జిల్లా మత్స్యశాఖ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న బాధిత కుటుంబసభ్యులు
ఏడ్చీ ఏడ్చీ కన్నీళ్లు ఇంకిపోయాయి.. అడిగీ అడిగీ గుండెలు ఎండిపోయాయి. ఎదురుచూసీ చూసీ చూపులు అవిసిపోయాయి. అయినా లాభం లేదు. కడుపున పుట్టిన వారి కోసం కొందరు, కట్టుకున్న వారి కోసం మరికొందరు, తోబుట్టువుల కోసం ఇంకొందరు నెలల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎక్కడో పాకిస్తాన్ చెరలో చిక్కుకుపోయిన వారి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రతి వారం ఠంచనుగా అధికారులకు విన్నపాలు అందిస్తున్నారు. కనిపించిన నాయకుల వద్ద విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా వారి నిరీక్షణ ఫలించడం లేదు. గంగపుత్రుల బెంగ తీరడం లేదు.
సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : జిల్లా గంగపుత్రులకు దాయాది దేశ కష్టాలు ఇంకా తీరలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మన గంగ పుత్రులు వలసకు వెళ్లి పొరపాటున పొరుగు దేశ సరిహద్దును క్రాస్ చేయడంతో పాకిస్తాన్ దళం అదుపులోకి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్‌గార్డులకు చిక్కడంతో తీవ్ర ఆందోళనగా పరిస్థితులు మా రాయి. వీరి కోసం ఆయా కుటుంబ సభ్యులు ఎదురుచూపులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అసలు వాళ్లంతా అక్కడ ఎలా ఉన్నారో ఎప్పుడొస్తారో కనీస సమాచారం కూడా తెలీని పరిస్థితులపై బాధిత కుటుంబాల రోదనలు అందరినీ కలచివేస్తున్నాయి. ఒక టి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెలలు గడుస్తున్నా పొరుగు దేశ దళాలకు చిక్కిన మన వాళ్లు ఇంకా మన తీరానికి చేరలేదు.గత ఏడాది నవంబర్ 28న గుజరాత్‌లో వీరావల్ ప్రాంతానికి బోట్లలో వలస వెళ్లే క్రమంలో అనుకోకుండా పాకిస్తాన్ సరిహద్దులోకి ప్రవేశించడంతో ఆ దేశ కోస్ట్ గార్డు సిబ్బంది మొత్తం 22 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. ఇందులో మన జిల్లాకు చెందిన వారు అత్యధికంగా 15 మంది ఉంటే, విజయనగరం జిల్లాకు చెందిన వారు ఐదుగురు కాగా, మరో ఇద్దరు ఎవరో ప్రభుత్వం గుర్తించలేదు. దీంతో స్థానిక జిల్లాలో ఆ బాధిత కుటుంబాల పరిస్థితులు చూస్తుంటే కన్నీరు ఉబికి వస్తుంది.
నెరవేరని గత ప్రభుత్వ హామీలు
పొరుగు దేశ దళాలకు మన వాళ్లు చిక్కారని తెలియగానే నాటి టీడీపీ సర్కార్ ఆఘమేఘాల మీద వారి కుటుంబాలను ఆదుకుంటామని, ప్రతి బాధితుని ఇంటికి ప్రభుత్వం తరఫున రెండేసి లక్షల రూపాయలు, ఇంజిన్ బోట్లు ఇస్తామని, అలాగే రేషన్ కార్డు ఆధారంగా బాధితులను గుర్తించి వారి కుటుంబాలకు భృతిగా ఈ ఏడాది జనవరి నుంచి నెలకు రూ.4500 ఇస్తామంటూ వరుస ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా బాధితులకు అందలేదు. రేషన్ కార్డుల వారీగా మొత్తం 11 కుటుంబాలను గుర్తించి, వారికి రెండేసి లక్షల రూపాయలను కేటాయించి, ఇందులో రూ.1.25 లక్షలను ఇంజిన్ బోటు కోసం బాధితుల కుటుంబ సభ్యుల నుంచే వసూలు చేయించి, మిగిలిన మొత్తాన్ని మాత్రమే బాధితులకు అందజేసిన ఘనత గత ప్రభుత్వానికే చెందుతుంది. దీంతో ఆయా కుటుంబ సభ్యులంతా తమ వాళ్ల క్షేమ సమాచారాన్ని తెలియజేయాలని, అలాగే తమకు ప్రభుత్వం చెప్పిన పథకాలను అమలు చేయాల డిమాండ్ చేస్తున్నారు.ఆరు నెలల నుంచి ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు, జిల్లా మత్స్యశాఖ జెడి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాయాది దేశమైన పాకిస్తానీలు మా వాళ్లను వదలరు.. మన అధికారులు బాధితుల్ని ఆదుకోరంటూ మత్స్యకార సంక్షేమ సంఘ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
చిక్కుకున్న జిల్లావాసులు వీరే
జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గాలకు చెందిన మత్స్యకారులే పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారు. వీరిలో కేశం ఎర్రయ్య, కేశం రాజా, సూరాడ అప్పారావు, సూరాడ కిషోర్, సూరాడ కళ్యాణ్, గణగళ్ల రామారావు, బేరి సుమన్, మైలపల్లి సన్యాసి, మైలపల్లి రాంబాబు, చీకటి గురుమూర్తి, (డి,మత్స్యలేశం), దూడంగి సూర్యనారాయణ (శ్రీకాకుళం), వాసిపల్లి శ్యామ్యూల్, కోనాడ వెంకటేష్, బడే అప్పన్న (బడివానిపేట), పెంట మణి (ఎచ్చెర్ల) ఉన్నారు. వీరిలో పెంట మణికి తప్ప మిగిలిన వారికి రూ.2 లక్షల చొప్పున సాయాన్ని అందజేశారు. దీంతో మణి కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు దిగుతున్నారు.
మా బాధలు మీకు పట్టవా.. సార్
‘ఏంటి సార్. ఎన్ని సార్లు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఓ వైపు ఇంటి మనుషులు ఏడు నెలలుగా కానరాలేదు. మీ ప్రకటనలకు కూడా ఆ ఏడు నెలలే అవుతుంది. కానీ మా కెవ్వరికీ నెల భృతిగా రూ.4500 రావడం లేదు. మోటార్ ఇంజిన్ బోట్లు ఇవ్వలేవు’ అంటూ బాధితులు సోమవారం జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిని నిలదీశారు. సోమవారం వారంతా కార్యాలయానికి వెళ్లి జాయింట్ డైరెక్టర్‌ను చుట్టుముట్టారు. తమ సమస్యలను తేల్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు కూడా చేశారు. దీంతో జాయింట్ డైరక్టర్ దీనిపై స్పందిస్తూ బోట్లు ఇంకా తయారవుతున్నాయని, త్వరలోనే ఇస్తామని, అలాగే నెలవారీ భృతి కోసం పెట్టిన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే ఆలస్యంగా గుర్తించిన పెంట మణికి కూడా రూ.2 లక్షల సాయం కూడా వచ్చిందని, త్వరలోనే అందజేస్తామని తెలియజేశారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులంతా కలిసి మత్స్యశాఖ కార్యాలయం బయట కాసేపు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మూగి శ్రీరాములు, మూగి గురుమూర్తి, కుందు లక్ష్మణ, గనగళ్ల రామారావు, మూగి రామారావు, సూరాడ అప్పారావు, ముగతమ్మ, నూకరత్నం, శిరీష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment