ప్రగతి పేరుతో సంపన్న దేశాలు ఇంతకాలం నుంచీ సాగిస్తున్న కార్యకలాపాలు భూగోళానికి మృత్యుపాశాలుగా మారాయని నిర్ధారణైనా ఆ దేశాల వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. జర్మనీలోని బాన్ నగరంలో రెండు వారాలపాటు జరిగి శుక్రవారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు ఆశించిన రీతిలో విజయవంతం కాలేదు. రెండేళ్లనాడు పారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక వాతావరణ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను నిర్ధారించ డానికి... కాలుష్య నివారణ కోసం అప్పట్లో వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఆ ఒడంబడిక లక్ష్య సాధనకు ఏమేరకు తోడ్పడతాయో తేల్చడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒడంబడిక అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనల రూపకల్పన కూడా ఇది చేయాల్సి ఉంది. అయితే వాటిపై అరకొర చర్చలే జరిగాయి. ఫలితంగా సదస్సు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేకపోయింది. వచ్చే ఏడాది మే లో పోలాండ్‌లోని కటోవైస్‌లో జరిగే కాప్–24 సదస్సు నాటికి అభివృద్ధి చెందిన దేశాలు తాము ప్రారంభించిన చర్యలేమిటో సూచించే నివేదికను సమర్పించాలని బాన్ సదస్సులో నిర్ణయించడం... 2020లో జరగబోయే కాప్–26 సదస్సులో వ్యవసాయం, ఆహారభద్రత, సామాజికార్ధిక రంగాల్లో తీసుకున్న చర్య లేమిటో అన్ని దేశాలూ నివేదించాలని తీర్మానించడం ఉన్నంతలో ఊరటనిస్తాయి.
మొత్తం 196 దేశాల మధ్య పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడు అది తమ ఘనతేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికల్లా ఆ స్థానంలో డోనాల్డ్ ట్రంప్ వచ్చి ఒడంబడికనుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అసలు పారిస్ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఆ ఒడంబడికను వారి వారి చట్టసభల్లో ప్రవేశపెట్టి ధ్రువీకరించవలసి ఉంది. మన దేశంతోసహా చాలా దేశాలు ఆ పనిచేశాయి. కానీ రష్యా వంటి అగ్ర రాజ్యం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోపక్క అమెరికా ఒడంబడిక నుంచి తప్పుకుంటానని బెదిరింపులు ప్రారంభించింది. తమ దేశానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్న ఈ ఒడంబడికలో భాగస్వాములం కాదల్చుకోలేదని మొన్న జూన్‌లో ట్రంప్ ప్రకటించినా కాప్–23 సదస్సుకు ఆ దేశం నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ముందుకొస్తే ఇందులో కొనసాగుతామని వాతావరణ అంశాలపై వైట్‌హౌస్ ప్రత్యేక సలహాదారు జార్జి డేవిడ్ బాంక్స్ చేసిన ప్రతిపాదన కాప్–23 సదస్సుకు రుచించలేదు. పునఃచర్చల ప్రసక్తే లేదని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ట్రంప్ వైఖరితో విభేదించే అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన నాయకులు ఈ సదస్సుకొచ్చారు. మొత్తానికి ఒడంబడిక అమలు కావాల్సిన 2020 ఎంతో దూరం లేదని తెలిసినా అగ్రరాజ్యాలు ఏవో సాకులు చెబుతూ కాలం గడుపు తున్నాయి. ఇందుకు పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడే బీజాలు పడ్డాయి. వాతా వరణ పరిరక్షణకు ఏం చేయాలన్న అంశంపై మాత్రమే అప్పుడు అవగాహన కుదిరింది. దాని అమలుకు సంబంధించిన విధివిధానాలు మున్ముందు ఖరారు చేసుకోవాలని అప్పుడు నిర్ణయించారు. ఒడంబడికను ఉల్లంఘించేవారిపైనా, దాన్నుంచి మధ్యలో వైదొలగేవారిపైనా ఎలాంటి చర్యలుండాలో అప్పుడే నిర్ధారిం చుకుంటే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడేది కాదు. తాము ఒడంబడిక అమలుకు అవస రమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడమే కాదు... అమలు చేస్తామని ముందుకొస్తున్న బడుగు దేశాలకు అందుకు అవసరమైన సాంకేతికతనూ, ఆర్ధిక సాయాన్ని అందించడంపై కూడా సంపన్న దేశాలు నికరంగా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు పారిస్ ఒడంబడిక అమలు పైనే అందరిలోనూ సందేహాలు ఏర్పడుతున్నాయి. ముందు నిర్ణయించినట్టు 2020లో ప్రారంభమవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాతావరణ కాలుష్యం వల్ల ముప్పు అంతకంతకూ పెరుగుతోందని శాస్త్ర వేత్తలు చెబుతున్నా, అందుకు దాఖలాలు కళ్లముందు కనబడుతున్నా సంపన్న దేశాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని బాన్ సదస్సు తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ఈ ఏడాది మన దేశంలోనూ, నైజీరియాలోనూ వరదలు ముంచెత్తాయి. చెన్నై నగరం రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు వరదనీటిలో ముని గింది. మొన్న సెప్టెంబర్‌లో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన హార్వే, ఇర్మా పెనుతుఫాన్లు డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో వంటి కరీబియన్ దేశాలను బెంబే లెత్తించాయి. అమెరికాలోని ఫ్లారిడా, హూస్టన్, టెక్సాస్ తదితర నగరాలు కనీవినీ ఎరుగని వైపరీత్యాన్ని చవిచూశాయి. ఆ నగరాలకు అపార నష్టం సంభవించింది. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ స్థాయికి పరిమిత మయ్యేలా చూడాలని, వీలైతే దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించనివ్వరాదని పారిస్ ఒడంబడిక పిలుపునిచ్చింది. కనీసం ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయినా బాన్ సదస్సులో పెద్దగా కదలిక లేకపోవడం విచారకరం. మన దేశం 2030 సంవత్సరానికి 200 గిగావాట్ల మేర సౌరశక్తి, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను సమీకరించాలని లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. 2030నాటికి బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని బ్రిటన్, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి 15 దేశాలు నిర్ణయించడం, వచ్చే ఏడాది జరగబోయే కాప్–24 సదస్సుకల్లా కనీసం 50 దేశాలను ఇందులో సమీ కరించాలని నిర్ణయించడం ఒక్కటే ఉన్నంతలో చెప్పుకోదగ్గ పరిణామం. అయితే బొగ్గును అధికంగా వినియోగిస్తున్న చైనా, అమెరికా, రష్యా, జర్మనీ ఈ గ్రూపులో పాలుపంచుకోలేదు. మొత్తానికి అరకొర నిర్ణయాలతో, పైపై మెరుగులతో పరిస్థితి చక్కబడదని... చిత్తశుద్ధితో వ్యవహరించి దృఢమైన నిర్ణయాలు తీసుంటేనే ఈ ధరి త్రిని రక్షించుకోగలమని సంపన్న దేశాలు గుర్తించాలి. పోలాండ్ సదస్సునాటికైనా వాటి తీరు మారాలి.
Comments
Please login to add a commentAdd a comment