వాకాడు : కడలిపై పది రోజులుగా కల్లోల వాతావరణ నెలకొంది. సముద్రంపై పోరుగాలి వీస్తుండడంతో వేటకు వెళ్లిన బోట్లు తిరగబడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితితో వాతావరణం అనుకూలించే సమయం కోసం తీరంలోనే కుటుంబాలతో సహా పడిగాపులు పడుతున్నారు. 61 రోజుల వేట విరామం తర్వాత జూన్ 15వ తేదీ నుంచి వేటకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. సాధారణంగా వేట విరామం తర్వాత మత్స్య సంపద విరివిగా దొరుకుతుంది. సముద్రంపై పోరు గాలి, పెరిగిన అలల ఉధృతి కారణంగా పడవలు ఒక్క చోట నిలవక మత్స్యకారులు వేట చేయలేకపోతున్నారు. పోరు గాలితో మత్స్య సంపద చెల్లాచెదురై పొద్దస్తమానం సముద్రంలో వలేసి గాలించినా ఒక్క చేప కూడా దొరకడం లేదు. శ్రమతోపాటు, డీజిల్ ఖర్చులు పెరిగి మత్స్యకారులు నిరాశతో వెనుతిరిగి వచ్చేస్తున్నారు.
వేట తప్ప మరే పని తెలియని మత్స్యకారులు పది రోజులుగా సముద్రంపై కుస్తీ పడుతున్నారు. అటు వేట లేక, పూట గడవక గంగపుత్రులు ఆకలితో అలమటిస్తున్నారు. వేటే జీవనాధారంగా చేసుకుని తెల్లవారు జామునే వల భుజాన వేసుకుని సముద్రాన్ని గాలించి మంచి మత్స్యసంపదతో సంతోషంగా కనిపించే సాగర పుత్రులు ప్రతికూల వాతావరణంతో దిగాలు చెందుతున్నారు. అలల ఉధృతిని సైతం లెక్క చేయకుండా ఎదురొడ్డి వేట చేసే మత్స్యకారులు సైతం ప్రస్తుతం భయపడుతున్నారు. ఇటీవల పోరుగాలి, అలల ఉధృతి కారణంగా పలుచోట్ల బోట్లు తిరగబడి మత్స్యకారులు గల్లంతైన ఘటనలు దృష్టిలో ఉంచుకుని మత్స్యకారులు వేట మానేసి బోట్లు ఒడ్డున లంగర్ వేశారు. జిల్లాలోని కావలి నుంచి తడ వరకు 12 మండలాల పరిధిలోని తీర ప్రాంతంలో ఇదే పరిస్థితి నెలకొంది.
పోరుగాలితో వేట సాగడం లేదు
పది రోజులుగా సముద్రంపై ప్రతికూల వాతావరణం నెలకొంది. పోరుగాలికి వేట చేయలేకున్నాము. తెల్లవారు జామున సముద్రంపై వేటకు వెళ్లినప్పటికీ బోట్లు ఒక్కచోట నిలవక, చేప దొరక్క నిరాశతో వెనుతిరిగి రావాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందట్లేదు. రెండేళ్లుగా వేట నిషేధిత పరిహారం రాకపోవడంతో జీవనం కష్టంగా ఉంది. – సోమయ్య, మత్స్యకారుడు, తూపిలిపాళెం
రెండేళ్లుగా వేట విరామం నగదు రావడం లేదు
రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందాల్సిన వేట విరామం నగదు అందడం లేదు. తిరిగి తిరిగి కాళ్లు అరిగిపోతున్నాయే తప్ప డబ్బులు మాత్రం రావడంలేదు. వేట లేక, పూట గడవక, పస్తులుంటున్న సంగతి సంబంధిత అధికారులకు తెలిసినా తమను ఎవరూ పట్టించుకోవడం లేదు. – ఎం.పోలయ్య, మత్స్యకారుడు కొండూరుపాళెం
Comments
Please login to add a commentAdd a comment