పొందారు. ఈ ఏడాది 182వ ప్రపంచ ఫొటోగ్రíఫీ వేడుకలు జరుపుకొంటున్నాం. కళాత్మక ఛాయాచిత్రరంగంలో తెలుగు వారిదే పై చేయి కావాలని అంతర్జాతీయంగా భారతీయ మువు న్నెల జెండాను ఫొటోగ్రఫీ రంగంలో తెలుగు వారు ఎగరవే యడంలో ప్రథమంగా ఉండాలని ఆశిస్తూ.. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో... టి. శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ, ప్రధానకార్యదర్శి (నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం) -
వీరిలో ఓ వ్యక్తి మీకు బాగా తెలుసు..
ఫోటోగ్రఫీ అనేది ఒక గొప్ప కళా. అందమైన జ్ఞాపకం. గడిచిన కాలాన్ని తిరిగి పొందలేకపోవచ్చు కానీ.. మన జీవితంలో గడిపిన మధుర క్షణాలను ఫోటోల రూపంలో భద్రపరుచుకోవచ్చు. ప్రతి ఫోటో వెనక ఏదో ఒక అనుభూతి దాగి ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా.. ఆ ఫోటోలు చూస్తే మన మదిలో ఆ నాటి కాలపు మధురానుభూతులు మదిలో మెదులుతాయి. అయితే నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఫోటోగ్రాఫర్లు తమ ఫోటోలతో ప్రపంచంలోని అద్ఛుతాలను బంధించి వాటిని ప్రపంచానికి పరిచయం చేసే గొప్పకళ గురించి తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. (ఆ మాటలు నాకెంతో తృప్తినిచ్చాయి: చిరంజీవి) నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తాము తీసిన కళాత్మక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా చేరిపోయారు. తను మొదటిసారి కెమెరాతో తీసీన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘నేను తీసిన మొదటి ఫోటో.. ఈ అయిదుగురిలో ఒ వ్యక్తి మీకు బాగా తెలుసు.. చెప్పుకోండి చుద్దాం’ అంటూ సవాలు విసిరారు. ఇక ఈఫోటోపై అభిమానులు భారీగా స్పందిస్తూ... మధ్యలో ఉంది పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆ ఫోటోలో ఉంది పవనో కాదో మీరు కూడా గుర్తుపట్టండి. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) నేను తీసిన మొదటి ఫోటో ... ... ఈ ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు ... ...చెప్పుకోండి చూద్దాం. #FirstPhotoTaken #WorldPhotographyDay pic.twitter.com/YyesoiiivX — Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2020 -
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సాక్షి అందిస్తున్న అద్బుతమైన ఫోటోలు
-
పిక్టో‘రియల్’లో దిట్ట సోమరాజు
సాక్షి, కరప (కాకినాడ రూరల్): చేసే వృత్తి ఏదైనా ఏకాగ్రత, పట్టుదలతో పనిచేస్తే రాణించవచ్చని అనాదిగా నిరూపణ అవుతూనే ఉంది. గురు ముఖతా కొందరు, జిజ్ఞాసతో కొందరు కొన్ని సాధన చేసి సాధిస్తారు. అటువంటి వారిలో అభీష్టం కొద్దీ ఫొటోలు తీయడం ప్రారంభించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మండలంలోని గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు. చేనేత కార్మిక కుటుంబానికి చెంది మగ్గం పట్టాల్సిన చేతులు కెమెరా పట్టి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు. స్వయంకృషికి తోడు కుటుంబ సభ్యుల ప్రోద్బలం, స్నేహితుల ప్రోత్సాహంతో 2016లో అమెరికా వారి నుంచి రెండు, రాష్ట్రం నుంచి మరొకటి పురస్కారాలు గెలుచుకుని పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో సత్తా చాటుకున్నారు సోమరాజు. 2017లో తెనాలి శ్రీఅజంతా కళారామం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో జాతీయస్థాయి పోటీల్లో ఫొటోగ్రఫీ విభాగంలో ద్వితీయ బహుమతి గెలుపొందారు. 2019లో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మత్స్యకారుల జీవనవిధానంపై తీసిన చిత్రం జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలు దక్కించుకున్నారు. సొంతూరు గొర్రిపూడి గ్రామమైన కాజులూరు మండలం గొల్లపాలెంలో కాకినాడలోని సర్పవరం వద్ద గాయత్రీ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సోమరాజు తన ప్రస్థానాన్ని తెలియజేస్తూ.. గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి రామారావు, లక్ష్మీకాంతం తన తల్లిదండ్రులని తెలిపారు. కాకినాడలో ఐటీఐ వరకు చదివానని, ఆ సమయంలోనే యషికా కెమెరాతో సరదాగా ఫొటోలు తీసేవాడినని తెలిపారు. 1996లో తల్లిదండ్రులు వివాహం చేయడంతో చేనేతవృత్తిలో స్థిరపడడం ఇష్టంలేక జీవనోపాధి కోసం గొల్లపాలెంలో ఫొటో స్టూడియో పెట్టానని, ప్రస్తుతం సర్పవరం జంక్షన్‌వద్ద ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నానని తెలిపారు. స్నేహితులు తుమ్మల వీరభద్రరావు (కాకినాడ), వడ్డాది సూర్యప్రకాశరావు (వెల్ల)లకు ఫొటోగ్రఫీలో అవార్డులు రావడంతో వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి నుంచి మెళకువలు తెలుసుకుని సాధన చేశారు సోమరాజు. మొదటిసారి స్నేహితులతో కలసి 2015 మేనెలలో విశాఖ జిల్లా అరకు వెళ్లినప్పుడు అక్కడ గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీశానని, అదే యేడాది అక్టోబరులో, 2016 జనవరిలో అరకు, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వరకు వెళ్లి గిరిజనుల జీవనశైలిపై ఫొటోలు తీసి స్నేహితుల ద్వారా అమెరికా, లండన్, ఫ్రాన్స్‌లకు పంపినట్టు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారాల ఎంపిక ఇలా.. ఏటా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ (లండన్), ఫొటో సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీలా ఆర్ట్స్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)లతో పాటు ఇమేజ్కాలేజ్ సొసైటీ ఆఫ్ అమెరికా సంస్థలు ఉత్తమ ఫొటోగ్రాఫర్లను గుర్తించి అవార్డులు ప్రదానం చేస్తుంటారు. 2017లో ఆ పోటీలకు అంతర్జాతీయంగా అనేక దేశాలు పోటీపడగా గిరిజన జీవనశైలిపై తాను తీసిన ఛాయాచిత్రాలకు అత్యున్నత పురస్కారం లభించిందని అన్నారు. అమెరికాకు చెందిన ఇమేజ్ కాలేజ్ సొసైటీ చైర్మన్ టోని లికిస్తాన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఈ పోటీల్లో తనను పురస్కారానికి ఎంపిక చేయడమే కాకుండా సొసైటీలో జీవితకాల సభ్యత్వం ఇచ్చారన్నారు. ఈ అవార్డులను ఆ సంస్థలు విజయవాడలోని ప్రతినిధులకు పంపించగా 2016 సెప్టెంబరులో ఆంధ్రప్రదేశ్ ఫొటో అకాడమీ నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ చేతులమీదుగా అందుకున్నట్టు తెలిపారు. అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతికశాఖ సాఫల్య పురస్కారం (అచీవ్మెంట్ అవార్డు) అందజేసినట్టు ఆయన చెప్పారు. 2017లో జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతి: తెనాలిలోని శ్రీఅజంతా కళారామం ఏటా పెయింటింగ్, క్రాఫ్ట్‌వర్క్, ఫొటోగ్రఫీ విభాగాల్లో జాతీయస్ధాయిలో పోటీలునిర్వహిస్తుంటారు. ఫొటో గ్రఫీ విభాగంలో ‘గో టు ఫీల్డ్’ ఛాయాచిత్రానికి ద్వితీయ బహుమతి లభించింది. గిరిజనులు మేకలను తోలుకెళ్తున్నట్టు తీసిన చిత్రం బహుమతి తెచ్చిపెట్టింది. 2019లో జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు: ఈ ఏడాది 180వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ, బెంగళూరు, గౌహతి, ఇండోర్ కేంద్రాలుగా జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలకు సోమరాజు మత్స్యకారుల జీవన విధానంపై పిక్టోరియల్ ఫొటోగ్రఫీలో పంపిన ‘డే ఎండ్’ చిత్రాలకు నాలుగు కేంద్రాల్లో పురస్కారాలు లభించాయి. మత్స్యకారులు కాకినాడ బీచ్‌లో పడవ తోసుకుని సముద్రంలోకి వెళ్తున్నప్పుడు తీసిన చిత్రానికి జాతీయస్థాయిలో నాలుగు పురస్కారాలను సోమరాజు సొంతం చేసుకున్నారు. -
స్మైల్ ప్లీజ్...
ఫొటో.. మాటలకందని ఓ దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది.. ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్ జాక్వేస్ మాండే డాగ్వేర్ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు గుర్తుగా 2010 నుంచి ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అప్పట్లో ఫొటోలు తీసేందుకు రాగి, వేడిని ఉపయోగించేవారు. -
హార్ట్ టచింగ్ ఫోటో: కంటతడి పెట్టాల్సిందే..
అమ్మ తనకు ఆకలిగా ఉన్నా.. పిల్లల కడుపు నింపిన తర్వాతే భోజనం చేస్తుంది. కానీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ తల్లి ప్రేమను మర్చి పోతారు. తమ దారేదో తాము చూసుకుంటారు. తల్లిదండ్రులకు పట్టేడన్నం పెట్టడానికి వెనుకాడతారు. వయసు పైబడిన వారు తమకు భారమైనట్టు, తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతుంటారు. మనవళ్లు, మనవరాళ్లను వారికి దూరం చేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఓ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో ప్రతి ఒక్కరినీ చలింప చేస్తోంది. ఓ స్కూల్ బాలిక, ఓ వృద్ధురాలి పక్కన కూర్చుని గుక్కపెట్టి ఏడ్చే ఆ ఫోటో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఫోటోలోని బాలిక, స్కూల్ ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా అనూహ్యంగా ఓ వృద్ధాశ్రమంలో ఉన్న తన నాన్మమ్మను కలుసుకుంటోంది. ఇన్నాళ్లు నాన్నమ్మ బయటికి వెళ్లిందని నాన్న చెప్పే మాటలనే నమ్ముతూ వస్తున్న ఆ బాలికకు.. వృద్ధాశ్రమంలో తన నాన్నమ్మ కనిపించడం, ఆ తర్వాత నిజం తెలియడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గుజరాత్‌లోని ఓ ఫోటోగ్రాఫర్ దాదాపు పదేళ్ల కిందట ఈ హృదయ విదారకమైన సంఘటనతో పాటు వారి ఫోటోను కూడా గుజరాతి డైలీ ‘దివ్య భాస్కర్’లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశాడు. అప్పట్లో అది ఓ సంచలన టాఫిక్‌గా మారింది. ఆ ఫోటో ఫేస్బుక్లో పెద్ద ఎత్తున షేర్ అయింది. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2007 సెప్టెంబర్ 12న ఫోటోజర్నలిస్ట్ కల్పెష్ ఎస్ భరేచ్‌కు గుజరాత్ మనినగర్‌లోని జీఎన్సీ స్కూల్ ప్రిన్సిపాల్ నుంచి ఫోన్ వచ్చింది. ఘోదసర్‌లోని మనిలాల్ గాంధీ వృద్ధాశ్రమానికి స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్నామని, ఈ స్కూల్ ట్రిప్‌ను కవర్ చేయమని ప్రిన్సిపాల్ కోరారు. భరేచ్, పిల్లలతో పాటు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆ అసైన్‌మెంటే తన జీవితాన్ని ఓ మలుపు తిప్పుతుందని భరేచ్ కలలో కూడా ఊహించి ఉండడు. ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా పిల్లలను, పెద్ద వాళ్ల పక్కన కూర్చోమని.. మంచి మంచి ఫోటోలు తీస్తున్నాడు. స్కూల్ పిల్లల్లో ఒక చిన్న అమ్మాయి.. ఒక గదిలోకి వెళ్లగానే ఓ ముసలావిడ దగ్గరికి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. ఆ మహిళ కూడా చిన్నారిని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. ఏం జరిగిందా? అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కానీ ఆ ముసలావిడ చెప్పిన స్టోరీ వినగానే మేమందరం ఒక్కసారిగా మూగబోయాం అని భరేచ్ చెప్పాడు. ఆ ముసలావిడ, ఆ అమ్మాయికి నాన్నమ్మ అట. ఎంతో కాలం తర్వాత మనవరాలిని చూసిన ఆ ముసలావిడ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని తనివితీరా ఏడ్చారు. నాన్నమ్మ బయటికి వెళ్లిందని ఎప్పుడూ నాన్న చెబుతుండే వాడని ఆ పాప చెప్పింది. కానీ ఎప్పుడూ కూడా వృద్ధాశ్రమంలో ఉందని చెప్పలేదని కన్నీంటి పర్యంతమైంది. నానమ్మ, మనవరాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న ఫోటోతో పాటు, వీరి స్టోరీని గుజరాతి డైలీ దివ్య భాస్కర్లో ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేశారు. గుజరాత్ అంతటా అప్పట్లో ఇదే బిగ్ డిబేట్. అన్ని పత్రికలు, ఛానళ్లు కూడా దీన్నే మెయిన్ స్టోరీగా బ్రాడ్కాస్ట్ చేశాయి. ఆమెను వృద్ధాశ్రమం నుంచి తన ఇంటికి తీసుకెళ్లినట్టు భరేచ్ తర్వాత స్థానిక టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడెందుకు వైరల్ అవుతుంది.... ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా.. బీబీసీ గుజరాతీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్‌లను తమ కెరీర్లో తీసిన ఉత్తమమైన ఫోటోలను షేర్ చేయమని కోరింది. బీబీసీ గుజరాతీకి భరేచ్.. తన బెస్ట్ ఫోటోలన్నింటిన్నీ షేర్ చేయగా.. ఈ ఫోటో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భరేచ్ ప్రస్తుతం దివ్య భాస్కర్లో పనిచేస్తున్నాడు. తన తండ్రి ఫోటో సోషల్ మీడియా వైరల్ అయిందని... చాలామంది సెలబ్రిటీలు దీనిపై ట్వీట్ చేస్తున్నారని.. కేవలం పేరు కోసం కాకుండా.. వృత్తి మీద ప్రేమతో పనిచేయాలని తన తండ్రి ఎప్పుడూ సూచిస్తుంటాడని... నిజంగా ఇది తమకెంతో గర్వకారణమని భరేచ్ కొడుకు దీపమ్ ఫేస్బుక్లో ఓ పోస్టులో తెలిపాడు. -
బాయ్‌ఫ్రెండ్ ఫోటో షేర్ చేసింది ఆపై..
‘మరి కొద్ది రోజుల్లో ఇంకొకరిని వివాహం చేసుకోబోతూ ఇదేం పని’ అంటూ బాలీవుడ్ ‘పద్మావత్’ దీపికా పదుకోన్‌ను విమర్శిస్తున్నారు నెటిజన్లు. అభిమానులకు అంత ఆగ్రహం తెప్పించే పని దీపిక ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారా.. ఆదివారం (నిన్న) ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను పోస్టు చేశారు దీపికా. గతంలో ‘తమషా’(2015) షూటింగ్ సందర్భంగా క్రొయేషియాలో రణ్‌బీర్ కపూర్‌తో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు దీపికా. కానీ ఇది ఆమె అభిమానులకు నచ్చలేదు. Capturing Moments 📸📸 #WorldPhotographyDay A post shared by Deepika Padukone (@deepikapadukone) on Aug 19, 2018 at 1:16am PDT దాంతో ‘నువ్వు నీ గతాన్ని షేర్ చేస్తే నీ జీవితం కూడా తమాషా అవుతది’, ‘నువ్వు దీపిక కాదు చీపికా’, ‘నువ్వు త్వరగా ఒక మానసికి నిపుణుడిని కలిస్తే మంచిది’, ‘నీ హృదయం ఇంకా నీ మాజీ బాయ్‌ఫ్రెండ్ కోసమే తపిస్తోంది.. కానీ ఇప్పుడు నువ్వు నీకు ఏ మాత్రం ఇష్టం లేని ఒక వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నావు.. ఎందుకంటే సింగిల్‌గా ఉండి నీకు బోర్ కొట్టింది కాబట్టి’ అంటూ దీపికను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీపికా, రణ్‌బీర్ కపూర్లు విడిపోయి దాదాపు ఒక దశాబ్దం అవుతోంది. అయినప్పటికి వీరిద్దరూ మంచి స్నేహితులాగానే ఉంటున్నారు. బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ‘యే జవానీ హై దివానీ’(2010), ‘తమాషా’(2015) వంటి చిత్రాల్లో కలిసి నటించారు. -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
-
వరల్డ్ ఫొటో గ్రఫీ డే.. మైమరిపించే చిత్రాలు..
-
సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో పలు కేటగిరీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టులు విజేతలుగా నిలిచారు. బంగారు తెలంగాణ కేటగిరీలో ఆరోగ్యలక్ష్మి కార్యక్రమంపై బెస్ట్ ఫొటో తీసినందుకు సంగారెడ్డి జిల్లా ఫొటో జర్నలిస్టు శివప్రసాద్ ప్రోత్సాహక బహుమతి (కన్సోలేషన్ ఫ్రైజ్) దక్కించుకున్నాడు. కేటగిరీ–2లో జనగామ జిల్లా ఫొటో జర్నలిస్టు జి.వేణుగోపాల్ తృతీయ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎం.రవి కన్సోలేషన్ ఫ్రైజ్ సొంతం చేసుకున్నారు. కేటగిరీ–3లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటో జర్నలిస్టు వై.శ్రీకాంత్ ప్రథమ బహుమతి, హైదరాబాద్ ఫొటో జర్నలిస్టు ఎ.సురేశ్ కుమార్ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. ఇదే కేటగిరీలో కరీంగనర్ ఫొటో జర్నలిస్టు జి.స్వామి ప్రోత్సాహక బహుమతి దక్కించుకున్నాడు. వీరంతా ఈ నెల 19న హైదారాబాద్‌లో జరిగే కార్యక్రమంలో నగదు బహుమతులు అందుకోనున్నారు. టీపీజేఏ అవార్డుల్లోనూ హవా: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన పోటీ ల్లోనూ సాక్షి ఫొటో జర్నలిస్టులు పలు అవార్డులు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫొటో జర్నలిస్టు దశరథ్ రజువా, హైదరాబాద్ ఫొటో జర్న లిస్టు రాకేశ్, మహబూబ్‌నగర్ ఫొటో జర్నలిస్టు భాస్కరాచారి కన్సోలేషన్ ఫ్రైజ్‌లు సొంతం చేసుకున్నారు. వీరంతా 19న అవార్డులు అందుకోనున్నారు. -
క్లిక్‌మంటే.. అవార్డు వచ్చినట్లే!
⇒ బాపట్ల ఫొటోగ్రాఫర్ పీవీఎస్కు అమెరికా పురస్కారం ⇒ నేడు ప్రపంచ ఫొటోగ్రాఫర్స్ దినోత్సవం బాపట్ల: మండలంలోని ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజు తన చేతిలోని కెమెరాను క్లిక్ మనిపిస్తే చాలు మండలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏదో ఒక అవార్డు సాధించడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులు, సహజ సిద్ధంగా, ఆహ్లాదకరమైన వాతావరణాలను చూపించే ఆయన ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించాయి. నాగరాజు ప్రకృతి ప్రేమికుడిగా, ప్రకతిలో కనిపించే వన్యప్రాణుల దృశ్యాలు తన కెమెరాలో బంధిస్తుంటారు. అందుకున్న అవార్డులు.. జూలైలో అమెరికాలోని ఇమేజ్ కోలిగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గిరిజనుల జీవనశైలిపై తీసిన 12 ఛాయాచిత్రాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. దీంతో అమెరికాకు చెందిన కోలిగ్ సొసైటీలో పీవీఎస్కు జీవితకాల సభ్యత్వాన్ని కల్పించడంతోపాటు, అమెరికా పురస్కారం (హానరి), సర్టిఫికెట్లను ఈమేల్ ద్వారా అందజేశారు. మార్చిలో పశ్చిమబెంగాల్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారంతోపాటు, రూ. 2 వేల నగదు, మెమోంటోను అందుకున్నారు. ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారం అందుకున్నారు. కలకత్తాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నారు. జూన్‌లో వెస్ట్‌బెంగాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆగస్టులో న్యూఢిల్లీలో నిర్వహించిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో ఉత్తమ పురస్కారం లభించింది. నాగరాజును గురువారం ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అభినందించారు. -
పిక్చర్.. పొట్లం
-
చిత్రం.. భళారే విచిత్రం
ఎన్నెన్నో వర్ణాలు.. ఎన్నెన్నో అనుభవాలు నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సిద్దిపేట: ఒక్క చిత్రం వెయ్యి మాటల పెట్టు.. ఎన్నెన్నో వర్ణాల కనికట్టు.. కోటి భావాలను తెలిపే చక్కని చిత్రం.. ఒక మాటకంటే ఓ దృశ్యం ఎంతో కాలం గుర్తుండిపోతుంది. కరిగే కాలంలో పరుగెత్తే జీవనయానాన్ని వెనుతిరిగి చూసుకోవడానికి మిగిలే తీపిగుర్తులు. చిత్రం ఓ మధుర జ్ఞాపకం. ఓ మంచి ఫొటో ఆసక్తిని కనబరుస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది. మారుతున్న రోజులకు, కరుగుతున్న కాలాలకు అనుగుణంగా పాత స్మృతులను నెమరు వేసుకోవడానికి అలాంటి ఫొటోగ్రఫీకి నేడు ఒక ప్రత్యేక స్థానంలో ఉంది. ఆధునిక కాలంలో వీడియోలు, డిజిటల్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం చూస్తుంటే ఫొటోగ్రఫీకి సమాజంలో ఉన్న గుర్తింపు తెలుస్తోంది. ఫొటోలో శక్తిసామర్థ్యాలను తెలియజేస్తూ వాటికి ఒక గౌరవ ప్రదమైన రోజును ఏర్పాటు చేశారు. అదే ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రాఫీ డే. 1830 య ఫ్రెంచి కళాకారుడు రసాయిన శాస్త్రవేత్త లూయిస్ జాక్వెస్ మాండే ఫోటోగ్రాఫీ అంశాన్ని ప్రపంచానికి తెలియజేశారు. మధురమైన జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి ఆ ఫొటో ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటి దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను అద్భుతంగా తన కెమెరాలో సంబంధించారు సిద్దిపేట పట్టణానికి చెందిన దండె ప్రభుదాస్. ఈయన ఇటీవల ఓడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొండ్రుల జీవన విధానాలపై ఫోటోలుగా చిత్రీకరించారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆయన తీసిన ఎన్నెన్నో.. -
‘ఫొటో’ విజేతలకు పురస్కారాలు
మాదాపూర్: మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను చూసి వాటిని తీసిన ఫొటోగ్రాఫర్లను కొనియాడారు. ఫొటో జర్నలిజంలో మూడో బహుమతి సాధించిన కంది బజరంగ్ ప్రసాద్ (సాక్షి) జ్ఞాపిక, రూ.6 వేల నగదు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ డి. మనోహర్, ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, జేఎన్ఏఎఫ్ఏయూ నిర్వహించిన బెస్ట్ ఫొటోగ్రఫీ-2015 పోటీలో విజేతలకు బధవారం బహుమతులను ప్రదానం చేశారు. మాసబ్‌ట్యాంక్‌లో జేఎన్ఏఎఫ్ఏయూ జరిగిన ఈ కార్యక్రమంలో ఎఫ్టీ ఏపీసీపీఐ ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, వర్సిటీ ప్రిన్సిపల్ ఎస్.ఎన్. వికాస్ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లు బి. రాజేష్ రెండో బహుమతి, దశరథ్ రజువా మూడో బహుమతి, పి.వరప్రసాద్ ప్రోత్సాహక బహుమతిని అందుకున్నారు. -
ఉద్యమంలో ఫొటోగ్రాఫర్లదే కీలకపాత్ర
హన్మకొండ కల్చరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమంలో ఫొటోగ్రాఫర్లదే కీలకపాత్ర అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కొనియాడారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ములుగురోడ్డులోని కేఎస్ఆర్ గార్డెన్సలో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఫొటోగ్రాఫర్లు ఎంతో సాహసంతో పోరాట దృశ్యాలను చిత్రీకరించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్ కోసం కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగమూర్తి మాటాడుతూ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని వారం రోజులపాటు ములుగు, తాడ్వాయి, కాటారం, సీపీ రెడ్డి కాంప్లెక్స్, వరంగల్‌లోని రెడిన్ కలర్‌ల్యాబ్‌లో నిర్వహించామని వివరించారు. హైదరాబాద్ వాసన్ ఐ ఆస్పత్రి ఆధ్వర్యం లో కంటివైద్య శిబిరం నిర్వహించామన్నారు. రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రథమ బహుమతి డి.వెంకన్న (నల్లగొండ జిల్లా కోదాడ ), ద్వితీయ బహుమతి ఆర్వీఎస్.శర్మ (ప్రకాశం జిల్లా ఒంగో లు), తృతీయ బహుమతిని హుస్సేన్ (ఖమ్మం) గెలుచుకున్నారని వెల్లడించారు. భార్గవ్ఆర్గే (నిజామాబాద్), కోదాడి లక్ష్మణ్ (వరంగల్), గంగాధర్ (కరీమిల్ల నిజామాబాద్), వనం శరత్‌బాబు, సతీష్ (మహబూబాబాద్), కుమార్‌యాదవ్ (కరీంనగర్), అరుణ్‌కుమార్, నాగరాజు దేవర్ (ఖమ్మం) ప్రపంచస్థాయి సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ బండి రాజన్‌బాబు మెమోరియల్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రవీందర్‌రెడ్డి, బాధ్యులు కె.మోహన్, సాంబయ్య, జి.సునీల్‌కుమార్, వి.రమేష్, దయాకర్, వాసుదేవరావు, ఇంద్రారెడ్డి, రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీల న్యాయనిర్ణేతలు ఎం.రాంగోపాల్, కె.సుధాకర్‌రెడ్డి, జిల్లాకు చెందిన సీనియర్ ఫొటోగ్రాఫర్ జయప్రకాష్, జిల్లా కార్యవర్గసభ్యులు, ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. -
కలుషితం లేని వార్తే ఛాయా చిత్రం: జస్టిస్ ఎన్వీ రమణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: కలుషితం లేని వార్తగా నిలిచేది ఛాయా చిత్రం ఒక్కటేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 174వ ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఛాయా చిత్ర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో అనేక న్యూస్ చానళ్లు ఉన్నప్పటికీ దిన పత్రికలు చదవడం తప్పనిసరి అవుతోందన్నారు. పత్రికల్లో చదివే వార్తా కథనం శీర్షికకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ఫొటోకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. విలేకరి రాసిన వార్త కొంత కలుషితం అయ్యేందుకు వీలుంటుందని, పత్రికలో ప్రచురితమైన ఛాయాచిత్రంలో కలుషితం ఉండదని చెప్పారు. విషయాన్ని, భావాన్ని స్పష్టంగా చెప్పగలిగేది చిత్రమేనని, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఫొటోగ్రఫీయేనని తెలిపారు. తాను కూడా కొంత కాలం జర్నలిస్టుగా పని చేశానని జస్టిస్ రమణ చెప్పారు. ఫొటో జర్నలిస్టుల సాహసాలకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌కు రూ. 25 వేల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ‘సాక్షి’కి మొదటి బహుమతి ఈ సందర్భంగా నిర్వహించిన ఛాయా చిత్రాల పోటీలో మొదటి బహుమతి ఏ సతీష్(సాక్షి), ద్వితీయ బహుమతి కె.రమేష్ (హిందూ), తృతీయ బహుమతి ఎన్ శివకుమార్(పోస్ట్‌నూన్) గెలుచుకున్నారు. 15 మంది ఫొటోగ్రాఫర్లు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. కరువు సమస్యలపై ఏర్పాటు చేసిన పోటీలో మొదటి బహుమతి డీ హుస్సేన్(సాక్షి), ద్వితీయ బహుమతి జీ వెంకన్న(నమస్తే తెలంగాణ), తృతీయ బహుమతి బీ నర్సింహులు(ఆంధ్రజ్యోతి) గెలుపొందారు. వీరితో పాటు నలుగురు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సాక్షి క్వాలిటీసెల్ ఇన్చార్జ్ టీ కే లక్ష్మణ్‌రావు, ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సభలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, సిలికాన్ రబ్బర్ ఎండీ కపిల్ అగర్వాల్‌తో పాటు ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవికాంత్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ హరి, పత్రికల ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు. -
సాక్షి ఫొటోజర్నలిస్టుకు ప్రథమ బహుమతి
సాక్షి; హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం(ఏపీపీజేఏ) నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘న్యూస్ ఫొటో కాంపిటీషన్-2013’ పోటీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్ ప్రథమ బహుమతి గెలుపొందారు. ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఫొటో జర్నలిస్టు కె.రమేష్‌బాబుకు ద్వితీయ, ‘పోస్ట్‌నూన్’కు చెందిన ఎన్.శివకుమార్‌కు తృతీయ బహుమతి లభించింది. ఫలితాల్ని ఫొటో జర్నలిస్టుల సంఘం శుక్రవారం వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 15 మందికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపింది. పోటీలకు న్యాయనిర్ణేతలుగా ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు ఎ.లక్ష్మణరావు వ్యవహరించారు. మరోవైపు విద్యుత్ కోత, కరువుపై ఏపీపీజేఏ నిర్వహించిన ఫొటో కాంపిటిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున హైదరాబాద్‌లోని దేశోద్ధారకభవన్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు ఏపీ ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.రవికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరహరి శుక్రవారం తెలిపారు. ‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్‌కు ప్రథమ బహుమతి వచ్చింది ఈ చిత్రానికే. కేదార్నాథ్ వరద బీభత్సానికి తార్కాణంగా నిలిచిన ఈ చిత్రం గౌరీకుంద్ సీతాపూర్ వద్ద తీసింది. వరదల్లో కొట్టుకొచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఈ మృతదేహం ఓ పదేళ్ల బాలుడిది. విద్యుత్ కోత, కరువుపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి తెచ్చిన చిత్రమిది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం ఆమడగుంట్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కొవ్వొత్తులతో చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో తీసింది.