బస్తర్‌లో వీచిన సానుభూతి | sympathy factor work in bastar region to congress party | Sakshi

బస్తర్‌లో వీచిన సానుభూతి

Dec 9 2013 1:05 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా సాగితే బస్తర్ డివిజన్‌లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ డివిజన్‌లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఎనిమిదింటిని కాంగ్రెస్ దక్కించుకోగా.. బీజేపీ నాలుగింటితో సరిపెట్టుకుంది.

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా సాగితే బస్తర్ డివిజన్‌లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ డివిజన్‌లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఎనిమిదింటిని కాంగ్రెస్ దక్కించుకోగా.. బీజేపీ నాలుగింటితో సరిపెట్టుకుంది. ఈ నాలుంటిలో ఒకటైన రాజ్‌నంద్‌గావ్ నియోజకవర్గంలో ప్రస్తుత సీఎం రమణ్‌సింగ్ 24,163 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక్కడ సానుభూతిని నమ్ముకొని కాంగ్రెస్ బరిలోకి దిగింది. దర్భాఘాట్‌లో జరిగిన మావోయిస్టుల ఘటనలో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ భార్య అల్కా ముదలియార్‌ను రమణ్‌సింగ్‌పై పోటీకి దింపినా.. కాంగ్రెస్‌కు పరాభవం తప్పలేదు. గత ఏడాది మే 25న బస్తర్ డివిజన్‌లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
  ఇందులో కాంగ్రెస్ నేతలైన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు, సల్వాజుడుం ముఖ్య నేత మహేంద్రకర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ చనిపోయారు. ఈ డివిజన్‌లోని మొత్తం 12 నియోజకవర్గాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. 2008 ఎన్నికల్లో బీజేపీ ఈ 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో గెలవగా.. ఈసారి సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. కొంటా, దంతేవాడ, చిత్రకూట్, బస్తర్, కాంకేర్, భానుప్రతాప్‌పూర్, కేశ్కల్, కొండగావ్ నియోజకవర్గాల్లో బీజేపీని చిత్తుచేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దంతెవాడ ఘటనలో మృతి చెందిన సల్వాజుడుం నేత మహేంద్రకర్మ భార్య దేవతీకర్మ 5,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొండగావ్ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రి లతా ఊసెండి ఇక్కడ బరిలోకి దిగినా.. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్‌లాల్ మరకం చేతిలో ఓటమి పాలయ్యారు. రమణ్‌సింగ్ సొంత జిల్లా రాజ్‌నందగావ్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఆరు నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు స్థానాలు దక్కించుకోగా, బీజేపీ రెండింటికే పరిమితమైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement