ఐక్యరాజ్యసమితి: వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావాలను అరికట్టేందుకు ఇప్పటివరకు చాలా మాటలు చెప్పామని, ఇక మాటలు కట్టిపెట్టి, చేతలు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని భారత ప్రధాని మోదీ ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి వేదికగా సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ నేతృత్వంలో వాతావరణ మార్పుపై సోమవారం జరిగిన శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు.
పారిస్ ఒప్పంద అమలుపై కార్యాచరణను వేగవంతం చేసే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. వివిధ దేశాలు వాతావరణ మార్పు ప్రమాదాన్ని అరికట్టే దిశగా కృషి చేస్తున్నాయిగానీ ఇప్పుడు ఒక సమగ్ర కార్యాచరణ, అంతర్జాతీయ స్థాయి ఉద్యమం అవసరమని తన ప్రసంగంలో మోదీ పేర్కొన్నారు. ‘మనల్ని ముందుకు నడిపించాల్సింది అవసరమే కానీ అత్యాశ కాదు’ అని ప్రపంచదేశాలకు హితవు పలికారు. ఇందుకు విద్య నుంచి విలువల వరకు వ్యక్తిగత స్థాయిలో మార్పునకు అంతా శ్రీకారం చుట్టాలన్నారు.
ఈ సదస్సులో భారత్ తరఫున ప్రధాని మోదీ ఒక కీలక ప్రకటన చేశారు. భారతదేశ శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని 2022 నాటికి భారీగా 450 గిగావాట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. నెల క్రితమే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పారిస్ ఒప్పందంలో భాగంగా.. ఆ లక్ష్యాన్ని 150 గిగావాట్లుగా ప్రధాని పేర్కొన్న విషయం విదితమే. ‘ప్రకృతిని గౌరవించడం, వనరులను జాగ్రత్తగా వాడుకోవడం, మన అవసరాలను కుదించుకోవడం..మొదలైన చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆచరణ సాధ్యమైన ఒక ప్రణాళిక అవసరాన్ని నొక్కి చెప్పేందుకే భారత్ ఈ సదస్సులో పాల్గొంటోందని స్పష్టం చేశారు. భారత్‌లో బయో ఫ్యూయల్‌ను పెట్రోల్, డీజిల్‌లలో కలిపే కార్యక్రమం ప్రారంభించామన్నారు. నీటి సంరక్షణ, వర్షం నీటిని సంరక్షించుకోవడం లక్ష్యంగా ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్’ పథకంపై రానున్న కొన్ని ఏళ్లలో 50 బిలియన్ డాలర్లు(రూ. 3.5 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నామన్నారు.
నిర్ణయాత్మక సమయం: ఐరాస
వాతావరణ మార్పును ప్రతికూలతపై యుద్ధం ప్రకటించేందుకు నిర్ణయాత్మక సమయం ఆసన్నమైందని ఐరాస పేర్కొంది. ఐరాస సోమవారం నిర్వహించిన ‘క్లైమేట్ ఎమర్జెన్సీ సమిట్’లో దాదాపు 60 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా గ్రీన్ హౌజ్ వాయువులు వాతావరణంలోకి విడుదల అవుతున్న నేపథ్యంలో.. బలహీనపడుతున్న పారిస్ ఒప్పంద అమలు లక్ష్యాలను పునరుజ్జీవింపజేసేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ‘వాతావరణ అత్యవసర స్థితి అనే పరుగుపందంలో మనం వెనకబడి పోతున్నాం. కానీ అది మనం గెలిచి తీరాల్సిన పరుగుపందెం’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ అన్నారు.
ట్రంప్ కూడా వచ్చారు
పారిస్ ఒప్పందం విషయంలో భారత్ అమెరికాల మధ్య విభేదా లున్నాయి. అమెరికాకు నష్టదాయకమంటూ 2017లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. మోదీ ప్రసంగిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడే ఉన్నారు. అనూహ్యంగా, ముందే చెప్పకుండా ఈ సదస్సుకు ట్రంప్ హాజరుకావడం విశేషం. మోదీ, జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ ప్రసంగాల అనంతరం ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి ట్రంప్ వెళ్లిపోయారు.
సెనెటర్ భార్యకు మోదీ సారీ!
హ్యూస్టన్: అమెరికా సెనెటర్ జాన్ కార్నిన్ భార్య సాండీకి మోదీ క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్‌డే విషెస్ చెప్పారు. ‘మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు. సారీ’ అని ఆమెతో చెప్పారు.
అప్పుడు మోదీని చూడాలి
హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీకి స్వాగతం పలుకుతూ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరును ప్రస్తావించిన డెమొక్రాట్ పార్టీ నేత స్టెనీ హోయర్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘మహాత్మాగాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ మానవహక్కులకు, బహుళత్వానికి పట్టం కట్టే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకుంది’ అని మోదీని స్వాగతిస్తూ స్టెనీ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు స్పందించారు. నెహ్రూ సేవలను మోదీకి అమెరికా నేతలు గుర్తు చేయడం బావుంది అని మరోనేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ‘అద్వానీ సైతం నెహ్రూను ప్రశంసిస్తూ గతంలో ప్రసంగించారు. ఆ రోజులేమయ్యాయి?’ అంటూ జైరాం ట్వీట్ చేశారు. ‘నెహ్రూ పేరును స్టెనీ ప్రస్తావించినపుడు మోదీ ముఖ కవళికలు చూడాల్సిందే’ అని సింఘ్వీ వ్యాఖ్యానించారు.
మాటల్లేవ్... చేతలే..
Published Tue, Sep 24 2019 1:26 AM | Last Updated on Tue, Sep 24 2019 9:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment