
లండన్ : వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో గంటల కొద్దీ గడిపేవారిని పరిశోధకులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రోజుకు కేవలం ఒక గంట పాటు విహరించినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజుకు ఎనిమిది గంటలు నిద్రించేందుకు యువత ఎందుకు కష్టపడుతోందని విశ్లేషించిన కెనడా పరిశోధకులకు దీని మూలాలు సోషల్ మీడియాలో ఉన్నట్టు తేలింది.
రోజుకు 60 నిమిషాల పాటు వాట్సాప్, ఎఫ్‌బీ, స్నాప్‌చాట్‌లతో గడిపేవారు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నవారితో పోలిస్తే నిద్ర సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఎక్కువ సమయం యాప్స్, సైట్స్‌పై వెచ్చించిన వారికి ఆ మేరకు నిద్ర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్ యువతులు ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని అథ్యయనంలో తేలింది. సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పిల్లలు, టీనేజర్లు న్యూ టెక్నాలజీకి అలవాటుపడి వారు యుక్తవయసుకు రాగానే వాటికి బానిసలవుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారని కెనడా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్టా పీడియాట్రికా జర్నల్‌లో ఈ అథ్యయనం ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment