న్యూఢిల్లీ/రియాద్: ప్రపంచాన్ని భయపెడుతున్న వాతావరణ మార్పులపై అరకొర పోరాటం సరిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సంపూర్ణ, సమగ్ర పోరాటంతోనే వాతావరణ మార్పులను ఎదిరించవచ్చని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం జీ20 సదస్సులో సేఫ్‌గార్డింగ్ ద ప్లానెట్: ద సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అప్రోచ్ అనే అంశంపై మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వడం ద్వారా ప్రపంచం మరింత వేగంగా ప్రగతి సాధిస్తుందని తెలిపారు.
పారిస్ ఒప్పందంలోని లక్ష్యాల కంటే ఎక్కువే భారత్ సాధించిందని పేర్కొన్నారు. పర్యావరణంతో కలిసి జీవించాలన్న భారతీయ సంప్రదాయం స్ఫూర్తితో తక్కువ కార్బన్ ఉద్గారాల, వాతావరణ పరిరక్షణ అభివృద్ధి విధానాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. వ్యక్తి శ్రేయస్సుతోనే మొత్తం మానవాళి శ్రేయస్సు సాధ్యమని వెల్లడించారు. శ్రామికులను కేవలం ఉత్పత్తి సాధనాలుగా మాత్రమే చూడొద్దన్నారు. ప్రతి శ్రామికుడికి తగిన గౌరవం దక్కేలా చూడాలని ఉద్బోధించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మనుషుల ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. కానీ, అదే సమయంలో వాతావరణ మార్పులను ఎదుర్కోవడంపై సైతం దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై భారత్ సంతకం చేసిందన్నారు. ఒప్పందంలోని లక్ష్యాలను భారత్ సాధించిందన్నారు. భారత్‌లో ఎల్‌ఈడీ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
దీనివల్ల 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామన్నారు. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ కృషితో భారత్‌లో పులులు, సింహాల జనాభా పెరుగుతోందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2023లో జరగనున్న జీ20 భేటీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
యూపీలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని విద్యాంచల్ ప్రాంతం వనరులున్నప్పటికీ వెనుక బాటుకు గురైందని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాల లేమి కారణంగా ఈ ప్రాంతం నుంచి ప్రజలు వలసవెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ న్నారు. ఆదివారం ఆయన వింధ్యాచల్ ప్రాంతంలోని మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment