Paris Agreement
-
Cop27: ఉత్తమాటల ఊరేగింపు
ఆచరణలో ఆశించిన పురోగతి లేనప్పుడు మాటల ఆర్భాటాల వల్ల ఉపయోగం ఏముంటుంది! ఈజిప్టులోని రేవుపట్నమైన షర్మ్ ఎల్–షేక్‌లో ఐక్యరాజ్య సమితి (ఐరాస) సారథ్యంలోని ‘పర్యా వరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల 27వ సదస్సు’ (యుఎన్–కాప్–27) ఆదివారం ముగిశాక అదే భావన కలుగుతోంది. 2015 నాటి ప్యారిస్ ఒప్పందం కింద పెట్టుకున్న లక్ష్యాలపై వేగంగా ముందుకు నడిచేందుకు ప్రపంచ దేశాలు కలసి వస్తాయనుకుంటే అది జరగలేదు. అది ఈ ‘కాప్– 27’ వైఫల్యమే. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై స్పష్టమైన హామీ లభించక పోవడంతో సదస్సుతో అందివచ్చిన అవకాశం చేజారినట్టయింది. అలాగని అసలు శుభవార్తలేమీ లేవని కాదు. కాలుష్యకారక ధనిక దేశాల వల్ల పర్యావరణ మార్పులు తలెత్తి, ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్న అమాయకపు దేశాల కోసం ‘నష్టపరిహార నిధి’ విషయంలో గత ఏడాది ఓ అంగీకారం కుదిరింది. దానిపై ఈసారి ఒక అడుగు ముందుకు పడింది. అది ఈ సదస్సులో చెప్పుకోదగ్గ విజ యమే. వెరసి, కొద్దిగా తీపి, చాలావరకు చేదుల సమ్మిశ్రమంగా ముగిసిన సదస్సు ఇది. సదస్సు ఫలితాలపై ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది అందుకే! పుడమితల్లి ఇప్పటికీ ‘అత్యవసర గది’లోనే ఉంది. గ్రీన్హౌస్ వాయువులను తక్షణమే గణనీయంగా తగ్గించా ల్సిన అవసరాన్ని ‘కాప్ గుర్తించలేదు’ అన్నది ఆయన మాట. అదే భావన ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది. పారిశ్రామికీకరణ అనంతరం విపరీతంగా కర్బన ఉద్గారాలకు కారణమైన ధనిక దేశాలు ‘నష్టపరిహార నిధి’కి ఒప్పుకోవడం కూడా ఆషామాషీగా ఏమీ జరగలేదు. 134 వర్ధమాన దేశాల బృందమైన ‘జి–77’ ఈ అంశంపై కట్టుగా, గట్టిగా నిలబడడంతో అది సాధ్యమైంది. ఈ నిధి ఆలోచన కనీసం 3 దశాబ్దాల క్రితం నాటిది. ఇన్నాళ్ళకు అది పట్టాలెక్కుతోంది. దాన్నిబట్టి వాతావరణ మార్పులపై అర్థవంతమైన బాధ్యత తీసుకోవడానికి ధనిక దేశాలు ఇప్పటికీ అనిష్టంగానే ఉన్నాయని స్పష్టమవుతోంది. పైపెచ్చు, ‘వాతావరణ బాధ్యతల నాయకత్వం’ వర్ధమాన ప్రపంచమే చేపట్టాలన్న అభ్యర్థన దీనికి పరాకాష్ఠ. చిత్రమేమిటంటే – ఈ నష్టపరిహార నిధిని ఎలా ఆచరణలోకి తెస్తారన్న వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం! ఆ నిధిని ఎలా సమకూర్చాలి, ఎప్పటికి అమలులోకి తేవాలనేది పేర్కొనలేదు. వాటిని ఖరారు చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్టు సదస్సు తీర్మానంలో చెప్పారే తప్ప, దానికీ తుది గడువేదీ పెట్టకపోవడం విడ్డూరం. అంతేకాక, దీర్ఘకాలంగా తాము చేసిన వాతావరణ నష్టానికి బాధ్యత వహించడానికి ఇష్టపడని ధనిక దేశాలు వర్తమాన ఉద్గారాలపైనే దృష్టి పెట్టనున్నాయి. ఆ రకంగా వర్ధమాన దేశాలకు ఇది కూడా దెబ్బే. ఇక, పారిశ్రామికీకరణ ముందు నాటి కన్నా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకే భూతాపోన్నతిని నియంత్రించాలని చాలాకాలంగా ‘కాప్’లో చెప్పుకుంటున్న సంకల్పం. ఈసారీ అదే లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దశలవారీగా శిలాజ ఇంధన వినియోగాన్ని ఆపేయడం కీలకం. గ్లాస్గోలో జరిగిన గడచిన ‘కాప్–26’లోనే ఇష్టారాజ్యపు బొగ్గు వినియోగాన్ని దశలవారీగా ఆపేందుకు అంగీకరించారు. తీరా దానిపై ఇప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరనే లేదు. శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించడంపై భారత్ తన వాణి బలంగా వినిపిస్తూ వచ్చింది. పునరుద్ధరణీయ ఇంధనాల వైపు వెళతామంటూ మన దేశం ఇప్పటికే గణనీయమైన హామీలిచ్చింది. కాకపోతే, ఒక్క బొగ్గే కాకుండా చమురు, సహజ వాయువులను సైతం శిలాజ ఇంధనాల్లో చేర్చాలని పట్టుబట్టింది. చివరకు మన డిమాండ్ గురించి ఎలాంటి ప్రస్తావనా లేకుండానే ముసాయిదా ఒప్పందం జారీ అయింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తడంతో, యూరోపియన్ దేశాలు మళ్ళీ బొగ్గుపైనే ఆధారపడే విధానాలకు తిరిగొచ్చాయి. శిలాజ ఇంధన వినియోగ లాబీదే పైచేయిగా మారింది. ఇది చాలదన్నట్టు వచ్చే ఏడాది జరిగే ‘కాప్’ సదస్సుకు చమురు దేశమైన యూఏఈ అధ్యక్షత వహించనుంది. కాబట్టి, భూతాపోన్నతిని నియత్రించేలా ఉద్గారాలను తగ్గించడమనే లక్ష్యం కాస్తా చర్చల్లో కొట్టుకుపోయింది. నవంబర్ 18కే ఈ సదస్సు ముగియాల్సి ఉంది. అయితే, పలు కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరక సదస్సును మరో రోజు పొడిగించారు. కానీ, సాధించినదేమిటంటే ‘నిధి’ ఏర్పాటు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేని పరిస్థితి. ఆ మాటకొస్తే, ఒక్క కరోనా ఉద్ధృతి వేళ మినహా... 1995లో బెర్లిన్‌లోని ‘కాప్–1’ నుంచి ఈజిప్ట్‌లోని ఈ ఏటి ‘కాప్–27’ వరకు ఇన్నేళ్ళుగా కర్బన ఉద్గారాలు నిర్దయగా పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. మన నివాసాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఈ సదస్సులతో గణనీయ లాభాలుంటాయనే అత్యాశ లేకున్నా, తాజా ‘కాప్–27’ అంచనాలను అధఃపాతాళానికి తీసుకెళ్ళింది. నియంతృత్వ పాలనలోని దేశంలో, ప్రపంచంలోని అతి పెద్ద ప్లాస్టిక్ కాలుష్యకారక సంస్థ స్పాన్సర్‌గా, 600 మందికి పైగా శిలాజ ఇంధన సమర్థక ప్రతినిధులు హాజరైన సదస్సు – ఇలా ముగియడం ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పటి వరకు జరిగిన సదస్సుల్లో ఇదే అతి పెద్ద ఫ్లాప్ షో అన్న మాట వినిపిస్తున్నది అందుకే. ఈ పరిస్థితి మారాలి. ఏటేటా పాడిందే పాడుతూ, వివిధ దేశాధినేతల గ్రూప్ ఫోటోల హంగామాగా ‘కాప్’ మిగిలిపోతే కష్టం. వట్టి ఊకదంపుడు మాటల జాతరగా మారిపోతే మన ధరిత్రికి తీరని నష్టం. -
సావరీన్ గ్రీన్ బాండ్ల జారీకి ఫ్రేమ్‌వర్క్
న్యూఢిల్లీ: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సావరీన్ గ్రీన్ బాండ్లను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో (2022–23 అక్టోబర్–మార్చి) గ్రీన్ బాండ్ల జారీ ద్వారా రూ.16,000 కోట్లను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం కేంద్ర రుణ సమీకరణలో (రూ.5.92 లక్షల కోట్లు) ఈ నిధులు భాగం కానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 బడ్జెట్లో సావరీన్ గ్రీన్ బాండ్ల జారీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ప్యారిస్ ఒప్పందం లక్ష్యాలపై భారత్ నిబద్ధతను ఈ ఫ్రేమ్‌వర్క్ బలోపేతం చేస్తుందని అన్నారు. అలాగే అర్హతగల గ్రీన్ ప్రాజెక్ట్‌ల్లోకి ప్రపంచ, దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపారు. ఫ్రేమ్‌వర్క్‌లో ముఖ్యాంశాలు... ► గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అవసరాలకు అనుగుణంగా, ఎకానమీలో కార్బన్ తీవ్రత తగ్గింపు లక్ష్యంగా జారీఅయ్యే ఈ రూపాయి డినామినేటెడ్ బాండ్ల సుదీర్ఘ కాల వ్యవధిని కలిగి ఉంటాయి. ► గ్రీన్ బాండ్ల జారీకి గరిష్టంగా 12 నెలల ముందు జరిగిన ప్రభుత్వ వ్యయాలకు ఈ సమీకరణ నిధులు పరిమితమవుతాయి. అలాగే జారీ చేసిన 24 నెలల్లోపు మొత్తం ఆదాయాన్ని ప్రాజెక్టులకు కేటాయించేలా కృషి జరగనుంది. ► గ్రీన్ బాండ్ల జారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని శిలాజ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, పంపిణీ లేదా అణు విద్యుత్ ప్రాజెక్టులకు వినియోగించరాదు. ► అర్హత కలిగిన పెట్టుబడులు, సబ్సిడీలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్స్ లేదా పన్ను మినహాయింపులు లేదా ఎంపిక చేసిన కార్యాచరణ ఖర్చుల రూపంలో గ్రీన్ బాండ్ల ప్రభుత్వ వ్యయాలు ఉంటాయి. -
పారిస్ ఒప్పందానికి.. కట్టుబడి ఉన్నది మేమే
గ్లాస్గో: వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు. మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు. ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు. జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్ ఫైనాన్స్ కింద ట్రిలియన్ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్ సంకల్పాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ఐదు సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. ప్రకృతితో సహ జీవనం వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికీ ఎన్నో సంప్రదాయ తెగలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ పరిజ్ఞానం ఆయా తెగల ప్రజలకు ఉందని అన్నారు. ఇది ముందు తరాలకు సైతం అందాలంటే సిలబస్‌లో చేర్చాలని చెప్పారు. భారత్‌తో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి విసురుతున్న సవాళ్లు తక్కువేమీ కాదని తెలిపారు. ఈ సవాళ్ల కారణంగా పంటల సాగు తీరే మారిపోతోందని అన్నారు. అకాల వర్షాలు, వరదలు, పెనుగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, క్లీన్ ఇండియా మిషన్, వంట గ్యాస్ సరఫరా వంటి చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన నాణ్యత పెరిగేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో మోదీ సోమవారం సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం. ఐదు సూత్రాల అజెండా 1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం. 2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం. 3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం. 4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం. 5. నెట్ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధిస్తుంది. -
భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలి
గ్లాస్గో: గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని కాప్– 26 అధ్యక్షుడు, బ్రిటన్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అలోక్శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు)కి నేతృత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలోక్ శర్మ భూతాపోన్నతిని తగ్గించడానికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉష్ణోగ్రతల్ని తగ్గించే మార్గాన్ని చూడాలన్నారు. ‘‘ఆరేళ్ల క్రితం పారిస్ సమావేశలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడాలని అనుకున్నాం. 1.5 డిగ్రీలకి పరిమితం చేయడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలి’’ అని అలోక్ అన్నారు. నవంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
నిరసనలు: వారి గోడు వినండి సారూ!
న్యూఢిల్లీ: లిసిప్రియా కంగుజం.. ప్రపంచంలోనే అత్యంత పిన్నవయసు పర్యావరణ కార్యకర్తగా గుర్తింపు పొందిన తొమ్మిదేళ్ల బాలిక. ఢిల్లీలో పీల్చేందుకు గాలి కరువైందని ఇటీవల రాష్ట్రపతి కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఆమె తాజాగా రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరారు. రైతులు లేనిదే తిండి లేదని, వారికి న్యాయం జరగనిదే విశ్రాంతి లేదని అన్నారు. వారి ఆక్రందనలను పట్టించుకోవాలని నరేంద్ర మోదీ సర్కారును విజ్ఞప్తి చేశారు. సంఘు బోర్డర్లో అన్నదాతలు చేస్తున్న నిరసనల్లో శనివారం రాత్రి ఆమె పాల్గొన్నారు. దాంతోపాటు రైతుల నిరసన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ట్విటర్లో షేర్ చేసి.. తన గోడును ప్రపంచ దృష్టికి చేరుతుందని ఆకాక్షించారు. గత 14 రోజులుగా తమ తల్లిదండ్రులు, తాతా బామ్మలతోపాటు ఢిల్లీలో నిరసనల్లో పాల్గొంటున్న పిల్లలు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: ఇక మహా పోరాటమే) ఇక పంజాబ్, హరియాణ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణానికి నష్టం కలుగుతోందని లిసిప్రియా ఆందోళన వ్యక్తం చేశారు. పంట వ్యర్థాలను కాల్చొద్దని ఆమె రైతులకు విజ్ఞప్తి చేశారు. వాతావరణ కాలుష్యం విషయంలో రైతులను మాత్రమే నిందిచలేమని చెప్పారు. వాతావరణ మార్పులతో అన్నదాతమే మొట్టమొదటి బాధితులుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనందరికీ కూడుపెట్టే రైతన్న చనిపోతే పట్టించుకునే నాథుడు లేడని, నీతి వ్యాఖ్యాలు వల్లించే రాజకీయ నాయకులు వారి శ్రేయస్సు కోసం పనిచేయాలని, రైతుల గోడు వినాలని హితవు పలికారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని లిసిప్రియా కేంద్రాన్ని అర్థించారు. పర్యావరణ పరిరక్షణతో రైతులకు, తద్వార సమస్త మానవాళికి ఎంతో మేలు జరగుతుందని అన్నారు. పారిస్ ఒప్పందనికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా వాతావరణ పరిరక్షణకు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు (చదవండి: రాష్ట్రపతి భవన్ ముందు తొమ్మిదేళ్ల బాలిక నిరసన) Hope my voice will reach all over the world. No farmers, No food. No justice, No rest.#FightFor1Point5 #FarmersProtests #ActNow pic.twitter.com/nTHiqxSYs2 — Licypriya Kangujam (@LicypriyaK) December 12, 2020 Met with children who are spending last 14 days in this cold freezing temperature with their parents and grandparents at farmers protest site in the middle of the highway at Sanghu Border. ❤️ pic.twitter.com/XXE38Og6Ro — Licypriya Kangujam (@LicypriyaK) December 12, 2020 -
బైడెన్ గెలుపు పర్యావరణ హితానికి కీలక మలుపు
చరిత్రాత్మక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు 2016లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండో సారి గెలిచి ఉంటే, పర్యావరణానికి సంబంధించి యావత్ మానవాళికి ముప్పు వాటిల్లేదని ప్రజాభి ప్రాయం. అభివృద్ధి, నాగరికత, పారిశ్రామికీకరణల పేరుతో పర్యా వరణానికి చేజేతులా ముప్పు తెచ్చిన ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేలుకొని చేసిన తప్పులు దిద్దుకోవడానికి గత 3 దశాబ్దాలుగా పాట్లు పడుతున్నాయి. భారీ డ్యాముల నిర్మాణం, ఖనిజాల త్రవ్వకం, అడవుల నరికివేత, అణు రియాక్టర్ల నిర్మాణం, బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం, డీజిల్ పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల్ని అడ్డూఅదుపూ లేకుండా మండించడంతో జీవవైవిధ్యం దెబ్బతింది. మాన వుని మనుగడకే ప్రమాదం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 190 దేశాలు సమావేశమై ‘వాతావరణ విధాన పత్రం’ను రూపొందిం చాయి. ఈ ఒప్పందంలో భూతల వేడిమిని వచ్చే 100 ఏళ్లలో ఇప్పుడున్న ఉష్ణోగ్రత స్థాయికి 2 డిగ్రీల సెల్సియస్ కంటే మించకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని తీర్మా నించాయి. పారిస్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరై భారత్ తరఫున ఒప్పందం మీద సంతకం చేశారు. 2016 నవంబర్ నుంచి పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి విస్మ యానికి గురిచేశాడు. వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా వాటా 15 శాతం. ఇంత పెద్ద మొత్తంలో నియంత్రించే చర్యలు చేపట్టాలంటే పారి శ్రామిక ఉత్పత్తులను తగ్గించాల్సి వస్తుందనీ, దానివల్ల అమెరికాలో నిరుద్యోగం పెరగడమే కాకుండా ఆర్థికాభి వృద్ధి దెబ్బతింటుందనీ ట్రంప్ వాదించాడు. పైగా చైనా, భారత్ పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకొంటున్నాయి కనుక, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటామని అన్నాడు. 2017 జూన్‌లో అధికారికంగా పారిస్ వాతావరణ ఒప్పందానికి చెల్లుచీటీ రాశాడు. ఒప్పందం నుండి బయటకు రావా లంటే మూడు సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఈ నిబం ధన వల్ల నవంబర్ 4, 2020న అమెరికా ఒప్పందం నుండి బయటకొచ్చినట్లయింది. యాదృచ్ఛికంగా నవంబర్ 4నే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోవటం విశేషం. అమెరికాలో మొదట్నుంచీ డెమొక్రాట్లు పారిస్ ఒప్పం దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక యిన వెంటనే తొలి నిర్ణయం పారిస్ వాతావరణ ఒప్పం దంలోకి పునఃప్రవేశించే దానిపైనే ఉంటుందని జోబైడెన్ ప్రకటించాడు. గత 4 ఏళ్లలో ‘గ్లోబల్ వార్మింగ్’ అమెరికాను అతలాకుతలం చేసింది. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభ వించాయి. దీంతో, క్షీణిస్తున్న దేశ వాతావరణాన్ని రక్షిం చుకోవాలన్న ఆకాంక్ష సగటు అమెరికన్లలో పెరిగింది. చైనా, భారత్ పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నా యంటూ ట్రంప్ చేసిన విమర్శల్లో కొంత నిజం లేక పోలేదు. కర్బన పదార్థాల వినియోగంలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ది 4వ స్థానం. రష్యా 5వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరి చాలా కాలమైంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలాంటి మెట్రో నగరాలలో ఆక్సి జన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2008లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ వాతావరణ మార్పు’పై విధా నాన్ని ప్రకటించింది. కాలుష్యరహిత బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమేపీ తగ్గించి బ్యాట రీలతో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. మోదీ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాక ‘సౌర శక్తి’ వినియోగంలో చొరవ చూపారు. ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ఏర్పాటు చేశారు. దేశంలో వ్యవసాయ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను దశలవారీగా సమకూర్చే ప్రక్రియ వేగవంతంగా అమలు అవుతోంది. దేశంలో రుతుపవనాల ఆగమనం, క్రమం తారు మారు అవుతున్నాయి. వర్షాకాలం 4 నెలలపాటు కొనసాగి నిర్ణీత వ్యవధిలో వర్షాలు పడటం ఆనవాయితీ. కొన్ని సంవత్సరాలుగా ఏకధాటిగా రెండు, మూడు రోజులపాటు కురియడం, ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడం వంటి వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం ఆటుపోట్లకు గురవుతోంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వరి, గోధుమ దిగుబడుల్లో రమారమి 30 శాతం క్షీణత నమోదవుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం అన్ని పంటల్లోకెల్లా వరి, గోధుమ, మొక్కజొన్నలపై ఎక్కువ ప్రతికూలత చూపుతుంది. అత్యధిక దేశాలలో ప్రజలు ఈ మూడు పంటల్నే ప్రధానాహారంగా తీసుకుంటారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మొక్కజొన్న పంటను కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగా తీసుకొనే ఆఫ్రికా ఖండంలోని జాంబియా, కాంగో, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్ తదితర దేశాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసే బాధ్యతను స్వీకరిస్తున్న ప్రభుత్వాలు పర్యావరణ ‘న్యాయం’ కూడా చేయాలి. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహ్లాదకరమైన పరిసరా లను అందుబాటులోకి తేవడమే ‘పర్యావరణ న్యాయం’. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. ఆ పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ కీలకం కానున్నది. వాతావరణ ఆంక్షల్ని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్ది, సంపన్న అగ్ర దేశాలు తప్పించుకోవాలని చూస్తే అంతకంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదు. భూగోళాన్ని కాపాడేందుకు ఎవరివంతు పాత్ర వారు పోషించాలి. ఆ దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలోకి ప్రవేశించడం ఆహ్వానించదగినది. వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ -
వాతావరణ మార్పులపై సమగ్ర పోరాటం
న్యూఢిల్లీ/రియాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంపూర్ణ, సమగ్ర పోరాటంతోనే వాతావరణ మార్పులను ఎదిరించవచ్చని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం జీ20 సదస్సులో సేఫ్గార్డింగ్ ద ప్లానెట్: ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా ప్రపంచం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని తెలిపారు. పారిస్ ఒప్పందంలోని లక్ష్యాల కంటే ఎక్కువే భారత్ సాధించిందని పేర్కొన్నారు. పర్యావరణంతో కలిసి జీవించాలన్న భారతీయ సంప్రదాయం స్ఫూర్తితో తక్కువ కార్బన్ ఉద్గారాల, వాతావరణ పరిరక్షణ అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. వ్యక్తి శ్రేయస్సుతోనే మొత్తం మానవాళి శ్రేయస్సు సాధ్యమని వెల్లడించారు. శ్రామికులను కేవలం ఉత్పత్తి సాధనాలుగా మాత్రమే చూడొద్దన్నారు. ప్రతి శ్రామికుడికి తగిన గౌరవం దక్కేలా చూడాలని ఉద్బోధించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనుషుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, అదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై సైతం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందన్నారు. ఒప్పందంలోని లక్ష్యాలను భారత్ సాధించిందన్నారు. భారత్‌లో ఎల్ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దీనివల్ల 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ కృషితో భారత్‌లో పులులు, సింహాల జనాభా పెరుగుతోందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2023లో జరగనున్న జీ20 భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. యూపీలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని విద్యాంచల్ ప్రాంతం వనరులున్నప్పటికీ వెనుక బాటుకు గురైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమి కారణంగా ఈ ప్రాంతం నుంచి ప్రజలు వలసవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ న్నారు. ఆదివారం ఆయన వింధ్యాచల్ ప్రాంతంలోని మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. -
ఫలితం లేకుండానే ముగిసిన ‘కాప్’
మాడ్రిడ్: దాదాపు 200 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులతో స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అట్టహాసంగా ప్రారంభమైన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు సీఓపీ25 ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఈనెల 2నుంచి 13 వరకూ జరగాల్సిన సమావేశాల్లో ఫలితం తేలకపోవడంతో ఆదివారం వరకూ పొడిగించారు. అయినప్పటికీ కర్బన ఉద్గారాల తగ్గింపుపై 2015 పారిస్ ఒప్పందం చేసిన సూచనలను అమలు చేసే దిశగా అడుగులు పడలేదు. వచ్చే ఏడాది స్కాట్లాండ్ (గ్లాస్గో)లో జరగనున్న సీఓపీ26 సదస్సులో వాటిని చర్చించాలని నిర్ణయించారు. ఈ సదస్సులో పలు అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ఎటువంటి అంగీకారం కుదరలేదు. -
ప్యారిస్ ఒప్పందంపై పేట్రేగిన ట్రంప్
న్యూయార్క్ : పారిశ్రామిక వ్యర్ధాలను ప్రక్షాళన చేసేందుకు భారత్, చైనా, రష్యా వంటి దేశాలు చేస్తున్నదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దేశాలు వారి వ్యర్ధాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో అవి లాస్ఏంజెల్స్లో తేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు అనేది సంక్లిష్ట అంశమని ట్రంప్ చెబుతూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను పలు విధాలుగా పర్యావరణ వేత్తనని చెప్పుకున్నారు. ఎకనమిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమెరికాకు విధ్వంసకరమైనదని ఈ ఏకపక్ష ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టడంతో పాటు విదేశీ కాలుష్య కారకులను కాపాడుతుందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంతో అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. చారిత్రక ఒప్పందంగా పేరొందిన పారిస్ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. గ్రీన్హౌస్ గ్యాస్ విపరిణామాలను నిరోధించే క్రమంలో 2015లో 188 దేశాలు భాగస్వాములుగా ప్యారిస్‌లో అంతర్జాతీయ ఒప్పందం ముందుకువచ్చింది. -
మాటల్లేవ్... చేతలే..
ఐక్యరాజ్యసమితి: వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పామని, ఇక మాటలు కట్టిపెట్టి, చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ నేతృత్వంలో వాతావరణ మార్పుపై సోమవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. పారిస్ ఒప్పంద అమలుపై కార్యాచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టే దిశగా కృషి చేస్తున్నాయిగానీ ఇప్పుడు ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని తన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. ‘మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు’ అని ప్రపంచదేశాలకు హితవు పలికారు. ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పునకు అంతా శ్రీకారం చుట్టాలన్నారు. ఈ సదస్సులో భారత్ తరఫున ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని 2022 నాటికి భారీగా 450 గిగావాట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నెల క్రితమే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పారిస్ ఒప్పందంలో భాగంగా.. ఆ లక్ష్యాన్ని 150 గిగావాట్లుగా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే. ‘ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వాడుకోవడం, మన అవసరాలను కుదించుకోవడం..మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆచరణ సాధ్యమైన ఒక ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెప్పేందుకే భారత్ ఈ సదస్సులో పాల్గొంటోందని స్పష్టం చేశారు. భారత్‌లో బయో ఫ్యూయల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ పథకంపై రానున్న కొన్ని ఏళ్లలో 50 బిలియన్ డాలర్లు(రూ. 3.5 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నామన్నారు. నిర్ణయాత్మక సమయం: ఐరాస వాతావరణ మార్పును ప్రతికూలతపై యుద్ధం ప్రకటించేందుకు నిర్ణయాత్మక సమయం ఆసన్నమైందని ఐరాస పేర్కొంది. ఐరాస సోమవారం నిర్వహించిన ‘క్లైమేట్ ఎమర్జెన్సీ సమిట్’లో దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతున్న నేపథ్యంలో.. బలహీనపడుతున్న పారిస్ ఒప్పంద అమలు లక్ష్యాలను పునరుజ్జీవింపజేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ‘వాతావరణ అత్యవసర స్థితి అనే పరుగుపందంలో మనం వెనకబడి పోతున్నాం. కానీ అది మనం గెలిచి తీరాల్సిన పరుగుపందెం’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ అన్నారు. ట్రంప్ కూడా వచ్చారు పారిస్ ఒప్పందం విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదా లున్నాయి. అమెరికాకు నష్టదాయకమంటూ 2017లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడే ఉన్నారు. అనూహ్యంగా, ముందే చెప్పకుండా ఈ సదస్సుకు ట్రంప్ హాజరుకావడం విశేషం. మోదీ, జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ ప్రసంగాల అనంతరం ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి ట్రంప్ వెళ్లిపోయారు. సెనెటర్ భార్యకు మోదీ సారీ! హ్యూస్టన్: అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్ భార్య సాండీకి మోదీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు. సారీ’ అని ఆమెతో చెప్పారు. అప్పుడు మోదీని చూడాలి హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీకి స్వాగతం పలుకుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరును ప్రస్తావించిన డెమొక్రాట్ పార్టీ నేత స్టెనీ హోయర్పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘మహాత్మాగాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ మానవహక్కులకు, బహుళత్వానికి పట్టం కట్టే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంది’ అని మోదీని స్వాగతిస్తూ స్టెనీ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. నెహ్రూ సేవలను మోదీకి అమెరికా నేతలు గుర్తు చేయడం బావుంది అని మరోనేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘అద్వానీ సైతం నెహ్రూను ప్రశంసిస్తూ గతంలో ప్రసంగించారు. ఆ రోజులేమయ్యాయి?’ అంటూ జైరాం ట్వీట్ చేశారు. ‘నెహ్రూ పేరును స్టెనీ ప్రస్తావించినపుడు మోదీ ముఖ కవళికలు చూడాల్సిందే’ అని సింఘ్వీ వ్యాఖ్యానించారు. -
కటోవీస్ మొక్కుబడి!
పారిస్ వాతావరణ ఒప్పందం అమలుకు అవసరమైన నిబంధనల్ని రూపొందించేందుకు పోలాండ్లోని కటోవీస్‌లో సమావేశమైన ప్రతినిధులు ఎట్టకేలకు ఆ పని పూర్తిచేశారు. పక్షం రోజులు అను కున్న సదస్సు మరో రోజు పొడిగించాల్సివచ్చింది. అయితే రూపొందిన నిబంధనలు సంతృప్తిక రంగా లేవు. నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవి ఏమేరకు దోహదపడతాయో సందేహమే. 200 దేశాల నుంచి వచ్చిన 23,000మంది ప్రతినిధులు 2020 నుంచి అమలు కావాల్సిన ఈ నిబంధన లపై చర్చించారు. కటోవీస్ సదస్సు సంక్లిష్ట పరిస్థితుల మధ్య జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పారిస్ వాతావరణ ఒప్పందంలో మార్పులు చేయకపోతే దాన్నుంచి వైదొలగుతా మని నిరుడు హెచ్చరించడమేకాక, అమెరికా చాన్నాళ్ల క్రితమే మూతబడిన బొగ్గు ఆధారిత కర్మాగా రాలను తిరిగి పని చేయించడం ప్రారంభించారు. ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల్లో చైనా తర్వాత అమెరికా రెండో స్థానంలో ఉంది. మరోపక్క వచ్చే ఏడాది తమ దేశంలో జరగాల్సిన కాప్–25 సదస్సుకు లోగడ ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నా మని బ్రెజిల్ ప్రకటించింది. అంతేకాక పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదన్న ప్రచార మంతా పెట్టుబడిదారీ దేశాలను దెబ్బతీయడానికి ‘మార్క్సిస్టులు’ పన్నిన కుట్రగా అభివర్ణించింది. అక్కడ మితవాద పక్ష నాయకుడైన జైర్ బోల్సొనారో దేశాధ్యక్షుడిగా గెలిచాక బ్రెజిల్ వైఖరి మారింది. చివరకు ఆ సదస్సును చిలీలో జరపాలని నిర్ణయించారు. కర్బన ఉద్గారాలను అధికంగా వదిలే దేశాల జాబితాలో బ్రెజిల్‌ది 11వ స్థానం. దీనికితోడు అక్టోబర్‌లో విడుదలైన ఐక్యరాజ్యస మితి వాతావరణ నివేదికను తప్పుబడుతూ చమురు ఉత్పత్తి చేసే దేశాలు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్‌లు కటోవీస్ సదస్సుకు ముందు చేసిన ప్రకటన అందరిలోనూ సందేహాలు రేకె త్తించింది. సదస్సు కర్తవ్యాలను అడ్డుకోవడానికి, వీలైతే నీరుకార్చడానికి ఈ దేశాలన్నీ ప్రయత్ని స్తున్నాయన్న ఆందోళన తలెత్తింది. వీటన్నిటినీ దాటుకుని నిబంధనలు ఖరారయ్యాయి. అయితే ఇవి ఉండాల్సినంత పటిష్టంగా లేవు. నిర్దిష్టమైన అంశాల విషయంలో తప్పించుకునే ధోరణే వ్యక్త మైంది. తాజా నిబంధనలను అనుసరించి ప్రతి దేశమూ తన కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాటిని తగ్గించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలేమిటో వివరిస్తూ ప్రతి రెండేళ్లకూ నివే దిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమం 2024 నుంచి అమలవుతుంది. కర్బన ఉద్గారాల వల్ల ముంచుకొచ్చే ప్రమాదం గురించి ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో అవగాహన ఉంది. కానీ వాటిని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను అమలు చేయడం వాటికి పెద్ద ఇబ్బందిగా ఉంది. ఈ సాంకేతికత అమలుకు కావల్సిన వ్యయం గురించి వర్ధమాన దేశాల్లో ఆందోళన ఉంది. ఆ విషయంలో అందించాల్సిన ఆర్థిక సాయంపై అంగీకారం కుదిరింది. 2020లోగా ఏడాదికి 10,000 కోట్ల డాలర్లను సమీకరించాలని లోగడ పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించా లని నిర్ణయించారు. 2025 నుంచి అమలయ్యే కొత్త లక్ష్యాలను రూపొందించాలన్న అవగాహన కుది రింది. అయితే ఈ నిధుల్ని అన్ని దేశాలూ కాలుష్య నివారణ చర్యలకు వినియోగించేందుకు అవసర మైన ప్రణాళికలు ఖరారు చేసుకోవాలి. ఇప్పుడు కాప్–24 సదస్సు జరిగిన పోలాండ్ విద్యుదుత్పా దన ప్రాజెక్టుల్లో 80 శాతం బొగ్గు ఆధారితమైనవే. 2030 కల్లా ఉద్గారాల తీవ్రతను దాదాపు 35 శాతం తగ్గించుకుంటామని పారిస్ వాతావరణ సదస్సులో దేశాలన్నీ ప్రకటించాయి. అలాగైతేనే పారిశ్రామికీకరణకు ముందునాటి స్థాయికంటే రెండు డిగ్రీల సెల్సియస్‌కి మించి ఉష్ణోగ్రత పెరగ కుండా చూడగలమని ఆ సదస్సు తెలిపింది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఈ లక్ష్యాలు ఏమాత్రం సరిపోవని చెబుతున్నారు. నిజానికి 2030నాటికి ఒకటిన్నర డిగ్రీలకు మించి పెరగ కుండా చూస్తేనే జరగబోయే ఉపద్రవాన్ని నివారించగలమని వారు చెబుతున్న మాట. ఆ కోణంలో చూస్తే కటోవీస్ సదస్సు మిశ్రమ ఫలితాలు సాధించిందని చెప్పాలి. నిబంధనలు పారదర్శకంగా ఉండాలని సదస్సుకు ముందునుంచీ అందరూ కోరారు. దానికి ఆమోదం లభించింది. అయితే కర్బన ఉద్గారాలకు పరిమితులు విధించేందుకు అవసరమైన యంత్రాంగాల రూపకల్పనకు సంబం ధించిన నిబంధనలపై ఈ సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు. అది వచ్చే ఏడాది జరిగే చిలీ సద స్సులో పరిశీలించాలని నిర్ణయించారు. సముద్ర మట్టాలు పెరిగితే ప్రమాదంలో చిక్కుకునే ద్వీప కల్ప దేశాల ప్రతినిధులు మాత్రం కర్బన ఉద్గారాల అదుపునకు కఠినమైన నిబంధనలు ఉండాల్సిం దేనని వాదించారు. లక్ష్యాల సాధనలో విఫలమయ్యే దేశాలపై కఠిన చర్యలుండాలని సూచించారు. నిజానికి పారిస్ వాతావరణ సదస్సులో నిర్ణయించిన లక్ష్యాలన్నీ ఆయా దేశాలు స్వచ్ఛందంగా ప్రక టించినవే. అటువంటప్పుడు వాటిని సాధించనిపక్షంలో పెనాల్టీలు విధించడానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ పెనాల్టీల బదులు ఆ దేశాలపై ఒత్తిళ్లు తీసుకురావడంతో సరి పెట్టాలని కటోవీస్‌లో నిర్ణయించారు. అసలు దేశాలన్నీ తమ తమ కర్బన ఉద్గారాల స్థాయిపై పార దర్శకంగా వివరాలందిస్తాయా, అలా ఇవ్వకపోతే విధించే పెనాల్టీలేమిటన్న సందేహాలున్నాయి. కానీ సదస్సు ఈ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అమెరికా అడ్డం తిరగడాన్ని సాకుగా తీసుకుని కొన్ని దేశాలు సదస్సులో స్వరం మార్చాయి. పర్యావరణానికి కలిగే ముప్పు వల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొనవలసి వస్తుందో మన దేశంతోసహా అందరికీ ఇప్పుడు అనుభవపూర్వకంగా అర్ధమైంది. కటోవీస్ సదస్సుకు ముందు కొన్ని ఆందోళనకర పరిణామాలు ఏర్పడిన మాట వాస్తవమే అయినా మూడేళ్లనాటి పారిస్ వాతావ రణ ఒప్పందాన్ని అమలు చేయడం విషయంలో మెజారిటీ దేశాలు గట్టి సంకల్పంతో ఉన్నాయి. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో ఇది ప్రతిబింబించకపోవడం నిరాశ కలిగిస్తుంది. ముప్పు ముంచుకొస్తున్నదని తెలిసినా ఉదాసీనత ప్రదర్శించడం క్షంతవ్యం కాదు. -
చమురు దేశాలే అడ్డుకట్టయితే...!
వేసవిలో రెండు నెలలు వేడి భరించాలంటేనే మనుషులకు చాలా కష్టం. అలాంటిది సంవత్సరం పొడవునా కాల్చే ఎండ తాకిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడితే ఎలాఉంటుంది? కేవలం రెండు డిగ్రీల సెల్సియస్‌కి భూతాపం పెరిగి, ఇంతవరకు ప్రపం చం చవిచూసిన పర్యావరణ సమతుల్యతే ధ్వంసం అయిపోతే..! ప్రపంచ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అందుకే పర్యావరణ సమస్య ఇప్పుడు ప్రపంచ సమస్యగా మారింది. కానీ శాస్త్రవేత్తలూ, పర్యావరణ నిపుణులూ, కార్యకర్తలూ ఒక వైపు మొత్తుకుంటున్నా ఆర్థిక ప్రయోజనాలు తప్ప దేన్నీ పట్టించుకోని రాజకీయ నేతలు, ప్రభుత్వాల నిర్వా కం వల్ల ఇంత తీవ్ర సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఉంది. పర్యావరణ రక్షణపై తొలి సారిగా ఒప్పందం సాకారమవుతుందనుకున్న కల భగ్నమవుతున్న సూచనలు కనపడుతున్నాయి. నాలుగు చమురు ప్రధాన దేశాలు మానవాళి భవిష్యత్తుకు వ్యతిరేకంగా నిలుస్తున్న ఘటనకు పోలెండ్ లోని కటోవీస్ వేదికగా నిలిచింది. బొగ్గు, చమురు మొదలైన శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయకపోతే పర్యావరణ వ్యవస్థ ధ్వంసమయ్యే ప్రమాదముందని అంతర్జాతీ యంగా శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికల ఫలితంగా మూడేళ్ల క్రితం పారిస్ సదస్సులో ఉమ్మడి ఒప్పందం సాధ్యమైంది. ఆ ఒప్పందం అమలుకు రూపొందించుకోవలసిన నియమనిబంధనలు (రూల్ బుక్)పై రెండేళ్లుగా చర్చలు జరుగుతూ కటోవీస్‌లో కాప్–24 సదస్సులో ఒక నిర్దిష్ట రూపం దాలుస్తుందని పెట్టుకున్న నమ్మకం వమ్ము అయే సూచనలు కనిపిస్తున్నాయి. గత అక్టోబరులో విడుదలైన ఐక్యరాజ్య సమితి చారిత్రాత్మక వాతావరణ అధ్యయనానికి లభిస్తున్న ప్రపంచవ్యాప్త మద్దతుపై నీళ్లు చల్లేం దుకు నాలుగు చమురు ప్రధాన ఉత్పత్తి దేశాలు అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, కువైట్ పూనుకున్నాయి. మానవాళి మనుగడకు, ప్రపంచ భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అతిముఖ్యమైన సదస్సును నాలుగంటే నాలుగు దేశాలు ప్రతిష్టంభనకు గురిచేస్తుండటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. శిలాజ ఇంధనాలను నియంత్రిస్తే చమురు ఉత్పత్తి, అమ్మకాల పునాదిగా ఎదుగుతున్న తమ ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతాయన్న ఎరుక ఈ నాలుగుదేశాలను దారి మళ్లించింది. ప్రపంచం ఏమైతేనేం, పర్యావరణం ఎలా ధ్వంసమైతేనేం.. తమ పెట్రో డాలర్ల వాణిజ్యం సజావుగా ఉంటే చాలు అని అటు ఒకప్పటి అగ్రరాజ్యాలూ, ఇటు చమురు సంపన్న దేశాలు భావించడం స్వార్థప్రయోజనాలకు నిలువెత్తు సంకేతం. ‘’అసంఖ్యాకులైన అమెరికన్ ప్రముఖ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచ శాస్త్ర ప్రపంచం ఉమ్మడి బాధ్యతతో రచించిన ఈ కీలకమైన ఐరాస వాతావరణ అధ్యయన నివేదికను సాక్షాత్తూ ప్రపంచంలోనే అగ్రగామి సైంటిఫిక్ సూపర్ పవర్ తిరస్కరిం చడం, అవిశ్వాసం వ్యక్తపర్చడం నిజంగానే విచార హేతువు’’ అంటూ పర్యావరణ వేత్త అల్డెన్ మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 నుంచి 2 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగితే భూమి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వాతావరణ మార్పుపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ప్రత్యేక నివేదిక (ఐపీసీసీ) పేర్కొనడమే కాకుండా సంస్కరణలను శరవేగంగా అమలు పర్చాలని కోరింది. కానీ పర్యావరణ సంస్కరణలను శరవేగంగా అమలు పర్చడం మాటేమిటో గానీ, అసలుకే మోసం వచ్చే పరిస్థితి కనబడుతోంది. ప్యానెల్ నివేదికను ప్రశంసిస్తున్నాం కానీ దానిలోని అంశాలను మేం స్వీకరించలేము. కావాలంటే వాటిని నోట్ చేసుకుంటాం అంటూ అమెరికా విదేశాంగ శాఖ చావుకబురు చల్లగా చెప్పింది. కటోవీస్‌లో ఈ ఒప్పందం అమలు విధి విధానాలపై తీవ్ర చర్చలు జరుగుతున్నప్పుడే అమెరికాతోపాటు రష్యా, సౌదీ అరేబియా, కువైట్ దేశాలు జరుగుతున్న చర్చలపై నీళ్లు చల్లే పని మొదలెట్టాశాయి. అసలు పారిస్ ఒప్పందంనుంచే వైదొలగుతామని డొనాల్డ్ ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. దీనికి ఇతర చమురు ప్రధాన దేశాలు ఇప్పుడు ఊతమివ్వడంతో ఆ ఒప్పందం ఉనికే ప్రమాదంలో పడనుంది మనం ఇప్పుడు ఒప్పందం గురించి కాదు.. మన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. ఇంత తీవ్ర అంశం పట్ల ప్రభుత్వాలు వ్యతిరేక దృక్ప థంతో ఉంటే దాని ఫలితం యావత్ ప్రపంచం అనుభవించాల్సి ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు దేశాల స్వార్ధం సకల దేశాల మనుగడకు ప్రమాదం కానున్న పరిస్థితిని ఉమ్మడిగా ఎదుర్కోవడమే ఇప్పుడు జరగాల్సి ఉంది. - కె. రాజశేఖరరాజు -
ఏటా 18 లక్షల మందికి అకాల మరణం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్రమవడంతో స్కూళ్లకు అత్యవసర సెలవులు ప్రకటించారు. ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాల్సిందిగా పిల్లలందరికి హెచ్చరికలు జారీ చేశారు. ఆఫీసుకెళ్లే ఉద్యోగులు సైతం కాలుష్యం నుంచి తట్టుకునేందుకు మెడికల్ మాస్క్‌లు ధరించాల్సిందిగా సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణంలో కాలుష్యం ఇంత ప్రమాదకరమైనదా? ఇంతా అంతా కాదు భారత దేశంలో కాలుష్యం, ముఖ్యంగా వాయు కాలుష్యం కారణంగా ఏటా ఏకంగా 18 లక్షల మంది ఆయువు తీరకుండానే మరణిస్తున్నారని ‘లాన్సెట్’ మెడికల్ మాగజైన్ వెల్లడించింది. భారత దేశంలోనే కాలుష్యం మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కాలుష్య నగరాలను గుర్తించగా, అందులో 14 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వాటిల్లో ఢిల్లీ, వారణాసి, పట్నా నగరాలు అగ్రస్థానాల్లో ఉన్నాయి. పట్టణాల్లో కూడా మురికి వాడల్లో కాలుష్యం పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. ఇప్పుడు కాలుష్యం భూతం ఒక్క భారత్‌నే కాకుండా ప్రపంచ దేశాలను, ముఖ్యంగా ఆసియా దేశాలను పట్టి పీడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కాలుష్యం కారణంగా 70 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే ధూమపానం సేవించడం వల్ల మరణించే వారి సంఖ్యకన్నా కాలుష్యం కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. వాతావరణంలో పీఎం 2.5 (పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 మిల్లీమీటర్ల) ధూళి కణాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, కాలేయం క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు. ధూళి కణాల వల్ల మెదడులో, గుండెలో రక్త నాళాలు చిట్లి పోతున్నాయని లాన్సెట్ మెడికల్ జర్నల్ తెలియజేసింది. భారత్‌లో ఇంటిలోపల కూడా కాలుష్యం పెరుగుతోందని, ఈ కాలుష్యం కారణంగా ఏటా 13 లక్షల మంది మరణిస్తున్నారు. సంప్రదాయ పద్ధతిలో కట్టెలు, బొగ్గులను ఉపయోగించడం వల్ల, బయోగ్యాస్ వల్ల ఇంటిలో కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరంగా కాలుష్యం పెరుగుతున్నందునే అక్టోబర్ 30వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. దేశంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ‘పారిస్ ఒప్పందం’లో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేయాలి. ముఖ్యంగా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నుంచి జల విద్యుత్ కేంద్రాలు, సోలార్, పవన విద్యుత్ కేంద్రాల వైపు మళ్లాలి. వాహనాల కాలుష్యాన్ని తగ్గించాలి. దేశంలోని 57 థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాల్సిందిగా ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం ఇక్కడ గమనార్హం. కాలుష్యానికి కారణం అవుతున్న డీజిల్, పెట్రోల్ కార్లకు క్రమంగా స్వస్తిచెప్పి ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లాలి. 2030కల్లా దేశంలో ఒక్క ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అమ్మకానికి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం ముదావహం. -
కళ్లు తెరిపించే హెచ్చరిక
ప్రకృతి ఎంతగా హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ ఇష్టానుసారం విధ్వంసాన్ని కొనసాగిస్తున్న మానవాళికి ఐక్యరాజ్యసమితి వాతావరణ అధ్యయన బృందం(ఐపీసీసీ) వెల్లడించిన అంశాలు కను విప్పు కలిగించాలి. రానున్న రోజుల్లో భూతాపం వల్ల మన కోల్‌కతా నగరం, పాకిస్తాన్ నగరం కరాచీ చండప్రచండమైన ఎండల్ని, వడగాలుల్ని చవిచూస్తాయని ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక హెచ్చ రించింది. సకాలంలో సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడకపోతే కోట్లాదిమంది జీవితాలు అస్త వ్యస్థమవుతాయని వివరించింది. ఒకటిన్నర దశాబ్దాల క్రితం అంకురార్పణ జరిగిన పారిశ్రామికీ కరణ సమస్త సహజ వనరుల్నీ పీల్చి పిప్పి చేస్తోంది. బొగ్గు నిల్వల వాడకం, శిలాజ ఇంధనాల వాడకం విచ్చలవిడిగా పెరిగి వాతావరణం అంతకంతకు నాశనమవుతోంది. దీన్నిలాగే కొనసాగ నిస్తే మున్ముందు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందో ఐపీసీసీ తెలిపింది. 2030నాటికి ఉష్ణోగ్రత 1.5–2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగితే విధ్వంసం ఎంత తీవ్రంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపింది. ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కదిలితే, పర్యావరణ హిత చర్యలకు నడుం బిగిస్తే 2030నాటికి దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని, ఆరున్నరకోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని, వాయు కాలుష్యం వల్ల కలిగే లక్షలాది మరణాలను అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుందని గత నెలలో ఆర్థిక, వాతావరణ విషయాల అంతర్జాతీయ సంస్థ (జీసీఈసీ) తెలియజేసింది. శిలాజ ఇంధనాల వినియోగంపై ఆధారపడే ప్రస్తుత స్థితిని మార్చుకోగలిగితే ఎన్నో లాభాలుంటాయని గణాంక సహితంగా వివరించింది. ఇప్పుడు ఐపీసీసీ నివేదిక చూశాకైనా దేశాలన్నీ ఆ వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని తెలుస్తుంది. 1992లో జరిగిన తొలి ధరిత్రీ సదస్సు పర్యావరణానికి జరుగుతున్న హానిని, దాని పర్యవసానంగా ఏర్పడే దుష్పరిణా మాల్ని వివరించి అందరిలోనూ చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ సాకారమైంది. అయితే కర్బన ఉద్గారాలకు నిర్దిష్ట వ్యవధిలో కోత పెట్టి, కాలుష్య నియంత్రణ సాంకే తిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు అందుబాటులోకి తెస్తామని ధనిక దేశాలు అంగీకరించినా అప్పట్లో అమెరికా దాన్ని తోసిపుచ్చింది. నిజానికి ప్రపంచంలో అందరికన్నా అధికంగా, విచ్చలవి డిగా సహజ వనరుల్ని వాడేది అమెరికాయే. ఆ తర్వాత 2009లో జరిగిన కోపెన్ హాగన్ సదస్సు నాటికి అది కళ్లు తెరుచుకున్నదన్న అభిప్రాయం కలిగించింది. అప్పటి అధ్యక్షుడు ఒబామా తాము సైతం పర్యావరణ పరిరక్షణకు అంకితమవుతామని ప్రకటించారు. 2005 స్థాయి కర్బన ఉద్గారాల్లో 2020కల్లా 17 శాతం, 2030కల్లా 42 శాతం, 2050నాటికి 83 శాతం తగ్గిస్తామని ఆ దేశం సంసిద్ధత వ్యక్తపరిచింది. 2015లో పారిస్ శిఖరాగ్ర సదస్సులో కర్బన ఉద్గారాల తగ్గింపుపై 200 దేశాల మధ్య ఒడంబడిక కుదిరింది. 2005నాటి కర్బన ఉద్గారాల స్థాయిలో 33 నుంచి 35 శాతాన్ని 2030కల్లా తగ్గించాలని ఆ ఒడంబడిక సారాంశం. దాన్ని సాధించగలిగితే 2050నాటికి భూతాపం పెరుగుద లను కనీసం 1.5 – 2 డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి పరిమితం చేయగలమని ఆ సదస్సు అంచనా వేసింది. ఆ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాల నిర్ధారణకు, వివిధ దేశాలు అప్పట్లో హామీ ఇచ్చిన లక్ష్యాల సాధనలో ఇవి ఏవిధంగా తోడ్పడగలవో అంచనా వేయడానికి నిరుడు జర్మనీలోని బాన్‌లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు కూడా జరిగింది. అయితే నిర్దిష్టమైన మార్గదర్శకాల రూపకల్పనలో ఆ సదస్సు విఫలమైంది. దానికి కొనసాగింపుగా వచ్చే డిసెంబర్లో పోలాండ్లోని కటోవైస్‌లో కాప్–24 సదస్సుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కానీ అక్కడ ఈ దేశాలన్నీ ఏం సాధించగలవో అనుమానమే. మొత్తానికి 2020నాటికల్లా పారిస్ ఒడంబడిక అమలు ప్రారంభం కావాలని సంకల్పం చెప్పు కున్నా ఆ దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఒక్క అమెరికా మాత్రమే కాదు... మిగిలిన దేశాలు కూడా పర్యావరణానికి ముంచుకొస్తున్న ప్రమాదంపై చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని ఈమధ్యే ఫిజీ ప్రధాని బైనిమారమా నిరాశ వ్యక్తం చేశారు. ఐపీసీసీ నివేదిక భయానక భవిష్యత్తును కళ్ల ముందు ఉంచింది. భూతాపం కారణంగా ఊహకందని విధ్వంసం చోటు చేసుకోబోతున్నదని హెచ్చరించింది. 2030నాటికి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగితే పంటల దిగుబడి గణనీయంగా తగ్గి పోతుందని, ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటివి తీవ్ర రూపం దాలు స్తాయని తెలిపింది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా లక్షలాదిమంది మరణిస్తారని వివరించింది. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరు గుతాయని, తీర ప్రాంతాలకు ముంపు ముప్పు తప్పదని హెచ్చరించింది. వీటి ప్రభావం అత్యంత నిరుపేద వర్గాలపైనే అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ వర్గాలకు జీవనోపాధి దెబ్బతింటుం దని, ఆహార కొరత ఏర్పడుతుందని, అంటువ్యాధులు పీడిస్తాయని అంచనావేసింది. అన్ని అంశాలనూ అధ్యయనం చేసి, పొంచి ఉన్న పర్యావరణ ముప్పును అంచనా వేయమని పారిస్ ఒడంబడిక కుదిరాక ఐక్యరాజ్యసమితి ఐపీసీసీని కోరిన పర్యవసానంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. అయితే దీని రూపకల్పన కోసం వివిధ దేశాల్లోని ప్రభుత్వాలను సంప్రదించటం, వారిచ్చిన గణాంకాలు స్వీకరించడం ప్రధాన లోపమనే చెప్పాలి. ప్రభుత్వాలు సహజంగానే పరి స్థితుల తీవ్రతను తగ్గించి చెబుతాయి. తమ లోపాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఏ దేశమూ తాము రెండేళ్లనాటి పారిస్ ఒడంబడికకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోయామని ఒప్పుకోదు. అమెరికా, సౌదీ అరేబియా వంటివైతే ఐపీసీసీకి సరిగా సహకరించనే లేదు. అంటే ఈ నివేదిక హెచ్చరిస్తున్న స్థాయికి మించే భూగోళానికి ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ప్రజలు గుర్తించాలి. తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రకృతి విధ్వంసాన్ని అడ్డుకోవాలి. అంతిమంగా ప్రజానీకంలో ఏర్పడే చైతన్యమే ప్రభుత్వాల మెడలు వంచగలదు. -
ప్రజాధనం–పచ్చదనం–మనం
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసంఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్యక్రమంగానే మిగిలిపోతుంది. అందుకే ప్రజలు స్వచ్చందంగా పాల్గొని రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యత నెరవేర్చాలి. హక్కుల గురించి మాత్రమే మాట్లాడే మను షులకు బాధ్యతల్ని గుర్తు చేస్తే చురుక్కుమంటుంది. తమ విధులు–బాధ్యతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి దంటారు. మన సామూహిక బాధ్యతలు కూడా ఏతావాతా మనందరం ఉమ్మడి హక్కులు నిండుగా అనుభవించడానికే అని చెబితే... ఎట్టెట్టా? అని ముక్కున వేలేసుకుంటారు. వ్యక్తిగత హక్కుల భద్ర తకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. హక్కులు, బాధ్య తలూ ఒకే నాణేనికి రెండు వైపులంటే... ‘ఓయబ్బో! ఈయనొచ్చాడయా దిగి... మాకు నీతి పాఠాలు చెప్ప డానికి, హు...!’ అన్నా అంటారు. కానీ, ఇది పచ్చి నిజం! మానవ సంబంధాలు, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విద్య–ఉపాధి అవ కాశాల కల్పన... ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు మనం హక్కుల గురించి మాట్లాడినంత బాధ్యతల గురించి మాట్లాడం, మాట్లాడనీయం. అదీ ముఖ్యంగా పౌరుల బాధ్యతల గురించైతే అస్సలు మాట్లాడం! ఎంతసేపు ప్రభుత్వాల బాధ్య త–జవాబుదారితనం, అధికారుల విధులు–కర్త వ్యాలు, వాటి విజయ–వైఫల్యాలే మనకు సదా కథా వస్తువు. మన హక్కుల గురించి, అవి భంగపోయిన తీరు గురించి ఎంతైనా మాట్లాడతాం. అవతలి వారి బాధ్యతల గురించి, వాటి అమలులో వైఫల్యం గురించి అంతకన్నా పిసరు ఎక్కువగానే మాట్లా డతాం. మరి మన బాధ్యతల సంగతి? మన విధి నిర్వహణ మాటో! మన జవాబుదారితనం ఏం గాను? కొన్ని విషయాల్లో మనం బాధ్యతల్ని విస్మరిం చడం ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో తెలు సుకుంటే గుండె తరుక్కుపోతుంది. పర్యావరణమే తీసుకుంటే, దాని పరిరక్షణ రాజ్యాంగం మనకు నిర్దే శించిన బాధ్యత. ఈ విషయంలో ఏ మేరకు మనం బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నామని ఎవరికి వారు బేరీజు వేసుకోవాల్సిందే! పౌరులుగా, ప్రజా సంఘాలుగా, పౌర సమాజంగా మనకూ ఈ విషయంలో విహిత బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశం మొత్తమ్మీద పెద్ద ఎత్తున ప్రజాధ నాన్ని వెచ్చించి చేపడుతున్న ‘హరిత’ కార్యక్రమాల్లో జనభాగస్వామ్యం, పౌర అప్రమత్తత, ప్రజాసం ఘాల నిఘా, సామాజిక సంస్థల తనిఖీ ఎంత? అన్నది కీలక ప్రశ్న. ఇవన్నీ సవ్యంగా జరిగినపుడే ఆయా కార్యక్రమాల రచనలో ఉద్దేశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. ఖర్చయ్యే ప్రతి పైసాకు ఎంతో కొంత ప్రయోజనం నెరవేరుతుంది. లేకుంటే, పెద్ద మొత్తం ప్రజాధనం ఖర్చయిపోయి ఇదొక డొల్ల కార్య క్రమంగానే మిగిలిపోతుంది. మంచి పనికి పౌర మద్దతుండాలి జనాకర్షణ పథకాలతో ఓట్లు పిండుకునే రాజ కీయాలు నడుస్తున్న కాలంలో, ఏ వత్తిడి లేకపోయినా ప్రభుత్వాలు ‘హరితహారం’ వంటి బృహత్ కార్య క్రమం తీసుకోవడాన్ని విమర్శకులు కూడా అభినంది స్తారు. అయిదేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. నాలుగో విడత హరితహారాన్ని బుధవారమే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ యేడు 40 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం. 33 శాతం ఉండా ల్సిన అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉన్నట్టు ప్రభు త్వం చెబుతోంది. అది కూడా సందేహమేనని పర్యా వరణవేత్తలంటున్నారు. పంచాయతీరాజ్ చట్టం లోనూ మార్పులు చేసి హరితహారాన్నొక శాశ్వత కార్యక్రమం చేయాలన్న సర్కారు తలంపునకు స్థాని కంగా పౌర సహాకారం ఉంటే తప్ప ఏదీ సాకారం కాదు. ఒకటి, రెండేళ్లలో ప్రతి గ్రామంలో నర్సరీని నడిపే దిశగా అడుగులు పడాలన్నది సర్కారు ఆకాంక్ష. ప్రభుత్వంలోని వివిధ శాఖల్ని అనుసంధా నపరచడం, అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల్నీ బాధ్యుల్ని చేయడం, వివిధ రూపాల్లో ఉపాధిహామీ పథకపు నిధుల్నే ప్రధానంగా వినియోగించడం... ఇప్పటివరకు జరుగుతూ వచ్చింది. ఈ కార్యక్రమా నికి గడచిన మూడేళ్లలో 2473 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించింది. గొప్ప కార్యక్రమమే అయినా... మొక్కలు నాటడంపై ఉన్న శ్రద్ద వాటిని బతికించడంలో లేదనే విమర్శ ఉంది. ఎక్కడికక్కడ మొక్కల మనుగడ దక్కేది తక్కువే కావడం ఆందో ళన కలిగిస్తోంది. సగటు నలబై శాతం కూడా దక్క ట్లేదు. నాయకుల శ్రద్ద, అధికారుల నిబద్దత, స్థానిక సంస్థల పాత్ర, పౌర సంఘాల ప్రమేయం, ప్రజల భాగస్వామ్యం మొక్కల్ని అధికశాతం బతికించుకోవ డంలో కీలక పాత్ర వహిస్తాయి. సిద్దిపేట జిల్లాలో అత్యధిక శాతం మనుగడ నమోదవడం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అత్యల్ప శాతం మొక్కలే బత కడం ఇందుకు నిదర్శనం. వాటిని బతికించుకోవా ల్సిన బాధ్యత పౌరులు, ప్రజా సంఘాలపైనా ఉంది. ప్రచారంపై ఉన్న శ్రద్ద పనిపై ఏది? మొక్కలు నాటే, అడవులు పెంచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వాలు అదే స్థాయి శ్రద్ద పౌరుల్ని భాగస్వాముల్ని చేయడంపై చూపటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్వహి స్తున్న ‘వనం మనం’ ఇందుకు నిరద్శనం. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కార్తీక పౌర్ణమి వరకు ఈ కార్యక్రమం కింద కోట్లాది మొక్కలు నాట డాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. 2015–16లో 30 కోట్ల మొక్కలు నాటినట్టు సర్కారు లెక్క! నేలమీద అవి ఎక్కడున్నాయో జాడే లేదు! మొక్కకు సగటున రూ.15 ఖర్చయినట్టు రికార్డు రాశారు. ఇలా ఒక సంవత్సరం రూ.360 కోట్లు ఖర్చు చేసింది. గత సంవత్సరం 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం కాగా 18.46 కోట్లు నాటామని, ఈ యేడు మరో 25 కోట్ల మొక్కలు లక్ష్యమనీ అంటోంది. 25 కోట్ల మొక్కల్ని అందించేపాటి నర్సరీల వ్యవస్థే రాష్ట్రంలో లేదనేది విమర్శ. లెక్కలే తప్ప మొక్కలు లేవని, ఉన్న మొక్కలు కూడా మొక్కుబడి పనుల వల్ల సరిగా నాట కుండానే రోడ్ల పైన పారవేసి పోతున్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. అటవీ ప్రాంతం ఇప్పుడు 24 శాతం ఉందని చెప్పే ప్రభుత్వం, 2029 నాటికి 50 శాతం చేయాలని ‘మిషన్ హరితాం ధ్రప్రదేశ్’ చేప ట్టినట్టు విస్తృత ప్రచారం చేస్తోంది. పనిలో పనిగా కార్పొరేట్ రంగాన్ని, స్థానికసంస్థల్ని, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్ని. పౌర సంఘాల్ని కూడా భాగ స్వాముల్ని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ‘పారిస్ ఒప్పందం’లో పలు పర్యావరణ స్వీయ నిర్భందాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో అడుగులైతే నెమ్మదిగా వేస్తోంది. జనాన్ని చైతన్య పరిచే చర్యలే లేవు. ‘నష్టపరిహార అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, ప్రణాళిక ప్రాధికార సంస్థ’ (కంపా) కింద పెద్ద ఎత్తున నిధులున్నా వాటిని వినియోగించడం లేదని ఏటా ‘కాగ్’ తప్పుబడు తోంది. రూ.39000 కోట్లుండగా ఏటా రూ.6000 కోట్లు కొత్తగా జత అవుతున్నాయి. పౌర భాగస్వా మ్యంపై ప్రభుత్వాలేవీ పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి సుప్రీం రక్షణ ఒకరి బాధ్యత మరొకరికి హక్కు అయినట్టే, ఒకరి హక్కు ఇంకొకరి బాధ్యత అని దేశంలోని న్యాయ స్థానాలు పలుమార్లు తీర్పుల్లో స్పష్టం చేశాయి. పర్యావరణ పరిరక్షణ సవ్యంగా జరిగితేనే పౌరులం దరి జీవించే హక్కుకు భద్రత! ఇలా అందరి హక్కు రక్షణ క్రమంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత కూడా అవుతుంది. రాజ్యాంగం 21వ అధికరణంలోని జీవించే హక్కును సమగ్రంగా వివరిస్తూ, కాలుష్యరహిత జీవితం పౌరుల ప్రాథ మిక హక్కని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (ఎమ్.సీ మెహతా వర్సెస్ యూనియన్ ఆప్ ఇండియా) 1987లోనే స్పష్టత ఇచ్చింది. అధికరణం 19 (1)(జి) ప్రకారం ఏ వృత్తయినా, ఏ వాణిజ్య– వ్యాపారమైనా నిర్వహించుకోవడం పౌరుల ప్రాథ మిక హక్కే అయినప్పటికీ, దానికి కొన్ని పరిమితు లున్నాయి. సమాజం, ఇతర జనసమూహాల ఆరో గ్యాన్ని దెబ్బతీసే విధంగా పౌరులెవరూ తమ స్వేచ్ఛాయుత వాణిజ్య–వ్యాపారపు హక్కును విని యోగించుకోజాలరనీ సుప్రీంకోర్టు (కూవర్జీ బి.బరుచ్చా వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్, అజ్మీర్–1954 కేసులో) చెప్పింది. పౌర హక్కుల పరంగా... వాణిజ్య స్వేచ్ఛ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య వివాదం తలెత్తినపుడు న్యాయస్థానాలు సహజంగానే పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గాలని కూడా న్యాయ స్థానం స్పష్టం చేసింది. దానికి లోబడే ఏ వాణి జ్య–వ్యాపార కార్యకలాపాలైనా చేసుకోవచ్చంది. వేదాల నుంచి మన ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ప్రకృతితో మమైకమై సకల జీవ రాశితో మనిషి సహజీవనం సాగించడాన్నే నొక్కి చెప్పారు. అదే జరిగింది ఇంతకాలం. ‘మానవుని స్వర్గం భూమ్మీదే ఉంది. ఈ సజీవ భూగ్రహం అన్ని జీవులది. ఇది ప్రకృతి వరం. దీన్ని పరిరక్షించు కుంటూ ప్రేమాస్పద జీవనం సాగించాలి’ అని అధ ర్వణవేదంలో ఉంది. పర్యావరణ పరిరక్షణ అన్నది మన సంస్కృతి, సంప్రదాయాల్లో ఆచరణగానే కాకుండా రాజ్యాంగపరంగా కూడా తగు భద్రత ఏర్పా ట్లున్నాయి. అటవుల సంరక్షణ, నీటి నిర్వహణ, భూసార పరిరక్షణలో గ్రామస్థాయి నుంచి స్థానిక సంస్థలకు విశేషాధికారాలు కల్సిస్తూ మనం రాజ్యాం గాన్ని సవరించుకున్నాం. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పౌరులకు అందించడం, అందుకోసం ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడటం సంక్షేమ ప్రభుత్వాల బాధ్యత (అధికరణం 47, 48) అనేది తిరుగులేని భద్రత! అదే సమయంలో పౌరుల బాధ్యతను కూడా రాజ్యాంగం ఎప్పటికప్పుడు గుర్తుచేస్తోంది. అడ వులు, చెరువులు, నదులు, జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతిని కాపాడుతూ, పర్యావరణాన్ని అభివృద్ధి పరుస్తూ సకలజీవుల పట్ల దయ, అనుకంపతో ఉండ టం ప్రతి పౌరుని బాధ్యత (అధికరణం 51–ఎ (జి)) అని చెబుతోంది. ఇప్పుడా స్ఫూర్తి సర్వత్రా రగలాలి. ప్రతి పౌరుడూ తన స్థాయిలో స్పందించాలి. ప్రతి గ్రామమూ కదలాలి. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు నూరు శాతం విజయవంతమయ్యేలా తోడ్పడాలి. అది ‘కంపా’ అయినా, ‘హరితహారమై’నా, ‘వనం మనం’ అయినా... అక్కడ ఖర్యయ్యే ప్రతిపైసా ప్రజాధనం. అది వృధా కానీయకుండా ప్రయోజనం కలిగించేలా చూసే, చూడాల్సిన బాధ్యత మనది, మనందరిది! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ :dileepreddy@sakshi.com -
తీరు మారని అగ్రదేశాలు
ప్రగతి పేరుతో సంపన్న దేశాలు ఇంతకాలం నుంచీ సాగిస్తున్న కార్యకలాపాలు భూగోళానికి మృత్యుపాశాలుగా మారాయని నిర్ధారణైనా ఆ దేశాల వైఖరిలో ఇంకా మార్పు రాలేదు. జర్మనీలోని బాన్ నగరంలో రెండు వారాలపాటు జరిగి శుక్రవారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్(కాప్)–23 సదస్సు ఆశించిన రీతిలో విజయవంతం కాలేదు. రెండేళ్లనాడు పారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక వాతావరణ ఒడంబడిక అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను నిర్ధారించ డానికి... కాలుష్య నివారణ కోసం అప్పట్లో వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఆ ఒడంబడిక లక్ష్య సాధనకు ఏమేరకు తోడ్పడతాయో తేల్చడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఒడంబడిక అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనల రూపకల్పన కూడా ఇది చేయాల్సి ఉంది. అయితే వాటిపై అరకొర చర్చలే జరిగాయి. ఫలితంగా సదస్సు ఎలాంటి నిర్ణయాలూ తీసుకోలేకపోయింది. వచ్చే ఏడాది మే లో పోలాండ్లోని కటోవైస్‌లో జరిగే కాప్–24 సదస్సు నాటికి అభివృద్ధి చెందిన దేశాలు తాము ప్రారంభించిన చర్యలేమిటో సూచించే నివేదికను సమర్పించాలని బాన్ సదస్సులో నిర్ణయించడం... 2020లో జరగబోయే కాప్–26 సదస్సులో వ్యవసాయం, ఆహారభద్రత, సామాజికార్ధిక రంగాల్లో తీసుకున్న చర్య లేమిటో అన్ని దేశాలూ నివేదించాలని తీర్మానించడం ఉన్నంతలో ఊరటనిస్తాయి. మొత్తం 196 దేశాల మధ్య పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడు అది తమ ఘనతేనని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికల్లా ఆ స్థానంలో డోనాల్డ్ ట్రంప్ వచ్చి ఒడంబడికనుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అసలు పారిస్ ఒడంబడికపై సంతకాలు చేసిన దేశాలన్నీ ఆ ఒడంబడికను వారి వారి చట్టసభల్లో ప్రవేశపెట్టి ధ్రువీకరించవలసి ఉంది. మన దేశంతోసహా చాలా దేశాలు ఆ పనిచేశాయి. కానీ రష్యా వంటి అగ్ర రాజ్యం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మరోపక్క అమెరికా ఒడంబడిక నుంచి తప్పుకుంటానని బెదిరింపులు ప్రారంభించింది. తమ దేశానికి తీవ్రంగా అన్యాయం చేస్తున్న ఈ ఒడంబడికలో భాగస్వాములం కాదల్చుకోలేదని మొన్న జూన్‌లో ట్రంప్ ప్రకటించినా కాప్–23 సదస్సుకు ఆ దేశం నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ముందుకొస్తే ఇందులో కొనసాగుతామని వాతావరణ అంశాలపై వైట్‌హౌస్ ప్రత్యేక సలహాదారు జార్జి డేవిడ్ బాంక్స్ చేసిన ప్రతిపాదన కాప్–23 సదస్సుకు రుచించలేదు. పునఃచర్చల ప్రసక్తే లేదని సదస్సు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ట్రంప్ వైఖరితో విభేదించే అమెరికాలోని వివిధ రాష్ట్రాలు, నగరాలకు చెందిన నాయకులు ఈ సదస్సుకొచ్చారు. మొత్తానికి ఒడంబడిక అమలు కావాల్సిన 2020 ఎంతో దూరం లేదని తెలిసినా అగ్రరాజ్యాలు ఏవో సాకులు చెబుతూ కాలం గడుపు తున్నాయి. ఇందుకు పారిస్ ఒడంబడిక కుదిరినప్పుడే బీజాలు పడ్డాయి. వాతా వరణ పరిరక్షణకు ఏం చేయాలన్న అంశంపై మాత్రమే అప్పుడు అవగాహన కుదిరింది. దాని అమలుకు సంబంధించిన విధివిధానాలు మున్ముందు ఖరారు చేసుకోవాలని అప్పుడు నిర్ణయించారు. ఒడంబడికను ఉల్లంఘించేవారిపైనా, దాన్నుంచి మధ్యలో వైదొలగేవారిపైనా ఎలాంటి చర్యలుండాలో అప్పుడే నిర్ధారిం చుకుంటే ఇప్పుడీ పరిస్థితి ఏర్పడేది కాదు. తాము ఒడంబడిక అమలుకు అవస రమైన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడమే కాదు... అమలు చేస్తామని ముందుకొస్తున్న బడుగు దేశాలకు అందుకు అవసరమైన సాంకేతికతనూ, ఆర్ధిక సాయాన్ని అందించడంపై కూడా సంపన్న దేశాలు నికరంగా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో అసలు పారిస్ ఒడంబడిక అమలు పైనే అందరిలోనూ సందేహాలు ఏర్పడుతున్నాయి. ముందు నిర్ణయించినట్టు 2020లో ప్రారంభమవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వాతావరణ కాలుష్యం వల్ల ముప్పు అంతకంతకూ పెరుగుతోందని శాస్త్ర వేత్తలు చెబుతున్నా, అందుకు దాఖలాలు కళ్లముందు కనబడుతున్నా సంపన్న దేశాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని బాన్ సదస్సు తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది. ఈ ఏడాది మన దేశంలోనూ, నైజీరియాలోనూ వరదలు ముంచెత్తాయి. చెన్నై నగరం రెండేళ్ల వ్యవధిలో మూడుసార్లు వరదనీటిలో ముని గింది. మొన్న సెప్టెంబర్‌లో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన హార్వే, ఇర్మా పెనుతుఫాన్లు డొమినికన్ రిపబ్లిక్, ప్యూర్టోరికో వంటి కరీబియన్ దేశాలను బెంబే లెత్తించాయి. అమెరికాలోని ఫ్లారిడా, హూస్టన్, టెక్సాస్ తదితర నగరాలు కనీవినీ ఎరుగని వైపరీత్యాన్ని చవిచూశాయి. ఆ నగరాలకు అపార నష్టం సంభవించింది. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువ స్థాయికి పరిమిత మయ్యేలా చూడాలని, వీలైతే దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించనివ్వరాదని పారిస్ ఒడంబడిక పిలుపునిచ్చింది. కనీసం ఆ స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప ప్రకృతి వైపరీత్యాలను నిలువరించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. అయినా బాన్ సదస్సులో పెద్దగా కదలిక లేకపోవడం విచారకరం. మన దేశం 2030 సంవత్సరానికి 200 గిగావాట్ల మేర సౌరశక్తి, ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను సమీకరించాలని లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. 2030నాటికి బొగ్గు ఆధారిత విద్యుదుత్పాదన ప్రక్రియను పూర్తిగా నిలిపేయాలని బ్రిటన్, కెనడా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి 15 దేశాలు నిర్ణయించడం, వచ్చే ఏడాది జరగబోయే కాప్–24 సదస్సుకల్లా కనీసం 50 దేశాలను ఇందులో సమీ కరించాలని నిర్ణయించడం ఒక్కటే ఉన్నంతలో చెప్పుకోదగ్గ పరిణామం. అయితే బొగ్గును అధికంగా వినియోగిస్తున్న చైనా, అమెరికా, రష్యా, జర్మనీ ఈ గ్రూపులో పాలుపంచుకోలేదు. మొత్తానికి అరకొర నిర్ణయాలతో, పైపై మెరుగులతో పరిస్థితి చక్కబడదని... చిత్తశుద్ధితో వ్యవహరించి దృఢమైన నిర్ణయాలు తీసుంటేనే ఈ ధరి త్రిని రక్షించుకోగలమని సంపన్న దేశాలు గుర్తించాలి. పోలాండ్ సదస్సునాటికైనా వాటి తీరు మారాలి. -
పారిస్ ఒప్పందానికి కట్టుబడ్డాం
న్యూయార్క్ : పారిస్ ఒప్పందానికి తమ దేశం కట్టుబడి ఉందని.. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. గ్రీన్ హౌస్ ఉద్గారాల తగ్గింపు విషయంలో పరిమితులకు లోబడి.. పనిచేస్తామని ఆమె చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో జరిగిన పర్యావరణ పరిరక్షణ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవడంలోనూ, కర్బన ఉద్గారాల తగ్గింపులోనూ భారత్ అసమాన్యంగా కృషి చేస్తోందని చెప్పారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోందని ట్రంప్ చేసిన ప్రకటనతో అనిశ్చితి నెలకొందని.. ఇది భారత్, చైనా వంటి దేశాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరుగుతుండడంతో వాతావరణంలో విపరీత మార్పులు వస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు.. ఉష్ణోగ్రతలను 2 డిగ్రీలకు తగ్గించాలన్న లక్ష్యంతో పారిస్ ఒప్పందం కుదిరింది. -
పారిస్ ఒప్పందానికి కట్టుబడ్డాం
జీ20 సదస్సులో సభ్యదేశాల తీర్మానం హాంబర్గ్: గ్లోబల్ వార్మింగ్‌పై పోరుకు కట్టుబడి ఉన్నామని జీ20 సదస్సులో భారత్ సహా 18 సభ్య దేశాలు స్పష్టం చేశాయి. సదస్సు ముగింపు సందర్భంగా శనివారం అధికారిక ప్రకటనలో ‘పారిస్ వాతావరణ ఒప్పందం అమలులో ఎలాంటి మార్పు ఉండదని, అమెరికా మినహా అన్ని దేశాలు సంపూర్ణ మద్దతు తెలిపాయ’ని చెప్పాయి. పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్న అమెరికా ఈ సదస్సులో ఒంటరైంది. జీ20 ముగింపు సమావేశం తర్వాత జర్మనీ అధ్యక్షురాలు మెర్కెల్ మాట్లాడుతూ ‘పారిస్ ఒప్పందంపై అమెరికా తన వ్యతిరేకత కొనసాగించింది. ఇతర సభ్య దేశాలు ఒప్పందానికి గట్టి మద్దతు తెలిపాయ’ని పేర్కొన్నారు. ప్రకటనలో మరికొన్ని ముఖ్యాంశాలు ‘అవినీతిపై పోరుకు కట్టుబడి ఉన్నాం. అందుకోసం పరస్పర సహకారంతో పాటు సాంకేతిక సాయం అందించుకోవాలి. ఐఎంఎఫ్ సంస్కరణల్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, 2019లోగా కొత్త సంస్కరణల్ని రూపొందించాలి. సమాచార, ప్రసార రంగంలో టెక్నాలజీ దుర్వినియోగం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరం. మార్కెట్‌కు నష్టం కలిగించే సబ్సిడీలకు స్వస్తిచెప్పాలి. అలాగే పారిశ్రామిక రంగంలో అధికోత్పత్తి సమస్యను అధిగమించేందుకు అంతర్జాతీయంగా సహకరించుకోవాల’ని జీ20 దేశాలు పిలుపునిచ్చాయి. రక్షణ రంగంలో ఆయుధాల చట్టబద్ధ వ్యాపారానికి జీ20 సదస్సు అంగీకారం తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని, స్వేచ్ఛా వాణిజ్య విఫణికి కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. మార్కెట్లలో వివక్ష రూపుమాపాలని, దిగుమతులపై అనవసర పన్నుల్ని తగ్గించాలని, అక్రమ వ్యాపార పద్ధతులకు చెక్ చెప్పాలని జీ 20 దేశాలు నిర్ణయించాయి. కాగా పారిస్ వాతావరణ ఒప్పందంపై సభ్య దేశాలు ఒత్తిడి తేకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్త పడ్డారు. దేశాలకు వారి మార్కెట్లను కాపాడుకునే హక్కు ఉందని జీ20 అధికారిక ప్రకటన స్పష్టం చేయడంతో ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ విధానానికి మార్గం సుగమమైంది. అయితే కర్బన ఇంధనాల్ని పర్యావరణ హితంగా, సమర్థంగా వాడుకునే విషయంలో ఇతర దేశాలతో అమెరికా కలిసి పనిచేయాలని సభ్య దేశాలు అమెరికాకు సూచించాయి. ఉద్యోగుల వలసల్ని ప్రోత్సహించాలి: మోదీ జీ20 సదస్సులో డిజిటలైజేషన్, మహిళా సాధికారత, ఉపాధి అంశంపై మోదీ మాట్లాడుతూ.. ఉద్యోగుల వలసల్ని మరింత ప్రోత్సహించాలని, అందువల్ల ఇరు దేశాలు లాభపడతాయని పేర్కొన్నారు. డిజిటల్ ప్రపంచంతో ఉపాధి అవకాశాలు పెరిగినా.. ముప్పు ఉందని మోదీ చెప్పారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి సాంకేతికతను భారత్ సాధించిందని, మహిళా సాధికారత లేనిదే నిజమైన వృద్ధి సాధ్యం కాదని ప్రధాని పేర్కొన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే చెప్పారు. ట్రంప్ సీట్లో ఇవాంక! జర్మనీలో జరుగుతున్న జీ–20 సమావేశాల్లో కొద్దిసేపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్థానంలో ఆయన కూతురు ఇవాంక కూర్చున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రిటన్ ప్రధాని థెరెసా తదితరుల సరసన ఇవాంక ఆసీనులయ్యారని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తన కుటుంబంలోని వారికి, సన్నిహితులకే కీలక పదవులు కట్టబెడుతున్నారన్న ఆరోపణ ఉండటం తెలిసిందే. -
పారిస్ ఒప్పందాన్ని గౌరవిస్తాం
అమెరికన్ టెక్ దిగ్గజాల ప్రకటన హూస్టన్: పారిస్ ఒప్పందాన్ని గౌరవిస్తామని ఫేస్బుక్, గూగుల్ తదితర అమెరికన్ అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు కుదుర్చుకున్న చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపిల్, గూగుల్, ఫేస్బుక్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తదితర ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కర్బన ఉద్గారాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రకటించాయి. అయితే ఇందులో ఒరాకిల్, ఐబీఎం, ప్రధాన టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు లేరు. ‘నాయకత్వం మద్దతివ్వకున్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపే రాష్ట్రాలు, నగరాలు, కళాశాలలు, వర్సిటీలు, వ్యాపార సంస్థలు వాతావరణ ఒప్పంద లక్ష్యాలను కొనసాగిస్తాయి. ఉద్గారాల నియంత్ర ణకు కృషిచేసే దేశంగా అమెరికాను అగ్రస్థానం లో నిలబెట్టేందుకు పనిచేస్తాం’ అని వెయ్యికి పైగా సంస్థలు కలిగిన ఓ యూనియన్ తెలిపింది. -
భారత్ జవాబుదారీ కాదు
పారిస్ ఒప్పందంపై వైట్‌హౌస్ ప్రకటన వాషింగ్టన్: పారిస్ వాతావరణ ఒప్పందంలో కర్బన ఉద్గారాలపై భారత్, చైనా వంటి దేశాలను జవాబుదారీ చేయడం లేదని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ పేర్కొంది. ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించింది. 2030 వరకూ చైనా కర్బన ఉద్గారాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోదని, భారత్‌కు 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయం అందేవరకూ ఎటువంటి బాధ్యతలు లేవని వైట్‌హౌస్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(ఈపీఏ) స్కాట్ ప్రుయిట్ చెప్పారు. ఏడాదిన్నర క్రితం పారిస్ ఒప్పందాన్ని 150కిపైగా దేశాలు ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం నుంచి తప్పు కోవాలని ట్రంప్ సాహ సోపేతమైన నిర్ణయం తీసుకున్నారని స్కాట్ కొనియాడారు. అమెరికాలో గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదలను 26 నుంచి 28 శాతం వరకూ తగ్గించగలిగామని, క్లీన్ పవర్ ప్లాన్, వాతావరణ యాక్షన్ ఎజెండా ద్వారా ఇది సాధిం చగలిగామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకు న్నారని, వాతావరణ ఒప్పందాలను, అంతర్జాతీయ చర్చలను తమ దేశం గౌరవిస్తుందని అన్నారు. కాగా, భారత్, చైనాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని అమెరికాకు చెందిన ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ అనే వెబ్ బేస్డ్ మీడియా స్పష్టం చేసింది. పారిస్ ఒప్పందం వందలాది బొగ్గు ఆధారిత ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైనాను అనుమతిస్తోందని, 2020 నాటికి భారత్‌లో బొగ్గు ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు సహకరిస్తోందని, కానీ అమెరికాలో ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిం చడం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే.. అమెరికా ఎంతో ముందుందని, అయినా చైనా, భారత్ పర్యావరణానికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు అంగీకరించాయని, ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం అమెరికాలో బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఆర్థికంగా భారంగా మారాయని, దీనికి ఇతర మార్గాల్లో తక్కువ ధరకే విద్యుత్ లభించడమే కారణమని ఫ్యాక్ట్‌చెక్.ఆర్గ్ మేనేజింగ్ ఎడిటర్ లోరి రాబిన్సన్ స్పష్టం చేశారు. -
పారిస్ నిర్ణయాలు వెంటనే అమలు చేయాలి
యునైటెడ్ నేషన్స్ : గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి పారిస్ అగ్రిమెంటులో తీసుకున్న చర్యలను వెంటనే అమలుచేసే ఒప్పందంపై 175 దేశాలు సంతకాలు చేశాయి. శుక్రవారం యునైటెడ్ నేషన్స్ లో జరిగిన ఈ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ' భూతాపం రోజురోజుకి పెరుగుతోంది. మంచు కరిగిపోతోంది. వాతావరణంలో కర్బన్ లెవల్స్ అధికమవుతున్నాయి. ప్రస్తుతం మనం సమయానికి వ్యతిరేకంగా వీటిని తగ్గించడానికి పోరాడుతున్నాం' అని యునైటెడ్ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ అన్నారు. ఈ రోజు మనది తర్వాత తరం పిల్లలది, ముని మనవళ్లది కావాలంటే పారిస్ లో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఈ ఒప్పందంతో గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను స్థాయిని 55 శాతం వరకూ తగ్గించే బాధ్యత కనీసం 55 దేశాలపై ఉండనుంది. చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్న దాదాపు 15 దేశాలు ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. ఈ ఉద్గారాల విడుదలలో అమెరికా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయి. శుక్రవారం చేసుకున్న ఈ ఒప్పందంతో, గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించేందుకు యూఎస్, చైనాలు తమకు తాముగా ఆమోద ప్రక్రియపై సంతకం చేశాయి. శుక్రవారం కుదుర్చుకున్న ఒప్పందంతో పారిస్ అగ్రిమెంట్ ను చేరుకోవడానికి దేశాలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. 2017 ఏప్రిల్ 21 వరకూ ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. -
మావల్లే సాధ్యమైంది: ఒబామా
వాషింగ్టన్: చారిత్రక పారిస్ ఒప్పందం పరిధిలోకి ప్రపంచంలోనే పెద్దవైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా, చైనా దేశాలను తీసుకురావడం ఈ ఏడాదిలో తన అతిపెద్ద విజయమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. గతవారం పారిస్‌లో దాదాపు 200 దేశాలు దీనిపై సంతకం చేయడం కేవలం అమెరికా నాయకత్వంలోనే సాధ్యపడిందని శుక్రవారం వైట్ హోస్లో తెలిపారు. -
వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ
-
వాతావరణ న్యాయం గెలిచింది: మోదీ
పారిస్/న్యూఢిల్లీ: భూతాపోన్నతిని రెండు డిగ్రీల కంటే తక్కువ స్థాయికి పరిమితం చేయాలని పారిస్ వాతావరణ సదస్సులో నిర్ణయం తీసుకోవడాన్ని ప్రపంచ దేశాల నాయకులు స్వాగతించారు. వాతావరణ న్యాయం సాధించిన విజయంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్ణించారు. పర్యావరణవేత్తలు నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భూమిని కాపాడుకోవడానికి పారిస్ ఒప్పందం మంచి అవకాశం, ప్రపంచానికి ఇది టర్నింగ్ పాయింట్ అని వైట్ హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. 'పారిస్ ఒప్పందంలో గెలిచినవారు, ఓడినవారు లేరు. వాతావరణ న్యాయం గెలిచింది. పచ్చని భవిష్యత్ కోసం మనమంతా కలిసి పనిచేయాలి. భూతాపోన్నతిని 2 డిగ్రీల కంటే తక్కువకు పరిమితం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు 2020 నుంచి వర్ధమాన దేశాలకు 100 బిలియన్ డాలర్లు సహాయం చేయాలి' అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్, బ్రిటన్ ప్రధానులు కూడా పారిస్ ఒప్పందాన్ని కొనియాడారు. అయితే ఈ ఒప్పందం బలహీనంగా, సాదాసీదాగా ఉందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) పేర్కొంది. Outcome of #ParisAgreement has no winners or losers. Climate justice has won & we are all working towards a greener future. @COP21 @COP21en — Narendra Modi (@narendramodi) December 13, 2015