పిచ్చుకపై ప్రేమాస్త్రం | jhansi tells how to protect sparrows | Sakshi
Sakshi News home page

పిచ్చుకపై ప్రేమాస్త్రం

Published Fri, Aug 22 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

పిచ్చుకపై ప్రేమాస్త్రం

పిచ్చుకపై ప్రేమాస్త్రం

అనగనగా ఓ పిచ్చుకకి ఏడు పిల్లలు. వాటిలో ఓ పిల్ల ఏడ్చింది. ‘పిల్లా పిల్లా ఎందుకేడుస్తున్నావ్?’ అంటే ‘మా అమ్మ పురుగు పెట్టలేదు’ అంది. ‘పిచ్చుకా.. పిచ్చుకా.. పురుగెందుకు పెట్టలేదు?’ అంటే ‘పురుగు నాకు దొరకలేదూ’ అంది. ‘పురుగూ.. పురుగూ.. ఎందుకు దొరకలేదూ’ అంటే ‘తుమ్మకొమ్మ కనపడలేదూ’ అంది. ‘తుమ్మా.. తుమ్మా.. ఎందుకు కనపడలేదూ’అంటే ‘మనిషి కొట్టేశాడు’ అంది. ‘మనిషీ.. మనిషీ.. ఎందుకు కొట్టేశావూ’ అంటే.. ‘నా  అందాల బంగళాకి అడ్డొస్తే కొట్టేయనా మరీ’ అన్నాడట!
 
ఓసారి దుబాయ్ ప్రయాణంలో.. అర్ధరాత్రి ఎయిర్‌పోర్ట్ అంతా సందడిగా ఉంది. ప్రయాణికుల ముచ్చట్లు.. ఎనౌన్స్‌మెంట్ల సందడి.. అంత గోలలోనూ నా చెవిన పడిందో సడి.. పిట్టల కిచకిచలు! ఎయిర్‌పోర్ట్‌లో పిట్టలెందుకుంటాయి? నేచ్యురల్ ఆంబియెన్స్ కోసం పిట్టల శబ్దాలు రికార్డు చేసి వినిపిస్తున్నారా ఏంటీ అనుకున్నా. తేరిపార చూస్తే.. ఇండోర్ ప్లాంట్స్ కొమ్మల్లో కనిపించాయి నిజమైన పిచ్చుకలు. ఆశ్చర్యం.. కుతూహలం కలిగింది నాలో! చూరు కింది గూళ్లలో, అలికిడైతే ఉలికిపడే పిచ్చుకలు.. జనారణ్యంలో గింజలు వేసే చేతుల్లేక, కాంక్రీటు శ్లాబుల్లో చూరులేక మహానగరం నుంచి మాయమై పోయాయేమో అనుకున్నా.
 
అలాంటిది ఇన్ని పిచ్చుకలు ఒక్కచోట కిచకిచలాడుతుంటే ముచ్చటేసింది. ఫుడ్‌కోర్టులో కిందపడ్డ పిజ్జా, శాండ్‌విచ్ ముక్కలను చిట్టిముక్కులతో ఏరుకుంటూ అడుగుల సవ్వడికి అద్దాల చూరులోకి చేరుతూంటే.. పాపం.. వాటికి సరిపడని అసహజ పోకడలు నేర్చుకున్నాయా అనిపించింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లోనూ పిచ్చుకలు, గోరింకలు కనిపిస్తాయి. ఆ చిట్టి పిచ్చుకలు కేవలం కొన్నిచోట్లకే ఎందుకు పరిమితమవుతున్నాయి? సమాధానం తెల్సుకోవాలంటే రజనీ వక్కలంకను కలుసుకోవాల్సిందే!
 
చెట్టుచెట్టుకీ పిట్టగూడు
రజనీ వక్కలంక.. పిట్ట కనిపిస్తే చాలు బుట్టపట్టుకు బయలుదేరుతుంది ఈ పిచ్చితల్లి, సారీ.. పిచ్చుకలతల్లి. పిట్టల్ని బుట్టల్లో పట్టాలని కాదు ఆ బుట్టలని ప్రతిచెట్టుకు పిట్టగూళ్లని చేయాలని. తుమ్మకి, పిచుకమ్మకీ దగ్గర సంబంధం ఉందని ఆమెని కలిశాకే నాకు తెలిసింది. తుమ్మ, నిమ్మ, రేగు వంటి ముళ్లచెట్లలో ఉండే పురుగులే వాటికి జీవనాధారం. పెద్దపిచ్చుకలు పురుగులతో పాటు గింజలు, మెతుకులపై బతగ్గలుగుతాయి. కానీ పిల్లలకి మాత్రం కీటకాలే ఆహారం! పిచ్చి మొక్కలని తుమ్మను కొట్టేస్తాం.. రేగు,నిమ్మను సాగుచేయం నగరంలో! ఇక వాకిట్లో పిచ్చుకల సందడి ఏముంటుంది? ఎయిర్‌పోర్ట్‌లో పిచ్చుకలు ఎందుకున్నాయో అర్థమయింది. చుట్టూ ఖాళీ భూముల్లో తుమ్మచెట్లే మరి! కుక్క, కాకి, పావురం.. పిచ్చుక లాంటివి మానవజాతికి దగ్గరగా జీవిస్తాయ్. మనిషికి దగ్గరగా ఉంటే శతృవుల నుంచి రక్షణ పొందవచ్చని.. కానీ మనిషే ప్రమాదమైతే ఇంకెక్కడ మనగలుగుతాయ్? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో!
 
ఉద్యోగాన్ని సైతం వదులుకుంది
వేగంగా అంతరించిపోతున్న పక్షిజాతుల్లో పిచ్చుక ఒకటి. అందుకే వాటిని ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) రెడ్‌లిస్ట్‌లో పెట్టేసింది. ఆర్నితాలజిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు.. ఈ పక్షులకోసం కృషిచేస్తున్నవారిలో మన హైదరాబాద్‌కి చెందిన ‘పక్షిష్టులు’ కూడా ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కీర్తిమెహతా అనే వర్తకుడు తన వ్యాపారంతో పాటు పిచ్చుకలకు చెక్కగూళ్లు తయారుచేయించే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇక రజని కూడా పక్షులపై అవగాహన కలిగించేందుకు స్కూళ్లు, కాలనీలు తిరుగుతూ చేస్తున్న ఉద్యోగాన్నీ వదులుకుంది.
 
పిచ్చుకసైన్యం
నగరంలోని పక్షి ప్రేమికులంతా కలిసి ఓ పిచ్చుకసైన్యంగా ఏర్పడ్డారు. తుమ్మ, నిమ్మ చెట్లున్న చోట చెక్కడబ్బాలు తగిలించేస్తారు. అందులో పుల్లాపరకా చేర్చి పిచ్చుక గూడు కట్టుకుంటే వీళ్లు సొంతింటి గృహప్రవేశంలా సంబరాలు జరుపుకుంటారు.
 
త్రికరణశుద్ధి ఏదీ?
కాప్11 సమావేశాలప్పుడు హడావుడిగా నగరాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. కానీ కొనసాగించే త్రికరణ శుద్ధి ఏదీ? ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయకండి’ అంటూ బోర్డులు పెట్టిన జీహెచ్‌ఎమ్‌సీ ప్రత్యేకంగా పిచ్చుకల కోసం చేసిందేమీ లేదు. వారి అధీనంలో ఉన్న పార్కులో ఖాళీస్థలాల్లో తుమ్మ మొక్కల కోసం ఒక మూలను కేటాయిస్తే చాలు! పార్కుల్లో మొక్కలన్నింటినీ అలంకరణ కోసమే నాటాలా ఏంటీ? ఆ మాటకొస్తే అందంగా కత్తెర వేస్తే తుమ్మకొమ్మ కూడా క్రోటాన్ కంటే సుందరంగా ఉంటుంది. ఈ దిశగా జీహెచ్‌ఎమ్‌సీ కదలాలంటే చాలా ప్రణాళికలు కుదరాలి. కానీ మనమంతా కలిశామంటే చిట్టిపి ట్టలకు గట్టిసాయం చేయొచ్చు.
 
ఏం చేయొచ్చు..?
జొన్నల లాంటి పెద్దగింజలను పావురాల్లాంటి పెద్ద పక్షులే తినగలుగుతాయి. సన్నగా ఉండే ర్యాల, సజ్జ వంటి చిరుధాన్యాలు పెడితే చిన్నపిట్టలూ తింటాయి. డాబాపై అక్కడక్కడా నీటి పాత్రలు పెట్టొచ్చు. పిచ్చుకల కోసం చెక్కగూళ్లను తయారు చేయించి పెడ్తున్న కీర్తిమెహతాలాంటి వాళ్లకు ఇంట్లో వాడేసిన పాత చెక్కపెట్టెలను, చెక్కముక్కలను డొనేట్ చేసి సహకరించవచ్చు. మన చుట్టుపక్కల పిచ్చుకల సందడి ఉంటే ఇఅఔఆఅఇ (సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్సిటీ అవేర్‌నెస్ అండ్ కన్జర్వేషన్) నిర్వహిస్తున్న రజనీకి తెలియజేయొచ్చు. ఆమె పిచ్చుకల సైన్యంలో మనమూ వాలంటీర్స్‌గా చేరొచ్చు(asaveri92@yahoo.com)
ఇవేవీ చేసే ఓపిక లేకపోతే కనీసం ఉదయాన్నే  పక్షుల జిలిబిలి పలుకులని వినండి చాలు.. మన మనసుకూ రెక్కలొచ్చేస్తాయ్!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement