మా కన్నీళ్లు తుడిచేదెవరు? | Bhadradri thermal pavarstesan environmental referendum | Sakshi
Sakshi News home page

మా కన్నీళ్లు తుడిచేదెవరు?

Published Thu, Mar 17 2016 4:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

మా కన్నీళ్లు తుడిచేదెవరు?

మా కన్నీళ్లు తుడిచేదెవరు?

భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ భూనిర్వాసితుల ని‘వేదన’
నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ

 భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సభలో టీఎస్ జెన్‌కో సీఎండీ పాల్గొంటారు. పరిహారం ప్యాకేజి పూర్తిగా ఇవ్వకపోవడం, సేకరించిన భూముల్లో రెండు పంటలు పండేవి లేవంటూ అధికారులు సాగిస్తున్న తప్పుడు వాదన, ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వకపోవడం తదితరాంశాలపై గళమెత్తేందుకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు.

ఆందోళన వద్దు.. అందరికీ న్యాయం చేస్తాం
భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజె క్టు విషయంలో స్థానిక నిర్వాసితులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం చేస్తాం. ఇంకా 346 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తాం.  ఐటీఐ పూర్తిచేసిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టకుండా ఉద్యోగాలు కల్పిస్తాం. - టీఎస్ జె న్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

 పచ్చని భూములను ఇస్తే.. పచ్చి దగా చేస్తున్నారు మా భూముల్లో రెండు పంటలు పండేవే లేవంటూ జెన్‌కో అబద్ధాలాడుతోంది ఉద్యోగ హామీ పత్రాల ఊసే లేదు పరిహారం, ప్యాకేజీలు పూర్తిగా అందలేదు మా బతుకులు ఆగమాగం చేయొద్దు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితుల కన్నీటి ని’వేదన’ నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కాలుష్య భూతమట..! ఈ పవర్ ప్లాంట్ పూర్తయిన తరువాత మమ్మల్ని వెంటాడుతుందట..!! మేమిప్పుడు భయంతో వణుకుతున్నాం... రాత్రిళ్లు నిద్రపట్టక చస్తున్నాం. ఈ భయం.. వణుకు.. నిద్రలేమి ఎందుకంటారా..! కనిపించని ఆ భూతాన్ని తలుచుకుని కాదు... ఈ జెన్‌కో, రెవెన్యూ అధికారుల నయవంచనను చూసి.  ఇది, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితుల నిత్య వేదన, మూగ రోదన.

మణుగూరు, పినపాక: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టర్ లోకేష్‌కుమార్ అధ్యక్షతన గురువారం భద్రాద్రి పైలాన్ నిర్మాణ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణకు సర్వం సిద్ధమైంది. ‘‘కాలుష్య ప్రభావంతో జంతుజాలంతోపాటు మా జీవన మనుగడకు ముప్పు ఏర్పడుతుందని మీరు అంటున్నారు. అప్పటిదాకా కాదు.. ఇప్పుడే ఉపద్రవం ముంచుకొచ్చిందని మేమంటున్నాం. మా జీవనాధారమైన పచ్చని భూములను మాయమాటలు చెప్పి లాక్కున్నారు. పరిహారం.. ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వలేదు. ఉద్యోగాలిస్తామని ఊదరగొట్టి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. భూములను కోల్పోయి, పరిహారం అందక, ఊద్యోగాలు లేక.. ఏ ఆధారంతో మేము బతకాలి? మా సమాధులపై పవర్ ప్లాంటుకు పునాదులు వేస్తారా?’’ అని, ముక్కు సూటిగా నిలదీసేందుకు, కడిగేసేందుకు ఇక్కడి భూనిర్వాసితులు సిద్ధమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణపై ప్రచారం కోసం ప్రభావిత గ్రామాలకు వెళ్లిన అధికారులకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి.

 ముందు దగా... వెనుక దగా..
‘‘జెన్‌కో, రెవెన్యూ అధికారులు మమ్మల్ని నిలువునా దగా చేశారు. అదిస్తాం.. ఇదిస్తాం అంటూ భూములు ఇచ్చేదాకా మా వెంట పడ్డారు. మాయమాటలతో నమ్మించారు.. ఒప్పించారు. ఇప్పుడేం చేస్తున్నారో చూస్తున్నారు కదా..!’’ అని, భూనిర్వాసితులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ స్టేషన్ కోసం సేకరించిన భూ ముల్లో రెండు పంటలు పండేవి లేనేలేవని ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించడంపై మండిపడుతున్నారు.

 853 సర్వే నంబర్‌లో 600 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో ఒకే పంట పండుతున్నట్టుగా జెన్‌కో ఉన్నతాధికారులకు ఇక్కడి అధికారులు తప్పుడు నివేదికలు పంపారు. పేరంటాల చెరువు కిందనున్న ఈ భూముల్లో రెండు పంటలు పండే భూములు కూడా ఉన్నాయి.

  భూనిర్వాసితుల్లో 361మంది ప్యాకేజీకి బదులుగా (తమ కుటుంబాల్లోని యువతకు) ఉద్యోగాలు కావాలని అడిగారు. ఐటీఐ చేస్తేనే ఉద్యోగం ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో, పీజీ, డిగ్రీ, బీఈడీ చేసినవారు కూడా ఐటీఐలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయలేదు. వారి తీరు మోసపూరితంగా ఉందని భావించిన నిర్వాసిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ‘మేం ఐటీఐ చేస్తాం.. అవకాశమివ్వండి మహాప్రభో’ అంటూ, నాలుగు నెలలపాటు పోరాడిన తరువాతనే అధికారులు సీట్లు కేటాయించారు. ఉద్యోగ హామీ పత్రాలను మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. ‘‘ఐటీఐ సీట్ల కోసం నాలుగు నెలలు పోరాడాం. ఉద్యోగ హామీ పత్రాల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాల్సుంటుందో’’ అని, సంబంధిత నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.

‘‘పవర్ స్టేషన్ నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మా భూముల్లో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రంతో రాష్ర్టమంతటా వెలుగులు నిండితే మాకూ సంతోషమే. మేం కోరుతున్నదల్లా ఒక్కటే... వెలుగులు నింపే పేరుతో మా బతుకులను చీకటిమయం చేయొద్దు. మమ్మల్ని సమాధి చేసి.. పవర్ స్టేషన్‌కు పునాదులు వేయొద్దు. ఈ ప్రజాభిప్రాయ వేదిక సాక్షిగానైనా మా కన్నీళ్లు తుడవాలి. మాకు బతుకుపై భరోసా ఇవ్వాలి’’ అని, కన్నీటిపర్యంతమవుతూ చేతులెత్తి వేడుకుంటున్నారు.

నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి
కాలుష్య ప్రభావాన్ని అడ్డుకోలేని సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం, నిర్వాసితుల గోడుపై ‘సాక్షి’ ప్రచురించిన వరుస కథనాలతో వివిధ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడ్డాయి. ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఇవి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని, తమకు (నిర్వాసితులకు) జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని నిర్వాసితులు కోరుతున్నారు. జెన్‌కో సీఎండీతోపాటు కలెక్టర్ కూడా పాల్గొనే ఈ సభలో.. కాలుష్య ప్రభావిత గ్రామాలను దత్తత తీసుకోవడం, అక్కడ నెలకొల్పే సౌకర్యాలు, పుసరావాసం తదితరాంశాలను లేవనెత్తాలని, సమాధానాలు రాబట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 ఏర్పాట్లు పరిశీలించిన జెన్‌కో సీఎండీ
పినపాక : భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను బుధవారం టీఎస్ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం సందర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాట్లను పరిశీలించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ వద్ద నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా తెలంగాణ మొత్తానికి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సబ్ క్రిటికల్, సూపర్‌క్రిటికల్ టెక్నాలజీ మధ్య తేడా ఏమీ లేదన్నారు. కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement