‘కాప్‌’లో లాబీలు – ఆశలపై చన్నీళ్లు! | R Dilip Reddy Article On Cop26 Climate Change Conference | Sakshi
Sakshi News home page

‘కాప్‌’లో లాబీలు – ఆశలపై చన్నీళ్లు!

Published Sat, Nov 13 2021 1:12 AM | Last Updated on Sat, Nov 13 2021 1:13 AM

R Dilip Reddy Article On Cop26 Climate Change Conference - Sakshi

ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేప«థ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టినాకర్షించిన కాప్‌–26 సదస్సు, అట్టహాసంగా మొదలై, ఆశించిన ఫలితాలు లేకుండానే ముగిసింది. కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగస్వాముల సదస్సు, ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్‌–26 దారుణంగా విఫలమైంది.

కర్బన ఉద్గారాల నికర శూన్యస్థితి (నెట్‌ జీరో) ఎప్పటికో... కానీ, ప్రతిష్టాత్మక భాగ స్వాముల సదస్సు (కాప్‌–26), ఫలితాలు రాబట్టడంలో మాత్రం ‘నికర శూన్యస్థితి’ని సాధించింది. ప్రపంచ ప్రజల ఆశల్ని నీరుగార్చింది. తెలుగునాట ప్రచారంలో ఉన్న ‘శుష్క ప్రియాలు–శూన్య హస్తాలు’ సామెత అతికినట్టు సరిపోయింది. గ్లాస్గో (స్కాంట్లాండ్‌)లో పన్నెండు రోజుల చర్చల సరళి, తుది ఫలితమే ఇందుకు నిదర్శనం! ప్రతి మనిషిని ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పు ప్రమాద నేపథ్యంలో... భూతాపోన్నతి కట్టడికి ప్రపంచ దృష్టి నాకర్షించిన కాప్‌–26 సదస్సు, అట్టహాసంగా మొదలై ఆశించిన ఫలి తాలు లేకుండానే ముగిసింది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌), అంతర్‌ ప్రభుత్వాల బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక ప్రపంచాన్ని హెచ్చ రిస్తూ చేసిన ‘కోడ్‌ రెడ్‌’ ప్రకటనకు సరితూగే చిత్తశుద్ధి సర్వత్రా లోపిం చింది. సదస్సు చివరి రోజైన శుక్రవారం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నేతృ త్వంలో ‘కీలక నిర్ణయాల’ (కవర్‌ డెసిషన్స్‌) పత్రం సిద్ధమౌతున్న సమయంలోనే.... సదస్సు ఏం సాధించిందని సమీక్షించినపుడు నిరాశే కళ్లకు కడుతోంది. ముసాయిదా ప్రతిలోనే ఆశాజనక ప్రతిపాదనలు లేవు. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీరని అసంతృప్తి మిగి లింది. ఏ కీలక విషయంలోనూ నిర్దిష్ట అంగీకారం, విస్పష్ట నిర్ణయం ఆవిష్కృతం కాలేదు. ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి పుడమి– జీవరాశిని కాపాడే ధీమా కలిగించకుండానే సదస్సు ముగిసింది. పాత విషయాలనే అటిటు తిప్పి... కొత్త మాటలు చేర్చి, వాగ్దానాలు దట్టించి చెప్పడం తప్ప ఆశాజనక స్థితి లేదు. ఇదొక తీవ్ర ఆశాభంగమని విశ్వ వ్యాప్తంగా పర్యావరణ కార్యకర్తలంటున్నారు. అగ్ర–సంపన్న దేశాలు పెద్ద హామీలు గుప్పించి నిర్దిష్ట కార్యాచరణకు కట్టుబడకుండానే బయటపడ్డాయి. ఆయా దేశాలు, వారి గోప్య ఎజెండాలు, వాటికి లోబడ్డ మార్కెట్‌ శక్తులు, లాబీయిస్టులు సదస్సులో ఆధిపత్యం చెలా యించారు. వారంతా చర్చల గమనాన్నీ, అంశాల ప్రాధాన్యతల్ని, నిర్ణ యాల సరళిని, గమ్యాన్నీ తాము కోరుకున్న దిశలో నడిపారు. ఏర్పాట్ల నుంచి ఎజెండా దాకా, చర్చల్లో భాగస్వామ్యం నుంచి కార్యాచరణ లోపించడంవరకు ఎన్నెన్నో అంశాలు ప్రశ్నార్థకమయ్యాయి. గ్లాస్గోలో, బయట... ఆది నుంచి కడదాకా నిరసన పర్వం సాగింది. బ్రిటన్‌ లేబర్‌ పార్టీ నేత జెర్మీ కోబిన్‌ అన్నట్టు, ఇది వర్గపోరుగా పరిణమిం చింది. వాతావరణ అత్యయికస్థితి కొందరు సృష్టించే వ్యవస్థల వల్ల పుట్టి, అత్యధికుల్ని వేధించే సమస్య అయిందన్న వ్యాఖ్య అక్షర సత్యం! ఇన్నేళ్లూ కర్బన ఉద్గారాలకు కారకులైన సంపన్న దేశాలు, ఇంకా కాలు ష్యాల వెల్లడికే మొగ్గుతున్నాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న, చెందని పేద దేశాలను మాత్రం, ఉద్గారాల్ని కట్టడి చేయండని ఒత్తిడి తెస్తున్నాయి. హామీ ఇచ్చినట్టు సాంకేతికతను బదలాయించే, ఆర్థిక సహాయం చేసే ‘వాతావరణ ఆర్థిక వనరుల’ (క్లైమెట్‌ ఫైనాన్స్‌)పై కొత్తగా దేనికీ కట్టుబడకుండా ఉత్తి మాటలు చెప్పి జారుకున్నారు.

కట్టడికి నిబద్ధత ఏది?
భూతాపోన్నతిని 1,5 డిగ్రీల సెల్సియస్‌కు మించనీకుండా కట్టడికి ప్రధానంగా బొగ్గు, పెట్రోలియం వంటి శిలాజ ఇంధన వినియోగాన్ని నిలిపివేయాలి. తద్వారా కర్బన ఉద్గారాల్ని ఆపాలి. అప్పుడే భూతా పోన్నతి ఆగేది. ఇది నిర్దిష్ట కాలపరిమితితో వేగంగా జరగాలి. కానీ, సంపన్నదేశాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ముసాయిదా పత్రంలో ఆఖరి క్షణం వరకు ఉంచిన కీలక ప్రతిపాదనల్ని కూడా, ఉద్యమకారులు సందేహించినట్టే... శుక్రవారం రాత్రి (భారత కాల మానం ప్రకారం) పొద్దుపోయాక నిస్సిగ్గుగా తొలగించారు. ఇంధన– వాహన లాబీ బలానికిది నిదర్శనం. పునరుత్పాదక ఇంధనాల వైపు ఎంత వేగంగా, ఏయే కార్యాచరణతో మళ్లేది సంపన్న దేశాలు స్పష్ట పరచలేదు. ఉద్గారాల శూన్య (తటస్థ)స్థితిని ఎప్పటివరకు సాధి స్తాయో గడువు ప్రకటించి, అదే గొప్ప కర్తవ్యంగా చేతులు దులుపు కున్నాయి. అత్యధిక దేశాలు 2050, చైనా 2060, భారత్‌ 2070 గడువుగా వెల్లడించాయి. నిజానికిది కాప్‌ సాధించిందేమీ కాదు! భారత్‌ తప్ప మిగతా దేశాలన్నీ సదస్సుకు ముందే సదరు లక్ష్యాలు చెప్పాయి. పారిస్‌ (2015)లో ప్రకటించి, ఎవరికి వారు ‘జాతీయంగా కట్టుబడ్డ తమ భాగస్వామ్యా (ఎన్డీసీ)లను’ కొత్త లక్ష్యాలతో కొన్ని దేశాలు సవరించాయి. కానీ, నాటి ప్రకటన–ఆచరణకు మధ్య వ్యత్యా సాల్ని ఎత్తిచూపే ఏ సమీక్షా కాప్‌ వేదికలో జరుగలేదు. ‘పారిస్‌ రూల్‌ బుక్‌’ను ఎవరూ ముట్టుకోలేదు. కొత్త వాగ్దానాలెలా అమలుపరుస్తారో నిర్దిష్ట సమాచారం లేదు. బొగ్గు వినియోగం తగ్గించాలన్నారే తప్ప కొత్త ప్లాంట్ల ఏర్పాటు, అంతర్జాతీయ పెట్టుబడులు, విదేశీ ఆర్థిక సహా యాలు, దేశీయ సబ్సిడీలు.. వేటిపైనా నియంత్రణ విధించుకోలేదు. ఉత్తి హామీలే! అందుకే, ‘వాగ్దానాలు కాదు, మాకు కార్యాచరణ కావాలి’ అంటూ గ్లాస్గోలో లక్ష మందికి పైగా పర్యావరణ ఆందోళన కారులు పోగై నిరసన తెలిపారు. భారత్‌తో సహా పలు దేశాల ప్రక టనల్లో హామీకి, ఆచరణకు పొంతనే లేదు. పరస్పర విరుద్ధ పరిస్థి తులున్నాయి. మన దేశంలో బొగ్గు వెలికితీత, ఆ రంగంలో పెట్టు బడులు, ప్రయివేటు శక్తులకు గనులు, తవ్వకాలకు అడవుల్ని దారా దత్తం చేస్తున్న తీరు కాప్‌ వేదిక నుంచి చేసిన ప్రకటనకు పూర్తి భిన్నం. ఉద్గారాలకు విద్యుత్తు తర్వాత కారణమౌతున్నది రవాణా రంగం. వ్యక్తిగత–ప్రజా రవాణా వాహన వినియోగ విషయంలోనూ స్పష్టత లోపించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు మళ్లే విషయంలో ఏ ఆచరణాత్మక అంగీకారమూ కుదరలేదు. చేసిన అంగీకార పత్రంపై జర్మనీ, జపాన్, దక్షిణకొరియా వంటి ప్రధాన వాహన ఉత్పత్తి దేశాలే సంతకాలు చేయలేదు. ‘పారిస్‌లో మాట్లాడుకున్నట్టు ఏ ఇంధన వనరుల్నీ పక్ష పాత ధోరణితో చూడొద్దం’టూ సాదీఅరేబియా చేసిన వాదన, వారి లాబీతత్వం తెలిపేదే! పలు విషయాల్లో... సదస్సు ప్రారంభపు విధాన వెల్లడికి, కడకు సంతకాలు చేసిన అంగీకార పత్రాలకి పొంతనే లేదు.

పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాపంగా...
ఈ చర్చల సరళి అంతా... దోషులను దొడ్డదారిలో సాగనంపడం, బాధితులకే కొత్త బంధాలు వేయడం అన్న తరహాలో సాగింది. ఇప్పటి వరకు జరిగిన వాతావరణ అనర్థంలో ఏ మాత్రం పాత్ర–ప్రమేయం లేని పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తాజా నియంత్రణలు ప్రతి బంధకమవుతున్నాయి. సాధారణ పద్ధతిలో అభివృద్ధి చెందడానికి శిలాజ ఇంధన వినియోగ కట్టడి, కర్బన ఉద్గారాల నియంత్రణ అడ్డంకి. ప్రత్యామ్నాయాల వైపు మళ్లడానికి అవసరమయ్యే సాంకేతి కత బదలాయింపు, ఆర్థిక సహాయానికి మాటిచ్చి, అభివృద్ధి చెందిన దేశాలు ఆచరించటం లేదు. ఈ ‘వాతావరణ ఆర్థిక వనరు’ విష యంలో కాప్‌–26 ఓ మార్గదర్శి అవుతుందనుకుంటే, పరిస్థితి ఏం మారలేదు. ఏటా పదివేల కోట్ల (వంద బిలియన్‌) డాలర్ల ఆర్థిక సహాయానికి 2009లో అంగీకరించిన అభివృద్ధి దేశాలు మాట తప్పాయి. కాప్‌లోనూ, ‘అవును.. నిజమే.. ఇవ్వాలి... ఇదేం పెద్ద విషయం కాదు... కట్టుబడే ఉన్నాం’ వంటి పొడిపొడి మాటలే తప్ప ప్రణాళిక, విడుదల క్రమాన్నీ వెల్లడించలేదు. అమెరికా అ«ధ్యక్షుడు జో బైడెన్‌ ఇలాగే స్పందించారు. సదరు ఆర్థిక వనరును నిర్వచించడానికి కూడా సంపన్న దేశాలు సిద్ధంగా లేవు. అది గ్రాంటా? ఎయిడా? పెట్టుబడా? రుణమా? ప్రయివేటు కంపెనీల మధ్య మారకమా? ఏ రూపంలో ఇస్తారనీ తెలుపటం లేదు. నిష్కారణంగా ఇప్పటికే నష్టపో యిన–వేగంగా భంగపోతున్న చిన్న, దీవి దేశాలను ఆదుకునే వారే లేరు. వారి ఆర్తి అరణ్య రోదనే!

ప్రకృతి నుంచి తీసుకోవడమే తప్ప వెనక్కి ఇచ్చే సంస్కృతి రావటం లేదు. పైగా, ‘ప్రకృతి ఆధారిత పరిష్కారాలం’టూ కొత్త మోసాలకు తెర  తీస్తున్నారు. ఒకచోట ప్రకృతికి హాని చేసి, ఇంకో చోట ప్రకృతికి దోహదపడుతూ బాకీ తీరుస్తారట! ఇది మరో స్కామ్‌! చాలా విషయాల్లో స్పష్టత లేకపోగా కొత్త ఎత్తుగడలు, కార్పొరేట్, పరిశ్రమకు చెందిన లాబీలు పనిచేశాయి. ప్రపంచం ఆశించిన దిశలో ఫలితాలు రాబట్టడంలో కాప్‌–26 దారుణంగా విఫలమైంది.

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ :dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement