పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్‌లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి.
షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది.
Comments
Please login to add a commentAdd a comment