సాక్షి; హైదరాబాద్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టుల సంఘం(ఏపీపీజేఏ) నిర్వహించిన రాష్ట్ర స్థాయి ‘న్యూస్ ఫొటో కాంపిటీషన్-2013’ పోటీల్లో సాక్షి ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్ ప్రథమ బహుమతి గెలుపొందారు. ‘ది హిందూ’ ఆంగ్ల పత్రిక ఫొటో జర్నలిస్టు కె.రమేష్‌బాబుకు ద్వితీయ, ‘పోస్ట్‌నూన్’కు చెందిన ఎన్.శివకుమార్‌కు తృతీయ బహుమతి లభించింది. ఫలితాల్ని ఫొటో జర్నలిస్టుల సంఘం శుక్రవారం వెలువరించింది.
రాష్ట్రవ్యాప్తంగా మరో 15 మందికి ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్టు తెలిపింది. పోటీలకు న్యాయనిర్ణేతలుగా ‘ది హిందూ’ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు ఎ.లక్ష్మణరావు వ్యవహరించారు. మరోవైపు విద్యుత్ కోత, కరువుపై ఏపీపీజేఏ నిర్వహించిన ఫొటో కాంపిటిషన్‌లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున హైదరాబాద్‌లోని దేశోద్ధారకభవన్‌లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేయనున్నట్టు ఏపీ ఫొటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.రవికాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరహరి శుక్రవారం తెలిపారు.
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టు ఎ.సతీష్‌కు ప్రథమ బహుమతి వచ్చింది ఈ చిత్రానికే. కేదార్‌నాథ్ వరద బీభత్సానికి తార్కాణంగా నిలిచిన ఈ చిత్రం గౌరీకుంద్ సీతాపూర్ వద్ద తీసింది. వరదల్లో కొట్టుకొచ్చి రాళ్ల మధ్య చిక్కుకుపోయిన ఈ మృతదేహం ఓ పదేళ్ల బాలుడిది.
విద్యుత్ కోత, కరువుపై నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌లో సాక్షి-కర్నూలు ఫొటో జర్నలిస్టు డి.హుసేన్‌కు ప్రథమ బహుమతి తెచ్చిన చిత్రమిది. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం ఆమడగుంట్ల బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో కొవ్వొత్తులతో చదువుకుంటున్న విద్యార్థుల కష్టాలను కళ్లకు కట్టేలా ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవిలో తీసింది.
సాక్షి ఫొటోజర్నలిస్టుకు ప్రథమ బహుమతి
Published Sat, Aug 17 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement