జవాన్ల కష్టాలకు పరిష్కార 'యోగా'లు
అనునిత్యం అప్రమత్తత.. దేశప్రజలు కంటినిండా నిద్రపోవాలంటే తాను కనుపెప్పవాల్చకుండా కాపలా కాయాల్సిన పరిస్థితి. ఒకటికాదు రెండు కాదు ఇలా ఏళ్లతరబడి రక్షణ బాధ్యతను భుజస్కందాలపై మోస్తోన్న బీఎస్ఎఫ్ జవాన్లు ఒత్తిడి, నిద్రలేమి వంటి అదనపు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా వారికి విధుల పట్ల ఆసక్తి తగ్గుతూ వస్తోంది. ఈ సమస్యల్ని పరిష్కరించే క్రమంలో బీఎస్ఎఫ్ బృందాలకు త్వరలో యోగా తరగతులు నిర్వహించనున్నట్లు బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇందుకోసం బ్రహ్మకుమారీస్ సంస్థ సహకారాన్ని తీసుకుంటామని చెప్పారు.
అత్యంత వేడిమి వాతావరణం (రాజస్థాన్), చల్లని ప్రదేశం (కశ్మీర్) బార్డర్ లో పనిచేస్తోన్న బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న దృష్ట్యా మొదట ఆయా ప్రాంతాల్లో యోగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. దాదాపు 30 వర్కషాపులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందులో భాగంగానే కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లు మొబైల్ ఫోన్లను వినియోగించొద్దని ఆదేశాలు జారీచేశామన్నారు. 'ఫోన్ల ద్వారా ఇంట్లో సమస్యలు తెలసుకునే జవాన్లు కుటుంబ సభ్యులకు అండగా ఉండలేకపోతున్నామనే భావనకు లోనవుతారు. దీనివల్ల మరింత ఒత్తిడికి లోనవుతారు. అందుకే మొబైళ్లను వాడొద్దని సూచిస్తున్నట్లు పాఠక్ వివరించారు.