International Union for Conservation of Nature
-
Living Planet Index: ఐదో వంతు జీవ జాతులు... అంతరించే ముప్పు
ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలస బాట పట్టే అసంఖ్యాక జీవ జాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్యసమితి తెర తీసింది. ఇందులో భాగంగా 1997 ఐరాస ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1,189 జీవ జాతులను లోతుగా పరిశీలించారు. పరిశోధనలో తేలిన అంశాలను 5,000 పై చిలుకు జీవ జాతుల తీరుతెన్నులను 50 ఏళ్లుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్), లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల గణాంకాల సాయంతో విశ్లేíÙంచారు. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 22 శాతం జీవ జాతులు అతి త్వరలో పూర్తిగా అంతరించనున్నట్టు తేలింది. మొత్తమ్మీద 44 శాతం జీవ జాతుల సంఖ్య నిలకడగా తగ్గుముఖం పడుతూ వస్తున్నట్టు వెల్లడైంది. ఈ వివరాలతో కూడిన తాజా నివేదికను ఐరాస ఇటీవలే విడుదల చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ఐదో వంతు వలస జీవజాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. జీవజాతుల వలసలు కొత్తగా మొదలైనవి కావు. అనాదిగా భూమ్మీదా, సముద్రంలోనూ అత్యంత కఠినతరమైన, భిన్న వాతావరణ పరిస్థితుల గుండా ఏటా వందల కోట్ల సంఖ్యలో సాగుతుంటాయి. ఇన్నేళ్లలో ఏనాడూ లేని ముప్పు ఇప్పుడే వచ్చి పడటానికి ప్రధాన కారణం మానవ జోక్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు, సాగుతున్న పర్యావరణ విధ్వంసమే’’ అని తేలి్చంది. ఇప్పటికైనా కళ్లు తెరిచి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఐరాస వలస జాతుల సంరక్షణ సదస్సు కార్యదర్శి అమీ ఫ్రాంకెల్ అన్నారు. గత వారం ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన సదస్సు భేటీలో ఈ అంశాన్నే ఆయన నొక్కిచెప్పారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 30 శాతం భూ, సముద్ర భాగాల సమగ్ర పరిరక్షణకు కృషి చేస్తామంటూ 2022 గ్లోబల్ బయో డైవర్సిటీ సమిట్‌లో పాల్గొన్న దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. దాన్ని నెరవేర్చాల్సిన సమయం వచ్చింది’’ అన్నారు. ప్రమాదపుటంచుల్లో... 1979 ఐరాస రక్షిత జాబితాలోని 1,189 జీవ జాతులను నివేదిక లోతుగా పరిశీలించింది. అనంతరం ఏం చెప్పిందంటే... ► ప్రపంచవ్యాప్తంగా 44 శాతం వలస జీవ జాతుల సంఖ్య నానాటికీ భారీగా తగ్గుముఖం పడుతోంది. ► 22 శాతం అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తమ్మీద ఐదో వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ► ఇది జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైనా, మొత్తంగా ఆహార భద్రతపైనా పెను ప్రభావం చూపగల పరిణామం. ► ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం మూడొంతుల జీవుల మనుగడకు మరణశాసనం రాస్తోంది. ► జంతువులు, చేపల వంటివాటిని విచ్చలవిడిగా వేటాడటం కూడా ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ► కార్చిచ్చులు, గ్లోబల్ వారి్మంగ్ వంటివి ఇందుకు తోడవుతున్నాయి. ► భారీ డ్యాములు, గాలి మరలకు తోడు ఆకస్మిక వరదలు, అకాల క్షామాలు తదితరాల వల్ల వలస దారులు మూసుకుపోవడం, మారిపోవడం జరుగుతోంది. ఇది పలు జీవ జాతులను అయోమయపరుస్తోంది. ఏం చేయాలి? తక్షణం వలస జీవ జాతుల సంరక్షణ చర్యలకు పూనుకోవాల్సిన ఆవశ్యకతను నివేదిక నొక్కిచెప్పింది. అందుకు పలు సిఫార్సులు చేసింది... ► జీవావరణాల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ► భారీ డ్యాములు తదితరాల పర్యావరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తగు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ► ఈ అన్ని సమస్యలకూ తల్లి వేరు పర్యావరణ విధ్వంసం. కార్చిచ్చులకైనా, అకాల వరదలు, క్షామాలకైనా, గ్లోబల్ వార్మింగ్కైనా అదే ప్రధాన కారణం. కనుక దానికి వీలైనంత త్వరలో చెక్ పెట్టేందుకు దేశాలన్నీ కృషి చేయాలి. ఆహారం, పునరుత్పాదన వంటి అవసరాల నిమిత్తం వేలాది జీవ జాతులు వలస బాట పట్టడం ప్రపంచవ్యాప్తంగా అనాదిగా జరుగుతూ వస్తున్న ప్రక్రియ. పలు జంతు, పక్షి జాతులైతే కోట్ల సంఖ్యలో వలస వెళ్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని పక్షి జాతులు ఏటా 10 వేల కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటాయి! పర్యావరణ సంతులన పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదపడే ప్రక్రియ ఇది. కానీ గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల ప్రభావం జంతువులు, పక్షుల వలసపై కూడా విపరీతంగా పడుతోంది. ఈ ప్రమాదకర పరిణామంపై ఐరాస తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయకపోతే కనీసం ఐదో వంతు వలస జీవులు అతి త్వరలో అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని తాజా నివేదికలో హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
పిచ్చుకపై ప్రేమాస్త్రం
అనగనగా ఓ పిచ్చుకకి ఏడు పిల్లలు. వాటిలో ఓ పిల్ల ఏడ్చింది. ‘పిల్లా పిల్లా ఎందుకేడుస్తున్నావ్?’ అంటే ‘మా అమ్మ పురుగు పెట్టలేదు’ అంది. ‘పిచ్చుకా.. పిచ్చుకా.. పురుగెందుకు పెట్టలేదు?’ అంటే ‘పురుగు నాకు దొరకలేదూ’ అంది. ‘పురుగూ.. పురుగూ.. ఎందుకు దొరకలేదూ’ అంటే ‘తుమ్మకొమ్మ కనపడలేదూ’ అంది. ‘తుమ్మా.. తుమ్మా.. ఎందుకు కనపడలేదూ’అంటే ‘మనిషి కొట్టేశాడు’ అంది. ‘మనిషీ.. మనిషీ.. ఎందుకు కొట్టేశావూ’ అంటే.. ‘నా అందాల బంగళాకి అడ్డొస్తే కొట్టేయనా మరీ’ అన్నాడట! ఓసారి దుబాయ్ ప్రయాణంలో.. అర్ధరాత్రి ఎయిర్పోర్ట్ అంతా సందడిగా ఉంది. ప్రయాణికుల ముచ్చట్లు.. ఎనౌన్స్మెంట్ల సందడి.. అంత గోలలోనూ నా చెవిన పడిందో సడి.. పిట్టల కిచకిచలు! ఎయిర్‌పోర్ట్‌లో పిట్టలెందుకుంటాయి? నేచ్యురల్ ఆంబియెన్స్ కోసం పిట్టల శబ్దాలు రికార్డు చేసి వినిపిస్తున్నారా ఏంటీ అనుకున్నా. తేరిపార చూస్తే.. ఇండోర్ ప్లాంట్స్ కొమ్మల్లో కనిపించాయి నిజమైన పిచ్చుకలు. ఆశ్చర్యం.. కుతూహలం కలిగింది నాలో! చూరు కింది గూళ్లలో, అలికిడైతే ఉలికిపడే పిచ్చుకలు.. జనారణ్యంలో గింజలు వేసే చేతుల్లేక, కాంక్రీటు శ్లాబుల్లో చూరులేక మహానగరం నుంచి మాయమై పోయాయేమో అనుకున్నా. అలాంటిది ఇన్ని పిచ్చుకలు ఒక్కచోట కిచకిచలాడుతుంటే ముచ్చటేసింది. ఫుడ్‌కోర్టులో కిందపడ్డ పిజ్జా, శాండ్విచ్ ముక్కలను చిట్టిముక్కులతో ఏరుకుంటూ అడుగుల సవ్వడికి అద్దాల చూరులోకి చేరుతూంటే.. పాపం.. వాటికి సరిపడని అసహజ పోకడలు నేర్చుకున్నాయా అనిపించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనూ పిచ్చుకలు, గోరింకలు కనిపిస్తాయి. ఆ చిట్టి పిచ్చుకలు కేవలం కొన్నిచోట్లకే ఎందుకు పరిమితమవుతున్నాయి? సమాధానం తెల్సుకోవాలంటే రజనీ వక్కలంకను కలుసుకోవాల్సిందే! చెట్టుచెట్టుకీ పిట్టగూడు రజనీ వక్కలంక.. పిట్ట కనిపిస్తే చాలు బుట్టపట్టుకు బయలుదేరుతుంది ఈ పిచ్చితల్లి, సారీ.. పిచ్చుకలతల్లి. పిట్టల్ని బుట్టల్లో పట్టాలని కాదు ఆ బుట్టలని ప్రతిచెట్టుకు పిట్టగూళ్లని చేయాలని. తుమ్మకి, పిచుకమ్మకీ దగ్గర సంబంధం ఉందని ఆమెని కలిశాకే నాకు తెలిసింది. తుమ్మ, నిమ్మ, రేగు వంటి ముళ్లచెట్లలో ఉండే పురుగులే వాటికి జీవనాధారం. పెద్దపిచ్చుకలు పురుగులతో పాటు గింజలు, మెతుకులపై బతగ్గలుగుతాయి. కానీ పిల్లలకి మాత్రం కీటకాలే ఆహారం! పిచ్చి మొక్కలని తుమ్మను కొట్టేస్తాం.. రేగు,నిమ్మను సాగుచేయం నగరంలో! ఇక వాకిట్లో పిచ్చుకల సందడి ఏముంటుంది? ఎయిర్‌పోర్ట్‌లో పిచ్చుకలు ఎందుకున్నాయో అర్థమయింది. చుట్టూ ఖాళీ భూముల్లో తుమ్మచెట్లే మరి! కుక్క, కాకి, పావురం.. పిచ్చుక లాంటివి మానవజాతికి దగ్గరగా జీవిస్తాయ్. మనిషికి దగ్గరగా ఉంటే శతృవుల నుంచి రక్షణ పొందవచ్చని.. కానీ మనిషే ప్రమాదమైతే ఇంకెక్కడ మనగలుగుతాయ్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో! ఉద్యోగాన్ని సైతం వదులుకుంది వేగంగా అంతరించిపోతున్న పక్షిజాతుల్లో పిచ్చుక ఒకటి. అందుకే వాటిని ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్‌లిస్ట్‌లో పెట్టేసింది. ఆర్నితాలజిస్టులు, ఎన్విరాన్‌మెంటలిస్టులు.. ఈ పక్షులకోసం కృషిచేస్తున్నవారిలో మన హైదరాబాద్‌కి చెందిన ‘పక్షిష్టులు’ కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కీర్తిమెహతా అనే వర్తకుడు తన వ్యాపారంతో పాటు పిచ్చుకలకు చెక్కగూళ్లు తయారుచేయించే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇక రజని కూడా పక్షులపై అవగాహన కలిగించేందుకు స్కూళ్లు, కాలనీలు తిరుగుతూ చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకుంది. పిచ్చుకసైన్యం నగరంలోని పక్షి ప్రేమికులంతా కలిసి ఓ పిచ్చుకసైన్యంగా ఏర్పడ్డారు. తుమ్మ, నిమ్మ చెట్లున్న చోట చెక్కడబ్బాలు తగిలించేస్తారు. అందులో పుల్లాపరకా చేర్చి పిచ్చుక గూడు కట్టుకుంటే వీళ్లు సొంతింటి గృహప్రవేశంలా సంబరాలు జరుపుకుంటారు. త్రికరణశుద్ధి ఏదీ? కాప్11 సమావేశాలప్పుడు హడావుడిగా నగరాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. కానీ కొనసాగించే త్రికరణ శుద్ధి ఏదీ? ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయకండి’ అంటూ బోర్డులు పెట్టిన జీహెచ్ఎమ్సీ ప్రత్యేకంగా పిచ్చుకల కోసం చేసిందేమీ లేదు. వారి అధీనంలో ఉన్న పార్కులో ఖాళీస్థలాల్లో తుమ్మ మొక్కల కోసం ఒక మూలను కేటాయిస్తే చాలు! పార్కుల్లో మొక్కలన్నింటినీ అలంకరణ కోసమే నాటాలా ఏంటీ? ఆ మాటకొస్తే అందంగా కత్తెర వేస్తే తుమ్మకొమ్మ కూడా క్రోటాన్ కంటే సుందరంగా ఉంటుంది. ఈ దిశగా జీహెచ్ఎమ్సీ కదలాలంటే చాలా ప్రణాళికలు కుదరాలి. కానీ మనమంతా కలిశామంటే చిట్టిపి ట్టలకు గట్టిసాయం చేయొచ్చు. ఏం చేయొచ్చు..? జొన్నల లాంటి పెద్దగింజలను పావురాల్లాంటి పెద్ద పక్షులే తినగలుగుతాయి. సన్నగా ఉండే ర్యాల, సజ్జ వంటి చిరుధాన్యాలు పెడితే చిన్నపిట్టలూ తింటాయి. డాబాపై అక్కడక్కడా నీటి పాత్రలు పెట్టొచ్చు. పిచ్చుకల కోసం చెక్కగూళ్లను తయారు చేయించి పెడ్తున్న కీర్తిమెహతాలాంటి వాళ్లకు ఇంట్లో వాడేసిన పాత చెక్కపెట్టెలను, చెక్కముక్కలను డొనేట్ చేసి సహకరించవచ్చు. మన చుట్టుపక్కల పిచ్చుకల సందడి ఉంటే ఇఅఔఆఅఇ (సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్సిటీ అవేర్నెస్ అండ్ కన్జర్వేషన్) నిర్వహిస్తున్న రజనీకి తెలియజేయొచ్చు. ఆమె పిచ్చుకల సైన్యంలో మనమూ వాలంటీర్స్‌గా చేరొచ్చు(asaveri92@yahoo.com) ఇవేవీ చేసే ఓపిక లేకపోతే కనీసం ఉదయాన్నే పక్షుల జిలిబిలి పలుకులని వినండి చాలు.. మన మనసుకూ రెక్కలొచ్చేస్తాయ్!