
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. భూగోళం ఇంకా ఇంకా వేడెక్కిపోతూ ఉంటే ఈ శతాబ్దం చివరికి ఒక వ్యక్తి ఏడాది కాలంలో పోయే నిద్రలో 50 నుంచి 58 గంటలు తగ్గిపోతుందని జర్నల్ వన్ ఎర్త్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అంటే మనం పడుకునే సమయంలో రోజుకి పది నిముషాలు తగ్గిపోతుంది.
మనం ఎంత సేపు, ఎంత గాఢంగా నిద్రపోతున్నామో చెప్పే రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ అధ్యయనం రూపొందించారు. మొత్తం 68 దేశాల్లో 47 వేల మంది రాత్రిపూట ఎంతసేపు నిద్రపోయారో రెండేళ్ల పాటు వివరాలు సేకరించారు. ‘‘వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిళ్లు వేడిగా మారుతున్నాయి. దీని ప్రభావం వ్యక్తుల నిద్రపై పడుతోంది.
వారు నిద్రపోయే సమయం క్రమక్రమంగా తగ్గిపోతోంది.’’ అని ఈ అధ్యయనం సహరచయిత కెల్టన్ మినార్ చెప్పారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారి సంఖ్య 3.5% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. మనుషులు నిద్రపోయే సమయంలో మనుషుల శరీరం వేడిని నిరోధిస్తూ చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే అలా వేడిని నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆ అధ్యయనం వివరించింది.