వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం | Establishment of Janatana Sarkar in Bastar Jungle | Sakshi
Sakshi News home page

వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం

Published Sun, Dec 8 2024 10:39 AM | Last Updated on Sun, Dec 8 2024 11:27 AM

Establishment of Janatana Sarkar in Bastar Jungle

మావోయిస్టుల దాడిలో తునాతునకలైన వాహనం (ఫైల్‌)

  • బస్తర్‌ జంగిల్‌లో జనతన సర్కార్‌ స్థాపన
  • ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తెలంగాణలో పట్టుకు యత్నాలు
  • అయినా ఫలించని మావోయిస్టుల ప్రయత్నాలు
  • వరంగల్‌ మీదుగా బస్తర్‌లోకి మావోయిస్టులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్‌జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్‌ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.

బస్తర్‌ వైపు అడుగులు
శ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్‌ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్‌ అడవులకు పీపుల్స్‌వార్‌ గ్రూపు పంపింది. జనతన సర్కార్‌ పేరుతో బస్తర్‌లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్‌జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్‌ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.

తెలంగాణ వైపు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్‌ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్‌కౌంటర్‌ భద్రాచలం సమీపాన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పరిధిలో 2015 జూన్‌ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్‌ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్‌ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.

పదేళ్లలో 98 మంది..
తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్‌ ఎన్‌కౌంటర్‌ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్‌కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.

కాళేశ్వరం మీదుగా..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల  కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్‌ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్‌ –  ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్‌ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌లో చర్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement