sleep deficiency
-
పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...
రాత్రివేళ నిద్రలో మనం చాలాసార్లు అటు పక్కకూ, ఇటు పక్కకూ తిరగాల్సి వస్తుంది. అలా పక్కకు తిరిగి పడుకున్న సమయంలో తలకూ, పడకకూ మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ కారణంగా తలపై మరింత భారం పడి సుఖ నిద్ర సాధ్యం కాదు. అందుకే మంచి తలగడను ఉపయోగించడం ద్వారా ఆ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కొందరు తలగడ ఉన్నా దాని సపోర్ట్ సరిపోక మళ్లీ భుజాన్ని కూడా వాడుతుంటారు. ఇది కూడా సరికాదు. తలగడ ఎలా ఉండాలంటే... తలగడ మృదువుగా భుజాలు, తల పట్టేంత సైజులో ఉండాలి. కార్లలో ఉపయోగించే చిన్న తలగడలు పడక మీద నిద్రలో ఉపయోగించడం సరికాదు. తలగడను కేవలం తలకింద మాత్రమే అమరేలా కాకుండా... కొంత భాగం భుజాల కిందికీ వచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల స్పాండిలోసిస్ కారణంగా వచ్చే మెడనొప్పి నివారితమవుతుంది. స్పాండిలోసిస్, మెడనొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు తమకు అనువైన తలగడను ఎంచుకొని, నిద్రకోసం దాన్నే వాడాలి. ఎవరి తలగడ వారికి వేరుగా ఉండాలి. తలగడ మీద ఉండే డస్ట్‌మైట్స్ తో కొందరికి అలర్జీలూ, ఆస్తమా కూడా రావచ్చు. అందుకే తలగడను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఉతికిన పిల్లోకవర్ తొడిగిన తలగడనే వాడాలి. పడక ఎలా ఉండాలంటే... వీపునొప్పితో బాధపడే చాలామంది పరుపు వాడకూడదని, గట్టి ఉపరితలం మీద పడుకోవాలన్న అపోహతో చెక్కబల్ల మీద పడుకుంటుంటారు. వాస్తవానికి అది మంచిది కాదు. మంచి పరుపు మీద పడుకోవడమే మంచిది. అది శరీరానికి గట్టిగా ఒత్తుకోకుండా ఉండేంత మృదువుగా ఉండాలి. అదేవిధంగా మనం అందులోకి కూరుకుపోయేటంత మెత్తగా ఉండకూడదు. గట్టి ఉపరితలం మీద పడుకుంటే ఒంట్లో చాలా భాగాలు నొక్కుకుపోయి, అలా నొక్కుకుపోయిన చోట్ల నొప్పి వచ్చే అవకాముంటుంది. అందుకే పరుపును ఎంపిక చేసే సమయంలో అది శరీరానికి ఒత్తుకోకుండా మృదువుగా ఉండటంతో పాటు మనం కూరుకుపోకుండా ఉండేలాంటి పరుపును తీసుకోవాలి. పరుపు వాడేటప్పుపడు ప్రతివారం దాన్ని తిరగవేయడం మంచిది. ఎందుకంటే ఒకేవైపు వాడుతుంటే శరీరం బరువు ఒకేచోట పడి అది తన ఎలాస్టిసిటీని కోల్పోయి, గుంటలా పడుతుంది. అందుకే మార్చి మార్చి వాడాలి. ఒక పరుపును మూడేళ్ల పాటు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత అవకాశముంటే మార్చడమే మంచిది.(చదవండి: డార్క్ చాక్లెట్ టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుందట) -
నిదురించని తోటలోకి
ఒక రాత్రి గజదొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. అలికిడికి ఇంట్లో ఉన్న ముసలామె లేచింది. ‘ఎవరూ?’ అని గద్దించింది. ‘నేను దొంగని’ అన్నాడు దొంగ. ‘ఆరి బడవా... నువ్వు రీతి జాతి ఉన్న దొంగవైతే ఇలా ఒంటరి ముసల్ది ఉన్న ఇంట్లో జొరబడతావా? నా కొడుకు పహిల్వాను. పక్క ఊరికి కుస్తీకి వెళ్లాడు. నీకు దమ్ముంటే రేపు నా కొడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చెయ్యి’ అంది. దొంగకు పౌరుషం వచ్చింది. ‘అలాగే. నా రోషం నువ్వెరగవు. కాచుకో’ అని వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొడుకు వచ్చాడు. తల్లి భోజనం పెడుతూ జరిగింది చెప్పింది. కొడుకు తింటున్న వాడల్లా ముద్ద విడిచి విచారంగా కూచున్నాడు. ‘ఏమి నాయనా?’ అంది ముసలామె. ‘అది కాదమ్మా... నువ్వెలా అలా సవాలు విసిరావు. వాడు దొంగ. ముందు దెబ్బ తీస్తాడో, వెనుక దెబ్బ తీస్తాడో, మత్తుమందు జల్లుతాడో, కొంపకు నిప్పెడతాడో ఎలా తెలుసు? నేరుగా వస్తే పోరాడి గెలుస్తానుగాని దొంగదెబ్బ తీస్తే ఏం చేయను? అవన్నీ కాదు. నిద్రనేది ఒకటి ఉంది కదా... నేను గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వాడు బండరాయి తెచ్చి నెత్తినేస్తే ఏం చేయను’ అన్నాడు. ముసలామె తెల్లముఖం వేసింది. మనిషికి నిద్ర ముంచుకొచ్చే రోజుల్లో పుట్టిన కథ ఇది. ప్రేమ్‌చంద్ రాసిన ‘ఫూస్ కీ రాత్’ అనే కథ ఉంది. అందులో ఒక నిరుపేద రైతు తన పొలానికి గడ్డకట్టే చలికాలంలో కాపలా కాయాల్సి వస్తుంది. అతనికి కంబళి ఉండదు. పెళ్లాం, అతను కలిసి కంబళి కోసం మూడు రూపాయలు జమ చేస్తారు కాని ఎవరో అప్పులోడు వచ్చి ఆ డబ్బు పట్టుకెళతాడు. పేదరైతు ప్రతి రాత్రి చలిలో వణుకుతూ నిద్ర పట్టక పొలంలో నానా అవస్థలు పడతాడు. రోజంతా నిద్ర అతడి కనురెప్పల మీదే ఉంటుంది. నిద్ర కావాలి! ఆ రోజు పొలానికి వెళ్లి చలిమంట వేసుకుంటాడు. పక్కనే నడుము వాలుస్తాడు. ఎన్నాళ్లుగా ఆగి ఉందో నిద్ర... కమ్ముకుంది. ఒళ్లెరక్క నిద్ర పోయాడు. మంచును లెక్క చేయక నిద్ర పోయాడు. చలిమంట వ్యాపించి పంటంతా తగలబడినా అలాగే పడి నిద్ర పోయాడు. తెల్లారి భార్య వచ్చి గుండెలు బాదుకుంటూ ‘పొలం తగలబడింది’ అంటే రైతు లేచి చూసి ‘దరిద్రం వదిలింది. ఇప్పుడైనా నిద్రపోని’ అని నిద్ర పోతాడు. కష్టం చేసే వాడు నిదురకు పడే కష్టం గురించి ప్రేమ్‌చంద్ రాసిన కథ అది. నిద్రంటే మనకు చప్పున గుర్తుకొచ్చే జంట ఊర్మిళ, లక్ష్మణస్వామి. అన్నతో పాటు లక్ష్మణుడు అడవికి పోతే పద్నాలుగేళ్లు ఊర్మిళ నిద్ర పోయింది. నిద్ర ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నిద్ర ఆమెను వాస్తవ కలతల నుంచి, భర్త ఎడబాటు దుఃఖం నుంచి, పోచికోలు కబుర్ల నుంచి, ఆరాల నుంచి కాపాడింది. ఊర్మిళకు నిద్ర పట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో! శ్రీరాముడి పట్టాభిషేకఘట్టంలో లక్ష్మణుడు హఠాత్తుగా నవ్వడం చూసి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. ‘ఎందుకు నవ్వావు లక్ష్మణా’ అనంటే ‘పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా అన్నా వదినలను కాచుకున్నప్పుడు ఒక్కసారి కూడా నిద్ర రాలేదు. తీరా ఇప్పుడు ఇంత గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంటే ఈ మోసకారి నిద్ర ముంచుకొస్తున్నదే అని నవ్వాను’ అంటాడు. ‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అంటాడు ఆత్రేయ ఏదో పాటలో. పేదవాడికి ఐశ్వర్యం, వైభోగం లేకపోవచ్చు. ఆరు రకాలుగా తినే వీలు లేకపోవచ్చు. కాని వాడు తుండు తల కింద పెట్టుకున్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. కలల్లో మునిగిపోతాడు. విన్సెంట్ వాన్ గో గీసిన ‘నూన్ – రెస్ట్ ఫ్రమ్ వర్క్’ అనే ప్రఖ్యాత చిత్రం ఉంటుంది. కూలిపని చేసి మధ్యాహ్నం భోజన వేళ గడ్డివాములో కునుకు తీస్తున్న జంటను వేస్తాడు. ఆ క్షణంలో ఆ జంటను చూస్తే వారికి మించిన ఐశ్వర్యవంతులు లేరనిపిస్తుంది. విశ్రాంతినిచ్చే నిద్ర ఎంత పెద్ద లగ్జరీ. కుంభకర్ణుడొక్కడే జీవితమంటే ఉరుకులు పరుగులు కాదని మొదట గ్రహించినవాడు. అతడు ఆరునెలలు నిద్ర పోయేవాడంటే అర్థం– వెకేషన్ లో ఉండేవాడని! తింటూ నిద్రపోతూ. ఆర్నెల్లు మాత్రమే పని. నెలలో రెండు వారాలు పని చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకునే నాగరిక సమాజం ఎప్పుడో వచ్చే తీరుతుంది. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని రాశాడు శేషేంద్ర. ఇప్పుడు మొక్కలు, పూలు ప్రతి ఇంటా ఉన్నా నిదురకు బీడువారిన కళ్లే చాలా ఇళ్లల్లో. కుక్కి మంచంలో సుఖంగా నిద్రపోయే కాలం నుంచి వేల రూపాయల పరుపు మీద కూడా సరిగా నిద్ర పట్టని మనుషుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతోంది. నిద్ర పట్టక, నిద్ర పోలేక, రాత్రి ఎంతకీ గడవక, నిద్ర మాత్రలు మింగలేక, మింగినా నిద్ర రాక... ఒక గొప్ప వైభోగమయ జీవన క్రియను కోల్పోయిన తాజా నిరుపేదలు. ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్ర పట్టని వాళ్లు ఎక్కువ ఉన్న దేశం మనదే. నిదుర ఎందుకు పట్టదు? లక్ష కారణాలు. కాని ఏది నిశ్చింత బతుకు అనేది ఎవరికి వారు వ్యాఖ్యానించుకుని అంతకు సంతప్తి పడటం నేర్చుకుంటే అదిగో బెడ్‌లైట్ స్విచ్చంత దూరంలో నిద్ర కాచుకుని ఉంటుంది. మీ జీవనంలోనే నిద్ర మాత్ర ఉంటుంది. వెతకండి. గాఢనిద్ర ప్రాప్తిరస్తు! -
వాతావరణ మార్పులతో నిద్రలేమి
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. భూగోళం ఇంకా ఇంకా వేడెక్కిపోతూ ఉంటే ఈ శతాబ్దం చివరికి ఒక వ్యక్తి ఏడాది కాలంలో పోయే నిద్రలో 50 నుంచి 58 గంటలు తగ్గిపోతుందని జర్నల్ వన్ ఎర్త్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అంటే మనం పడుకునే సమయంలో రోజుకి పది నిముషాలు తగ్గిపోతుంది. మనం ఎంత సేపు, ఎంత గాఢంగా నిద్రపోతున్నామో చెప్పే రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ అధ్యయనం రూపొందించారు. మొత్తం 68 దేశాల్లో 47 వేల మంది రాత్రిపూట ఎంతసేపు నిద్రపోయారో రెండేళ్ల పాటు వివరాలు సేకరించారు. ‘‘వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిళ్లు వేడిగా మారుతున్నాయి. దీని ప్రభావం వ్యక్తుల నిద్రపై పడుతోంది. వారు నిద్రపోయే సమయం క్రమక్రమంగా తగ్గిపోతోంది.’’ అని ఈ అధ్యయనం సహరచయిత కెల్టన్ మినార్ చెప్పారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారి సంఖ్య 3.5% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. మనుషులు నిద్రపోయే సమయంలో మనుషుల శరీరం వేడిని నిరోధిస్తూ చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే అలా వేడిని నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆ అధ్యయనం వివరించింది. -
ఒక రోజు నిద్రపోకపోయినా అంతే!
హాంకాంగ్ : నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్ వెల్లడించారు. -
సోషల్ మీడియాలో గంట గడిపితే..
లండన్ : వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో గంటల కొద్దీ గడిపేవారిని పరిశోధకులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రోజుకు కేవలం ఒక గంట పాటు విహరించినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు ఎనిమిది గంటలు నిద్రించేందుకు యువత ఎందుకు కష్టపడుతోందని విశ్లేషించిన కెనడా పరిశోధకులకు దీని మూలాలు సోషల్ మీడియాలో ఉన్నట్టు తేలింది. రోజుకు 60 నిమిషాల పాటు వాట్సాప్, ఎఫ్బీ, స్నాప్‌చాట్‌లతో గడిపేవారు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నవారితో పోలిస్తే నిద్ర సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఎక్కువ సమయం యాప్స్, సైట్స్‌పై వెచ్చించిన వారికి ఆ మేరకు నిద్ర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్ యువతులు ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని అథ్యయనంలో తేలింది. సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పిల్లలు, టీనేజర్లు న్యూ టెక్నాలజీకి అలవాటుపడి వారు యుక్తవయసుకు రాగానే వాటికి బానిసలవుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారని కెనడా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టా పీడియాట్రికా జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది. -
ఇలా చేస్తే నిద్రలేమి దూరం
లండన్: సరిగ్గా నిద్రపట్టడం లేదనే ఫిర్యాదు తరచూ వింటూ ఉంటాం. నిద్రించేముందు పాలు తాగడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి చిట్కాలు పాటించినా కునుకుపట్టడం లేదని చెపుతుంటారు. నిద్రలేమికే ఏటా ఇంగ్లండ్‌లో కోటి మంది నిద్ర మాత్రలు తీసుకుంటుంటారని తాజా అథ్యయనంలో వెల్లడైంది. అయితే నేచురల్ థెరఫీలతో నిద్రలేమిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కండరాలు రిలాక్స్ అయ్యేలా చేసే ప్రాణాయామంతో మంచి నిద్ర సొంతమవుతుందని యాంగ్జైటీ చికిత్సా నిపుణుడు చార్లెస్ లిండెన్ చెబుతున్నారు. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుతూ అంతే నెమ్మదిగా గాలి వదులుతూ కండరాలకు విశ్రాంతి కల్పించాలని ఆయన సూచించారు. కండరాలను పట్టి ఉంచడం నెమ్మదిగా సడలించడం ద్వారా శరీరం ఉత్తేజితమై సుఖ నిద్రకు సంసిద్ధమవుతుందని చెబుతున్నారు. తల నుంచి కాలిగోళ్ల వరకూ శ్వాస ప్రక్రియ నిలకడగా సాగాలని, ఈ క్రమంలో శరీరాన్ని నిద్రకు సిద్ధం చేసేలా భావించాలన్నారు. నిద్రకు ఉపక్రమించిన వెంటనే కళ్లు మూసుకుని ముఖంపై బాల్స్‌ను మూడు సార్లు రోల్ చేయాలని, ఈ కదలికలతో మనలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుందని గుడ్‌స్లీప్ గైడ్ రచయిత శామీ మార్గో సూచించారు. ఇక విజువలైజేషన్ మెడిటేషన్ కూడా సుఖ నిద్రను స్వాగతిస్తుందని శామీ చెబుతున్నారు. మనకిష్టమైన ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవాలని సుందర జలపాతాల వద్ద విహరిస్తున్నట్టు, పూదోటలలో నడుస్తున్నట్టు అక్కడి అనుభూతులనూ ఆస్వాదిస్తూ విజువలైజ్ చేసుకుంటే మనసంతా హాయిగా మారి, నిద్ర ముంచుకొస్తుందని శామీ చెప్పారు. ఇంకా మనసును ఉత్తేజపరిచే సంగీతాన్ని వినడం, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య తేలికపాటి వ్యాయామం చేయడం నిద్రలేమిని నివారిస్తాయని స్లీప్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఇడికివోస్కి సూచించారు. ట్రిగ్గర్ పాయింట్.. నిద్రను ప్రేరేపించే ప్రత్యేక పాయింట్లు మన శరీరంలో ఉంటాయని, వాటిని గుర్తించి నెమ్మదిగా, సూటిగా ప్రెస్ చేస్తే చక్కటి నిద్ర సొంతమవుతుందని డాక్టర్ ఇడికివోస్కి చెబుతున్నారు. ఇరు కనుబొమ్మల మధ్య, ముక్కు పైభాగంలో బొటనవేలితో 20 సెకన్ల పాటు రెండు, మూడు సార్లు ప్రెస్ చేస్తే నిద్ర ఇట్టే ఆవహిస్తుందని సూచించారు. వీటన్నింటినీ శరీరాన్ని మానసికంగా, శారీరకంగా నిద్రకు సన్నద్ధం చేస్తేనే ఆశించిన ఫలితాలు ఇస్తాయని నిపుణులు పేర్కొన్నారు. -
జవాన్ల కష్టాలకు పరిష్కార 'యోగా'లు
అనునిత్యం అప్రమత్తత.. దేశప్రజలు కంటినిండా నిద్రపోవాలంటే తాను కనుపెప్పవాల్చకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి. ఒకటికాదు రెండు కాదు ఇలా ఏళ్లతరబడి రక్షణ బాధ్యతను భుజస్కందాలపై మోస్తోన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఒత్తిడి, నిద్రలేమి వంటి అదనపు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా వారికి విధుల పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తోంది. ఈ సమస్యల్ని పరిష్కరించే క్రమంలో బీఎస్ఎఫ్ బృందాలకు త్వరలో యోగా తరగతులు నిర్వహించనున్నట్లు బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇందుకోసం బ్రహ్మకుమారీస్ సంస్థ సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు. అత్యంత వేడిమి వాతావరణం (రాజస్థాన్), చల్లని ప్రదేశం (కశ్మీర్) బార్డర్ లో పనిచేస్తోన్న బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న దృష్ట్యా మొదట ఆయా ప్రాంతాల్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. దాదాపు 30 వర్కషాపులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లు మొబైల్ ఫోన్లను వినియోగించొద్దని ఆదేశాలు జారీచేశామన్నారు. 'ఫోన్ల ద్వారా ఇంట్లో సమస్యలు తెలసుకునే జవాన్లు కుటుంబ సభ్యులకు అండగా ఉండలేకపోతున్నామనే భావనకు లోనవుతారు. దీనివల్ల మరింత ఒత్తిడికి లోనవుతారు. అందుకే మొబైళ్లను వాడొద్దని సూచిస్తున్నట్లు పాఠక్ వివరించారు.