అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీకి దిగుతున్న వైఎస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌తో టీవీ చర్చలో పాల్గొనేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలిపారు. సెప్టెంబర్ 4న హారిస్‌తో కలిసి ఫాక్స్ న్యూస్ డిబెట్‌లో పాల్గొననున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు.
కాగా కమలా హారిస్,ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. అయితే గత జూన్‌లో ట్రంప్, జోబైడెన్ అధ్యక్ష చర్చలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చర్చలో బైడెన్ సరిగా మాట్లాడలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ మాటలకు సమాధానలు చెప్పడంలో విఫలమైనట్లు, తడబడినట్లు విశ్లేషకులు భావించారు. దీంతో ఆయన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమొక్రాట్ల నుంచి ఒత్తిడి వచ్చింది. అనుకున్నట్లుగానే చివరికి బైడెన్ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. శుక్రవారం డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్ల ఆన్‌లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ఇదిలా ఉండగా నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment