సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా విసురుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, కళ్లమంటలు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఈ సీజనల్ జ్వరాల బారినపడినట్లు సమాచారం. బాధితుల్లో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారే ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాల్లో సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
వాతావరణం మారడంతో..
ప్రస్తుతం శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. చలిగాలులు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వైరస్ కారకాలు మార్పు చెందుతున్నాయి. ప్రస్తుతం నమోదవుతున్న జ్వరాలను ఐసీఎంఆర్ ఇటీవల విశ్లేషించగా విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఐసీఎంఆర్ చేసిన సీరో సర్వేలో 92 శాతం మందికి తీవ్రమైన జ్వరంతోపాటు దగ్గు, కళ్ల మంటలు, నిమోనియా (హెచ్3ఎన్2 వైరస్) లక్షణాలున్నట్లు గుర్తించింది. సాధారణ స్వైన్‌ఫ్లూ కంటే ఈ వైరస్ తీవ్రత కొంత ఎక్కువున్నట్లు పేర్కొంది.
పదేళ్ల క్రితం తగ్గినట్లే తగ్గి..
2009లో హైదరాబాద్‌లో తొలిసారిగా స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. 2012 వరకు హెచ్1ఎన్1 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసుల తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఆపై కేసుల సంఖ్య క్రమంగా తగ్గి సాధారణ ప్లూ జాబితాలో చేరింది. అడపాదడపా కేసులు నమోదవుతున్నప్పటికీ రోగనిరోధకశక్తి పెరగడం, చికిత్స సులభతరం కావడంతో ఆ తర్వాత పెద్దగా ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం ఈ వైరస్ హెచ్3ఎన్2గా రూపాంతరం చెంది మరింత బలపడింది. సాధారణంగా చలి ప్రదేశంలో ఈ వైరస్ విస్తరిస్తుంది. కానీ ఇందుకు భిన్నంగా వేసవిలోనూ విజృంభిస్తోంది.
జనసమూహాలతో వ్యాపిస్తూ..
ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కావడంతో ప్రజలు భారీగా ఒకచోట చేరుతున్నారు. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు సైతం వెళ్తున్నారు. ఈ సమయంలో వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం, దగ్గడం వల్ల ఆ వైరస్ గాలిలోకి ప్రవేశించి ఒకరి నుంచి మరొకరికి వేగంగా విస్తరిస్తోంది. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు ప్రస్తుతం ఫ్లూ బాధితులతో రద్దీగా మారుతున్నాయి. బాధితుల్లో జ్వరం 3–5 రోజులపాటు ఉంటుండగా దగ్గు 10–15 రోజులపాటు వేధిస్తోంది. సకాలంలో వైరస్‌ను గుర్తించకపోవడం, చికిత్సను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన నిమోనియాకు కారణమవుతోంది.
ఆందోళన అక్కర్లేదు
వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటాయి. హెచ్3ఎన్2 వైరస్ కారకాలపై ఆందోళన అవసరం లేదు. ఇది కూడా ఓ సాధారణ ఫ్లూనే. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. జన సమూహంలోకి వెళ్లకపోవడం, విధిగా మాస్క్‌లు ధరించడం, రోగనిరోధకశక్తిని పెంచుకోవడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ బారినపడకుండా కాపాడుకోవచ్చు. చికిత్సల్లో మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడొద్దని ఐసీఎంఆర్ ఇప్పటికే సూచించింది. ఇది సాధారణ మందులతోనే నయమవుతుంది.
– డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి
తెలంగాణపై మళ్లీ ఫ్లూ పంజా!
Published Thu, Mar 9 2023 3:28 AM | Last Updated on Thu, Mar 9 2023 7:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment