హైదరాబాద్‌ను టాప్‌–25లో ఒకటిగా చేస్తాం | Minister KTR Speech at Replanet Initiative By Times of India At Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను టాప్‌–25లో ఒకటిగా చేస్తాం

Published Wed, Nov 30 2022 2:41 AM | Last Updated on Wed, Nov 30 2022 2:41 AM

Minister KTR Speech at Replanet Initiative By Times of India At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచంలోనే టాప్‌–25 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇతర ప్రాంతాల మాదిరిగానే తెలంగాణలోనూ నగరీకరణ పెరుగుతోందని, రాష్ట్రం మొత్తం విస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే.. రెండు వేల చదరపు కిలోమీటర్ల మేర నగరాలున్నాయన్నారు.

ఈ చిన్న భౌగోళిక ప్రాంతంలోనే 46.8 శాతం జనాభా కేంద్రీకృతమై ఉండటం వల్ల తగిన మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారిందని తెలిపారు. మంగళవారం ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ దినపత్రిక నిర్వహించిన ‘రీప్లానెట్‌ ఇనీషియేటివ్‌’ కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పర్యావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడం ఎలా?

అన్న అంశంపై ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యంత పచ్చదనం కలిగిన నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందిందన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంతటితో సంతృప్తి పడరాదని, టాప్‌–25 నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించినట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా తాము పలు చర్యలు చేపట్టామన్నారు.  

శుద్ధి చేసిన నీరు భవన నిర్మాణాలకు... 
హైదరాబాద్‌ను మరింత పర్యావరణ అనుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. వచ్చే మార్చి, ఏప్రిల్‌కల్లా నగరంలో రోజూ ఉత్పత్తయ్యే 1,259 ఎంఎల్‌డీ మురుగునీటిని శుద్ధి చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఇందుకు తగ్గట్టుగా రెండవ దశ శుద్ధీకరణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నామని వివరించారు. శుద్ధి చేసిన నీటిని భవన నిర్మాణాల్లో, ల్యాండ్‌స్కేపింగ్, హార్టికల్చర్‌ రంగాల్లో ఉపయోగిస్తామన్నారు. థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో కొలుములను చల్లబరిచేందుకూ వాడుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 142 మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 68 కేంద్రాలు పూర్తికాగా మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. 

పొడి చెత్తతో విద్యుదుత్పత్తికి మరో రెండు కేంద్రాలు  
నగరాల్లో వరదనీటిని వృథా పోనివ్వకుండా ఉండేందుకు పుణే కేంద్రంగా పనిచేస్తున్న షా కన్సల్టెంట్స్‌తో హైదరాబాద్‌ నగరాన్ని సర్వే చేయించామని, వరదనీటి ప్రవాహం తీరుతెన్నులు, నీటి నిల్వకు అవకాశమున్న ప్రాంతాలన్నింటినీ మ్యాప్‌ చేశామని కేటీఆర్‌ తెలిపారు. అలాగే నగరంలో రోజూ వెలువడుతున్న సుమారు 6,000 టన్నుల చెత్తలో పొడి చెత్త ద్వారా విద్యుదుత్పత్తికి 20 మెగావాట్ల కేంద్రం ఒకటి ఇప్పటికే ఉండగా.. మరో 28 మెగావాట్ల కేంద్రం తయారవుతోందని, ఇంకో 20 మెగావాట్ల కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

నగరంలో దాదాపు 218 వారసత్వ కట్టడాలు ఉన్నాయని వీటన్నింటికీ పూర్వవైభవం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ మచ్చుకు ఒకటి మాత్రమేనని చెప్పారు. కార్యక్రమంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రెసిడెంట్‌ ఎడిటర్‌ రాబిన్‌ డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement