
గ్లాస్గో: గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని కాప్– 26 అధ్యక్షుడు, బ్రిటన్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అలోక్‌శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు)కి నేతృత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది.
దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలోక్ శర్మ భూతాపోన్నతిని తగ్గించడానికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉష్ణోగ్రతల్ని తగ్గించే మార్గాన్ని చూడాలన్నారు. ‘‘ఆరేళ్ల క్రితం పారిస్ సమావేశలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడాలని అనుకున్నాం. 1.5 డిగ్రీలకి పరిమితం చేయడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలి’’ అని అలోక్ అన్నారు. నవంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.