ఒక రాత్రి గజదొంగ ఒక ఇంట్లో ప్రవేశించాడు. అలికిడికి ఇంట్లో ఉన్న ముసలామె లేచింది. ‘ఎవరూ?’ అని గద్దించింది. ‘నేను దొంగని’ అన్నాడు దొంగ. ‘ఆరి బడవా... నువ్వు రీతి జాతి ఉన్న దొంగవైతే ఇలా ఒంటరి ముసల్ది ఉన్న ఇంట్లో జొరబడతావా? నా కొడుకు పహిల్వాను. పక్క ఊరికి కుస్తీకి వెళ్లాడు. నీకు దమ్ముంటే రేపు నా కొడుకున్నప్పుడు వచ్చి దొంగతనం చెయ్యి’ అంది. దొంగకు పౌరుషం వచ్చింది. ‘అలాగే. నా రోషం నువ్వెరగవు. కాచుకో’ అని వెళ్లిపోయాడు. మరుసటి రోజు కొడుకు వచ్చాడు.
తల్లి భోజనం పెడుతూ జరిగింది చెప్పింది. కొడుకు తింటున్న వాడల్లా ముద్ద విడిచి విచారంగా కూచున్నాడు. ‘ఏమి నాయనా?’ అంది ముసలామె. ‘అది కాదమ్మా... నువ్వెలా అలా సవాలు విసిరావు. వాడు దొంగ. ముందు దెబ్బ తీస్తాడో, వెనుక దెబ్బ తీస్తాడో, మత్తుమందు జల్లుతాడో, కొంపకు నిప్పెడతాడో ఎలా తెలుసు? నేరుగా వస్తే పోరాడి గెలుస్తానుగాని దొంగదెబ్బ తీస్తే ఏం చేయను? అవన్నీ కాదు. నిద్రనేది ఒకటి ఉంది కదా... నేను గుర్రు పెట్టి నిద్రపోతున్నప్పుడు వాడు బండరాయి తెచ్చి నెత్తినేస్తే ఏం చేయను’ అన్నాడు. ముసలామె తెల్లముఖం వేసింది. మనిషికి నిద్ర ముంచుకొచ్చే రోజుల్లో పుట్టిన కథ ఇది.
ప్రేమ్‌చంద్ రాసిన ‘ఫూస్ కీ రాత్’ అనే కథ ఉంది. అందులో ఒక నిరుపేద రైతు తన పొలానికి గడ్డకట్టే చలికాలంలో కాపలా కాయాల్సి వస్తుంది. అతనికి కంబళి ఉండదు. పెళ్లాం, అతను కలిసి కంబళి కోసం మూడు రూపాయలు జమ చేస్తారు కాని ఎవరో అప్పులోడు వచ్చి ఆ డబ్బు పట్టుకెళతాడు. పేదరైతు ప్రతి రాత్రి చలిలో వణుకుతూ నిద్ర పట్టక పొలంలో నానా అవస్థలు పడతాడు.
రోజంతా నిద్ర అతడి కనురెప్పల మీదే ఉంటుంది. నిద్ర కావాలి! ఆ రోజు పొలానికి వెళ్లి చలిమంట వేసుకుంటాడు. పక్కనే నడుము వాలుస్తాడు. ఎన్నాళ్లుగా ఆగి ఉందో నిద్ర... కమ్ముకుంది. ఒళ్లెరక్క నిద్ర పోయాడు. మంచును లెక్క చేయక నిద్ర పోయాడు. చలిమంట వ్యాపించి పంటంతా తగలబడినా అలాగే పడి నిద్ర పోయాడు. తెల్లారి భార్య వచ్చి గుండెలు బాదుకుంటూ ‘పొలం తగలబడింది’ అంటే రైతు లేచి చూసి ‘దరిద్రం వదిలింది. ఇప్పుడైనా నిద్రపోని’ అని నిద్ర పోతాడు. కష్టం చేసే వాడు నిదురకు పడే కష్టం గురించి ప్రేమ్‌చంద్ రాసిన కథ అది.
నిద్రంటే మనకు చప్పున గుర్తుకొచ్చే జంట ఊర్మిళ, లక్ష్మణస్వామి. అన్నతో పాటు లక్ష్మణుడు అడవికి పోతే పద్నాలుగేళ్లు ఊర్మిళ నిద్ర పోయింది. నిద్ర ఆమెను తన ఒడిలోకి తీసుకుంది. నిద్ర ఆమెను వాస్తవ కలతల నుంచి, భర్త ఎడబాటు దుఃఖం నుంచి, పోచికోలు కబుర్ల నుంచి, ఆరాల నుంచి కాపాడింది. ఊర్మిళకు నిద్ర పట్టకపోయి ఉంటే ఏమై ఉండేదో! శ్రీరాముడి పట్టాభిషేకఘట్టంలో లక్ష్మణుడు హఠాత్తుగా నవ్వడం చూసి ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు.
‘ఎందుకు నవ్వావు లక్ష్మణా’ అనంటే ‘పద్నాలుగేళ్లు కంటికి రెప్పలా అన్నా వదినలను కాచుకున్నప్పుడు ఒక్కసారి కూడా నిద్ర రాలేదు. తీరా ఇప్పుడు ఇంత గొప్పగా పట్టాభిషేకం జరుగుతుంటే ఈ మోసకారి నిద్ర ముంచుకొస్తున్నదే అని నవ్వాను’ అంటాడు.
‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు?’ అంటాడు ఆత్రేయ ఏదో పాటలో. పేదవాడికి ఐశ్వర్యం, వైభోగం లేకపోవచ్చు. ఆరు రకాలుగా తినే వీలు లేకపోవచ్చు. కాని వాడు తుండు తల కింద పెట్టుకున్నాడంటే నిద్రలోకి జారుకుంటాడు. కలల్లో మునిగిపోతాడు. విన్సెంట్ వాన్ గో గీసిన ‘నూన్ – రెస్ట్ ఫ్రమ్ వర్క్’ అనే ప్రఖ్యాత చిత్రం ఉంటుంది. కూలిపని చేసి మధ్యాహ్నం భోజన వేళ గడ్డివాములో కునుకు తీస్తున్న జంటను వేస్తాడు.
ఆ క్షణంలో ఆ జంటను చూస్తే వారికి మించిన ఐశ్వర్యవంతులు లేరనిపిస్తుంది. విశ్రాంతినిచ్చే నిద్ర ఎంత పెద్ద లగ్జరీ. కుంభకర్ణుడొక్కడే జీవితమంటే ఉరుకులు పరుగులు కాదని మొదట గ్రహించినవాడు. అతడు ఆరునెలలు నిద్ర పోయేవాడంటే అర్థం– వెకేషన్ లో ఉండేవాడని! తింటూ నిద్రపోతూ. ఆర్నెల్లు మాత్రమే పని. నెలలో రెండు వారాలు పని చేసి రెండు వారాలు విశ్రాంతి తీసుకునే నాగరిక సమాజం ఎప్పుడో వచ్చే తీరుతుంది.
‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అని రాశాడు శేషేంద్ర. ఇప్పుడు మొక్కలు, పూలు ప్రతి ఇంటా ఉన్నా నిదురకు బీడువారిన కళ్లే చాలా ఇళ్లల్లో. కుక్కి మంచంలో సుఖంగా నిద్రపోయే కాలం నుంచి వేల రూపాయల పరుపు మీద కూడా సరిగా నిద్ర పట్టని మనుషుల సంఖ్య చాప కింద నీరులా పెరుగుతోంది. నిద్ర పట్టక, నిద్ర పోలేక, రాత్రి ఎంతకీ గడవక, నిద్ర మాత్రలు మింగలేక, మింగినా నిద్ర రాక... ఒక గొప్ప వైభోగమయ జీవన క్రియను కోల్పోయిన తాజా నిరుపేదలు. ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్ర పట్టని వాళ్లు ఎక్కువ ఉన్న దేశం మనదే.
నిదుర ఎందుకు పట్టదు? లక్ష కారణాలు. కాని ఏది నిశ్చింత బతుకు అనేది ఎవరికి వారు వ్యాఖ్యానించుకుని అంతకు సంతప్తి పడటం నేర్చుకుంటే అదిగో బెడ్‌లైట్ స్విచ్చంత దూరంలో నిద్ర కాచుకుని ఉంటుంది. మీ జీవనంలోనే నిద్ర మాత్ర ఉంటుంది. వెతకండి. గాఢనిద్ర ప్రాప్తిరస్తు!
నిదురించని తోటలోకి
Published Mon, Oct 23 2023 4:24 AM | Last Updated on Mon, Oct 23 2023 4:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment