Bastar region
-
ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి
రాయ్‌పూర్/చర్ల: గత 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా కిరండోల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి డీఆర్జీ బలగాలు కూంబింగ్ జరుపుతుండగా తారసపడిన మావోలు కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. బిజాపూర్ జిల్లా ఆవుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని తాడ్మెట్ల–ముక్రంనల్లా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. -
బస్తర్‌లో వీచిన సానుభూతి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా సాగితే బస్తర్ డివిజన్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ డివిజన్లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఎనిమిదింటిని కాంగ్రెస్ దక్కించుకోగా.. బీజేపీ నాలుగింటితో సరిపెట్టుకుంది. ఈ నాలుంటిలో ఒకటైన రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో ప్రస్తుత సీఎం రమణ్‌సింగ్ 24,163 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక్కడ సానుభూతిని నమ్ముకొని కాంగ్రెస్ బరిలోకి దిగింది. దర్భాఘాట్‌లో జరిగిన మావోయిస్టుల ఘటనలో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ భార్య అల్కా ముదలియార్‌ను రమణ్‌సింగ్‌పై పోటీకి దింపినా.. కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. గత ఏడాది మే 25న బస్తర్ డివిజన్లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ నేతలైన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు, సల్వాజుడుం ముఖ్య నేత మహేంద్రకర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ చనిపోయారు. ఈ డివిజన్లోని మొత్తం 12 నియోజకవర్గాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. 2008 ఎన్నికల్లో బీజేపీ ఈ 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో గెలవగా.. ఈసారి సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. కొంటా, దంతేవాడ, చిత్రకూట్, బస్తర్, కాంకేర్, భానుప్రతాప్‌పూర్, కేశ్కల్, కొండగావ్ నియోజకవర్గాల్లో బీజేపీని చిత్తుచేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దంతెవాడ ఘటనలో మృతి చెందిన సల్వాజుడుం నేత మహేంద్రకర్మ భార్య దేవతీకర్మ 5,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొండగావ్ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రి లతా ఊసెండి ఇక్కడ బరిలోకి దిగినా.. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌లాల్ మరకం చేతిలో ఓటమి పాలయ్యారు. రమణ్‌సింగ్ సొంత జిల్లా రాజ్‌నందగావ్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఆరు నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు స్థానాలు దక్కించుకోగా, బీజేపీ రెండింటికే పరిమితమైంది. -
ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. బస్తర్ ప్రాంతంలోని సుకుమా జిల్లాలోని కేర్లపాల్ సమీపంలోని కల్వర్ట్ను మంగళవారం మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఆ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతడిని రాయ్‌పూర్ తరలించినట్లు చెప్పారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రత సిబ్బంది సంయూక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దఫా ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో విధులు ముగించుకుని వెళ్తున్న భద్రత దళాలకు చెందిన జవాన్లనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని ఊపిరి పీల్చుకుంటున్న అధికారులకు ఈ సంఘటనతో మళ్లీ తలనెప్పి మొదలైంది. రాష్ట్రంలో రెండవ మలి దశ ఎన్నికలు నవంబర్ 19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.