అమెరికన్ టెక్ దిగ్గజాల ప్రకటన
హూస్టన్: పారిస్ ఒప్పందాన్ని గౌరవిస్తామని ఫేస్‌బుక్, గూగుల్ తదితర అమెరికన్ అగ్రశ్రేణి టెక్ దిగ్గజాలు వెల్లడించాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు కుదుర్చుకున్న చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తదితర ప్రముఖ టెక్నాలజీ సంస్థలు కర్బన ఉద్గారాల నియంత్రణకు కృషి చేస్తామని ప్రకటించాయి.
అయితే ఇందులో ఒరాకిల్, ఐబీఎం, ప్రధాన టెలికమ్యూనికేషన్స్ ప్రొవైడర్లు లేరు. ‘నాయకత్వం మద్దతివ్వకున్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపే రాష్ట్రాలు, నగరాలు, కళాశాలలు, వర్సిటీలు, వ్యాపార సంస్థలు వాతావరణ ఒప్పంద లక్ష్యాలను కొనసాగిస్తాయి. ఉద్గారాల నియంత్ర ణకు కృషిచేసే దేశంగా అమెరికాను అగ్రస్థానం లో నిలబెట్టేందుకు పనిచేస్తాం’ అని వెయ్యికి పైగా సంస్థలు కలిగిన ఓ యూనియన్ తెలిపింది.