వర్షాకాలంలోనూ ఆటంకం లేకుండా ఏర్పాట్లు
రోప్‌వే ఏర్పాటు చేసిన భద్రతా దళాలు
చింతవాగుపై సులువు కానున్న రాకపోకలు
బస్తర్‌లో మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక వ్యూహం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు చెప్పుకునే బస్తర్ అడవుల్లో ఎండాకాలంలో సహజంగానే పోలీసు బలగాలది పైచేయి అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో వంద మందికి పైగా మావోయిస్టులు హతమవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, వానాకాలానికి వచ్చేసరికి అడవులు చిక్కబడటం.. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పోలీసుల కూంబింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అడవుల్లోకి సులభంగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రోప్ వేను అందుబాటులోకి తెచ్చాయి.
బేస్ క్యాంపుల ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు, ధర్మారం, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం, బాసగూడ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాలుగా ఉన్నాయి. అతికష్టంపై భద్రతా దళాలు చింతవాగుకు ఇరువైపులా ఉన్న పామేడు, ధర్మారంలో బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 16న రాత్రి 600 మందికి పైగా మావోయిస్టులు ఈ రెండు క్యాంపులను చుట్టుముట్టి భీకరంగా దాడి చేశారు.
సుమారు మూడు గంటల పాటు సాగిన దాడిలో ఆరు వందలకు పైగా గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతా దళాలకు చెందిన నలభై మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. అప్పటికే చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టినా సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఏటా వానాకాలంలో మూడు నెలల పాటు ఉప్పొంగే చింతవాగు భద్రతా దళాలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా దళాలు వంతెనకు ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన రోప్‌వేను నిర్మించాయి. ఈ రోప్‌వే ద్వారా రెండు క్యాంపుల మధ్య రాకపోకలకు ఆటంకాలు ఉండవని భద్రతా దళాలు భావిస్తున్నాయి.
ఆపరేషన్ జల్‌శక్తి
వేసవిలో మావోయిస్టు ప్రభావిత అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా దళాలు అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్యాంపులకు వానాకాలంలో భద్రత కరువైపోతోంది. భద్రతా దళాల రక్షణ వ్యవస్థను చీల్చుకుంటూ క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో కూడా బస్తర్ అడవులపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జల్‌శక్తి పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొని, దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడంపై భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాకపోకలకు వీలుగా వంతెనలు, రోప్‌వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.
120 మంది హతం
కేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు తుదిదశ (ఆపరేషన్ కగార్ – ది ఫైనల్ మిషన్)కు చేరింది. బస్తర్ అడవుల్లో ఏర్పాటైన వందలాది క్యాంపుల్లో 10 వేల మంది పారామిలిటరీ దళాలు పాగా వేశాయి. వేసవి ఆరంభంలో భద్ర తా దళాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మావోయిస్టు పార్టీ టెక్నికల్ కౌంటర్–అఫెన్సివ్ క్యాంపెన్(టీసీ–ఓసీ) పేరుతో దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా భద్రతా దళాలు ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుని దాడులకు దిగాయి. అందువల్లే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ నుంచి భద్రతా దళాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడులు, ఎన్‌కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక ఇప్పుడు జల్‌శక్తి పేరుతో వానాకాలంలోనూ దూకుడు పెంచేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment