యునైటెడ్ నేషన్స్ : గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించడానికి పారిస్ అగ్రిమెంటులో తీసుకున్న చర్యలను వెంటనే అమలుచేసే ఒప్పందంపై 175 దేశాలు సంతకాలు చేశాయి. శుక్రవారం యునైటెడ్ నేషన్స్ లో జరిగిన ఈ సమావేశానికి వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ' భూతాపం రోజురోజుకి పెరుగుతోంది. మంచు కరిగిపోతోంది. వాతావరణంలో కర్బన్ లెవల్స్ అధికమవుతున్నాయి. ప్రస్తుతం మనం సమయానికి వ్యతిరేకంగా వీటిని తగ్గించడానికి పోరాడుతున్నాం' అని యునైటెడ్ జనరల్ సెక్రటరీ బాన్ కీ మూన్ అన్నారు. ఈ రోజు మనది తర్వాత తరం పిల్లలది, ముని మనవళ్లది కావాలంటే పారిస్ లో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
ఈ ఒప్పందంతో గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను స్థాయిని 55 శాతం వరకూ తగ్గించే బాధ్యత కనీసం 55 దేశాలపై ఉండనుంది. చిన్న చిన్న ద్వీపాలుగా ఉన్న దాదాపు 15 దేశాలు ఇప్పటికే గ్రీన్ హౌస్ గ్యాస్ ల నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గిస్తున్నాయి. ఈ ఉద్గారాల విడుదలలో అమెరికా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయి. శుక్రవారం చేసుకున్న ఈ ఒప్పందంతో, గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించేందుకు యూఎస్, చైనాలు తమకు తాముగా ఆమోద ప్రక్రియపై సంతకం చేశాయి. శుక్రవారం కుదుర్చుకున్న ఒప్పందంతో పారిస్ అగ్రిమెంట్ ను చేరుకోవడానికి దేశాలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. 2017 ఏప్రిల్ 21 వరకూ ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది.