ఉన్నట్టుండి ఓరోజు.. కొళాయిల్లో నీళ్లు రావని ప్రభుత్వం ప్రకటిస్తే..! ఇంకేముంది.. నానా గందరగోళం తప్పదు.. అటకెక్కినబిందెలు కిందకు దిగేస్తాయి.. రేపటికోసం ఈరోజే ఖాళీ బిందెలతో పే...ద్ద క్యూలు ఏర్పాటవుతాయి. అచ్చం ఇలాంటి పరిస్థితినే చివరిక్షణంలో అధిగమించింది కేప్‌టౌన్. సకాలంలో వానలు పడటంతో గండం గట్టెక్కినా.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా.. ఎవరికైనా రావచ్చు అనేందుకు సూచిక ఇది.
మరి తరుణోపాయం..?
భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించలేం. కానీ వాస్తవ పరిస్థితుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. అందుకనుగుణంగా మనం మసలుకోవాలి. నానాటికీ పెరుగుతోన్న జనాభా, పట్టణీకరణ, కుప్పలు తెప్పలుగా కాంక్రీటు భవనాల నిర్మాణం, నీటిచుక్క ఇంకే జాడేలేకపోవడం. అంతా పెద్ద పెద్ద కాంక్రీటు రోడ్లూ, ఫ్లైఓవర్ల పిల్లర్లు.. మినహా మట్టికింత జాగాలేకపోవడం.. పట్టణాలనూ, నగరాలనూ పట్టిపీడిస్తోన్న నీటిఎద్దడికి ఇలాంటివే ఎన్నెన్నో కారణాలు. పెరుగుతోన్న జనాభాకి అనుగుణంగా నీటి వనరులను ఒడిసిపట్టుకోలేకపోవడం, నీటి సమస్యను అధిగమించడమెలాఅన్నదే ఇప్పుడు సమస్య. మానవ నాగరికతలన్నీ నీటి చుట్టూతానే అల్లుకుని ఉంటాయి. నీటి ప్రవాహం పొడవునా పరుచుకున్నదే ఏ సంస్కృతైనా.. తరతరాల నాగరికత ఒకే ఒక్క తుపానుకు తుడిచి పెట్టుకుపోయినట్టు చరిత్ర లో చదివాం. కానీ నేడు నీటి చుట్టూ అలము కున్న కరువు ప్రపంచ చరిత్రను ప్రమాదంలో పడేసే రోజొచ్చింది. ఇక జరగబోయేవన్నీ నీటి యుద్ధాలేనన్న విషయం నిజమయ్యే రోజు ఎం తో దూరంలో లేదని అర్థమవుతోంది. దక్షిణా ఫ్రికాలోని ‘డేజీరో’ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
వానలకు భరోసా లేదని గుర్తించాలి..
వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భవిష్యత్తులో వానలకు భరోసా ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. కేప్‌టౌన్ విషయాన్నే తీసుకుంటే ఈ నగరం తాగునీటి అవసరాల కోసం రిజర్వాయర్లపైనే ఆధారపడి ఉంది. మూడేళ్లపాటు వరుణుడు ముఖం చాటేయడంతో ఇవి నోళ్లు తెరిచాయి. భవిష్యత్తులో ఇలాంటి కరువు కాటకాలు మరింత తరచుగా వస్తాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు తాగునీటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసింది ఇదే. పెర్త్ నగరంలో తాగునీటి ఎద్దడి ఏర్పడిన విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రభు త్వం ఆ తర్వాత తన విధానాలను సవరించుకుంది. సముద్రపు నీటి నుంచి మంచి నీటిని తయారుచేసే నిర్లవణీకరణ ప్రక్రియకు ప్రోత్సాహం కల్పించింది. ఇప్పుడు ఆ నగరంలో సగం నీరు నిర్లవణీకరణ ద్వారా అం దుతూంటే.. ఇంకో 40 శాతం అవసరాలను భూగర్భ జలా ల ద్వారా తీర్చుకుంటున్నా రు. రోజువారీ వ్యవహారాల్లో వాడే నీటిని మళ్లీమళ్లీ వాడుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం వంటి చర్యల ద్వారా ‘డేజీరో’ ను అధిగమించవచ్చన్నది నిపుణు ల అభిప్రాయం. ప్రతి వానచుక్కను ఒడిసి పట్టుకోవడం, సురక్షితంగా నిల్వ చేసుకుని వాడటంపై కూడా ప్రజల్లో చైతన్యం పెరగాల్సిన అవసరముంది.
స్థానిక ప్రభుత్వాలే కీలకం..
నీటి ఎద్దడి పరిష్కారం విషయంలో స్థానిక మున్సిపాలిటీలు, జిల్లా యంత్రాంగాలే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల నిరూపితమైన అంశమిది. అవసరాలకు తగ్గట్టుగా సత్వర నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమన్నది గుర్తించాలి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఏ కార్యక్రమమైనా విజయవంతమ య్యే అవకాశాలు ఎక్కువ. తాగునీటి నిర్వహణ, ఎద్దడి నివారణ కూడా ఇందుకు భిన్నమేమీ కాదు.
ప్రయోజనాలెన్నో..
తాగునీటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఎంత పారదర్శకంగా ఉంటే అంత మేలు జరుగుతుందని గత అనుభవాలు సూచిస్తున్నాయి. నీటి వినియోగం, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలన్నింటిపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందివ్వడం ద్వారా ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలనూ వారికి వివరించడం ప్రయోజనకారి. సమాచారాన్ని తొక్కిపట్టి.. అంతా బాగుందన్న భ్రమ కల్పిస్తే నీటిని పొదుపుచేయడం అస్సలు సాధ్యం కాదు. కేప్‌టౌన్‌లో ‘డే–జీరో’పరిస్థితిని అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అవేర్‌నెస్ వెబ్‌సైట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
దూరదృష్టి అవసరం..
మబ్బుల్లో నీళ్లు చూసి ముంతవలకబోసుకున్నట్లు.. అనే సామెత తెలుగువారికి సుపరిచితమే. అయితే తాగునీటి సమస్యలు నివారించుకోవాలంటే ఈ రకమైన ఆలోచన అస్సలు పనికి రాదు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో తాగునీటి అవసరాలపై కచ్చితమైన మదింపు.. అందుకు తగ్గట్టుగా సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం అవసరం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని.. అందుబాటులో ఉన్న వనరులను ఏ ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేయాలన్నదీ ముందుగానే నిర్ణయమై ఉండాలని ఈ రంగంలో కృషిచేస్తున్న నిపుణులు సూచిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో మనం వాడే ప్రతినీటి బొట్టునూ లెక్కపెట్టేందుకు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment