లండన్: సరిగ్గా నిద్రపట్టడం లేదనే ఫిర్యాదు తరచూ వింటూ ఉంటాం. నిద్రించేముందు పాలు తాగడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి చిట్కాలు పాటించినా కునుకుపట్టడం లేదని చెపుతుంటారు. నిద్రలేమికే ఏటా ఇంగ్లండ్‌లో కోటి మంది నిద్ర మాత్రలు తీసుకుంటుంటారని తాజా అథ్యయనంలో వెల్లడైంది. అయితే నేచురల్ థెరఫీలతో నిద్రలేమిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కండరాలు రిలాక్స్ అయ్యేలా చేసే ప్రాణాయామంతో మంచి నిద్ర సొంతమవుతుందని యాంగ్జైటీ చికిత్సా నిపుణుడు చార్లెస్ లిండెన్ చెబుతున్నారు. ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుతూ అంతే నెమ్మదిగా గాలి వదులుతూ కండరాలకు విశ్రాంతి కల్పించాలని ఆయన సూచించారు. కండరాలను పట్టి ఉంచడం నెమ్మదిగా సడలించడం ద్వారా శరీరం ఉత్తేజితమై సుఖ నిద్రకు సంసిద్ధమవుతుందని చెబుతున్నారు.
తల నుంచి కాలిగోళ్ల వరకూ శ్వాస ప్రక్రియ నిలకడగా సాగాలని, ఈ క్రమంలో శరీరాన్ని నిద్రకు సిద్ధం చేసేలా భావించాలన్నారు. నిద్రకు ఉపక్రమించిన వెంటనే కళ్లు మూసుకుని ముఖంపై బాల్స్‌ను మూడు సార్లు రోల్ చేయాలని, ఈ కదలికలతో మనలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుందని గుడ్‌స్లీప్ గైడ్ రచయిత శామీ మార్గో సూచించారు. ఇక విజువలైజేషన్ మెడిటేషన్ కూడా సుఖ నిద్రను స్వాగతిస్తుందని శామీ చెబుతున్నారు. మనకిష్టమైన ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవాలని సుందర జలపాతాల వద్ద విహరిస్తున్నట్టు, పూదోటలలో నడుస్తున్నట్టు అక్కడి అనుభూతులనూ ఆస్వాదిస్తూ విజువలైజ్ చేసుకుంటే మనసంతా హాయిగా మారి, నిద్ర ముంచుకొస్తుందని శామీ చెప్పారు. ఇంకా మనసును ఉత్తేజపరిచే సంగీతాన్ని వినడం, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య తేలికపాటి వ్యాయామం చేయడం నిద్రలేమిని నివారిస్తాయని స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ ఇడికివోస్కి సూచించారు.
ట్రిగ్గర్ పాయింట్..
నిద్రను ప్రేరేపించే ప్రత్యేక పాయింట్లు మన శరీరంలో ఉంటాయని, వాటిని గుర్తించి నెమ్మదిగా, సూటిగా ప్రెస్ చేస్తే చక్కటి నిద్ర సొంతమవుతుందని డాక్టర్ ఇడికివోస్కి చెబుతున్నారు. ఇరు కనుబొమ్మల మధ్య, ముక్కు పైభాగంలో బొటనవేలితో 20 సెకన్ల పాటు రెండు, మూడు సార్లు ప్రెస్ చేస్తే నిద్ర ఇట్టే ఆవహిస్తుందని సూచించారు. వీటన్నింటినీ శరీరాన్ని మానసికంగా, శారీరకంగా నిద్రకు సన్నద్ధం చేస్తేనే ఆశించిన ఫలితాలు ఇస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment