చరిత్రాత్మక ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు 2016లో ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రెండో సారి గెలిచి ఉంటే, పర్యావరణానికి సంబంధించి యావత్ మానవాళికి ముప్పు వాటిల్లేదని ప్రజాభి ప్రాయం. అభివృద్ధి, నాగరికత, పారిశ్రామికీకరణల పేరుతో పర్యా వరణానికి చేజేతులా ముప్పు తెచ్చిన ప్రపంచ దేశాలు ఆలస్యంగా మేలుకొని చేసిన తప్పులు దిద్దుకోవడానికి గత 3 దశాబ్దాలుగా పాట్లు పడుతున్నాయి.
భారీ డ్యాముల నిర్మాణం, ఖనిజాల త్రవ్వకం, అడవుల నరికివేత, అణు రియాక్టర్ల నిర్మాణం, బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం, డీజిల్ పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల్ని అడ్డూఅదుపూ లేకుండా మండించడంతో జీవవైవిధ్యం దెబ్బతింది. మాన వుని మనుగడకే ప్రమాదం వాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో 190 దేశాలు సమావేశమై ‘వాతావరణ విధాన పత్రం’ను రూపొందిం చాయి. ఈ ఒప్పందంలో భూతల వేడిమిని వచ్చే 100 ఏళ్లలో ఇప్పుడున్న ఉష్ణోగ్రత స్థాయికి 2 డిగ్రీల సెల్సియస్ కంటే మించకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టాలని తీర్మా నించాయి. పారిస్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరై భారత్ తరఫున ఒప్పందం మీద సంతకం చేశారు. 2016 నవంబర్ నుంచి పారిస్ ఒప్పందం అమలులోకి వచ్చింది.
ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి విస్మ యానికి గురిచేశాడు. వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా వాటా 15 శాతం. ఇంత పెద్ద మొత్తంలో నియంత్రించే చర్యలు చేపట్టాలంటే పారి శ్రామిక ఉత్పత్తులను తగ్గించాల్సి వస్తుందనీ, దానివల్ల అమెరికాలో నిరుద్యోగం పెరగడమే కాకుండా ఆర్థికాభి వృద్ధి దెబ్బతింటుందనీ ట్రంప్ వాదించాడు. పైగా చైనా, భారత్ పారిశ్రామికీకరణను వేగవంతం చేస్తూ తమ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసుకొంటున్నాయి కనుక, తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటామని అన్నాడు. 2017 జూన్‌లో అధికారికంగా పారిస్ వాతావరణ ఒప్పందానికి చెల్లుచీటీ రాశాడు. ఒప్పందం నుండి బయటకు రావా లంటే మూడు సంవత్సరాల వ్యవధి పడుతుంది. ఈ నిబం ధన వల్ల నవంబర్ 4, 2020న అమెరికా ఒప్పందం నుండి బయటకొచ్చినట్లయింది. యాదృచ్ఛికంగా నవంబర్ 4నే ట్రంప్ అధ్యక్ష ఎన్నికలలో ఓడిపోవటం విశేషం.
అమెరికాలో మొదట్నుంచీ డెమొక్రాట్లు పారిస్ ఒప్పం దాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నిక యిన వెంటనే తొలి నిర్ణయం పారిస్ వాతావరణ ఒప్పం దంలోకి పునఃప్రవేశించే దానిపైనే ఉంటుందని జోబైడెన్ ప్రకటించాడు. గత 4 ఏళ్లలో ‘గ్లోబల్ వార్మింగ్’ అమెరికాను అతలాకుతలం చేసింది. అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభ వించాయి. దీంతో, క్షీణిస్తున్న దేశ వాతావరణాన్ని రక్షిం చుకోవాలన్న ఆకాంక్ష సగటు అమెరికన్లలో పెరిగింది.
చైనా, భారత్ పర్యావరణ హితాన్ని విస్మరిస్తున్నా యంటూ ట్రంప్ చేసిన విమర్శల్లో కొంత నిజం లేక పోలేదు. కర్బన పదార్థాల వినియోగంలో ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్‌ది 4వ స్థానం. రష్యా 5వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదస్థాయికి చేరి చాలా కాలమైంది. ముంబై, కోల్‌కతా, చెన్నైలాంటి మెట్రో నగరాలలో ఆక్సి జన్ స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2008లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ వాతావరణ మార్పు’పై విధా నాన్ని ప్రకటించింది.
కాలుష్యరహిత బొగ్గుతో నడిచే విద్యుత్ కేంద్రాల నిర్మాణాలను చేపట్టింది. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని క్రమేపీ తగ్గించి బ్యాట రీలతో నడిచే వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది. మోదీ ప్రధానమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టాక ‘సౌర శక్తి’ వినియోగంలో చొరవ చూపారు. ‘అంతర్జాతీయ సౌరశక్తి కూటమి’ ఏర్పాటు చేశారు. దేశంలో వ్యవసాయ పంపుసెట్లకు బదులుగా సౌరశక్తితో నడిచే పంపుసెట్లను దశలవారీగా సమకూర్చే ప్రక్రియ వేగవంతంగా అమలు అవుతోంది.
దేశంలో రుతుపవనాల ఆగమనం, క్రమం తారు మారు అవుతున్నాయి. వర్షాకాలం 4 నెలలపాటు కొనసాగి నిర్ణీత వ్యవధిలో వర్షాలు పడటం ఆనవాయితీ. కొన్ని సంవత్సరాలుగా ఏకధాటిగా రెండు, మూడు రోజులపాటు కురియడం, ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడం వంటి వాతావరణ మార్పులతో వ్యవసాయరంగం ఆటుపోట్లకు గురవుతోంది. వరి వెన్ను పుష్పించే సమయంలో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది.
‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే వరి, గోధుమ దిగుబడుల్లో రమారమి 30 శాతం క్షీణత నమోదవుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదల ప్రభావం అన్ని పంటల్లోకెల్లా వరి, గోధుమ, మొక్కజొన్నలపై ఎక్కువ ప్రతికూలత చూపుతుంది. అత్యధిక దేశాలలో ప్రజలు ఈ మూడు పంటల్నే ప్రధానాహారంగా తీసుకుంటారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మొక్కజొన్న పంటను కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నను ఆహారంగా తీసుకొనే ఆఫ్రికా ఖండంలోని జాంబియా, కాంగో, జింబాబ్వే, మొజాంబిక్, మడగాస్కర్ తదితర దేశాలలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి.
ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసే బాధ్యతను స్వీకరిస్తున్న ప్రభుత్వాలు పర్యావరణ ‘న్యాయం’ కూడా చేయాలి. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహ్లాదకరమైన పరిసరా లను అందుబాటులోకి తేవడమే ‘పర్యావరణ న్యాయం’. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాలి. ఆ పేరుతో ప్రకృతిని విధ్వంసం చేస్తే అసలుకే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ కీలకం కానున్నది. వాతావరణ ఆంక్షల్ని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలపై రుద్ది, సంపన్న అగ్ర దేశాలు తప్పించుకోవాలని చూస్తే అంతకంటే ఆత్మహత్యా సదృశం మరొకటి ఉండదు. భూగోళాన్ని కాపాడేందుకు ఎవరివంతు పాత్ర వారు పోషించాలి. ఆ దిశగా భారత్ అడుగులు ముందుకు వేస్తోంది. అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలోకి ప్రవేశించడం ఆహ్వానించదగినది.
వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Comments
Please login to add a commentAdd a comment