పాకిస్థాన్‌కు చిక్కిన తమవారి ఫొటోలను చూపిస్తున్న కుటుంబ సభ్యులు
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో చిక్కుకున్న తమవారు ఎలా ఉన్నారో.. ఏం జరుగుతుందోనని ఆ కుటుంబాలు కలవర పడుతున్నాయి. క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని తమవారిని కాపాడాలని వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీకి చెందినవారితోపాటు జిల్లాలోని మరి కొంతమంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ వలస వెళ్లి అక్కడ సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ బోర్డర్‌లోకి పొరబాటున వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఉన్న తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీ వాసులు వేడుకుంటున్నారు. కాగా జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్థాన్‌కు చెందిన భద్రతా దళాల చెరలో ఉన్నట్టు తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. డి.మత్స్యలేశం, బడివానిపేట గ్రామాలను ఎచ్చెర్ల ఎస్సై కృష్ణతోపాటు పోలీసులు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు గురువారం సందర్శించారు. వీరు మత్స్యకారుల పూర్తిసమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు శత్రు దేశం పాకిస్థాన్ కోస్టుగార్డుకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన 10 మంది,బడివానిపేట గ్రామానికి చెందిన ముగ్గురు, తోటపాలెం గ్రామానికి చెందిన వారు ఒకరు, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన వారు ఒకరు ఉండగా.. విజయనగరం జిల్లా కుప్పలవలసకు చెందిన నలుగురు, కాకినాడకు చెందిన ఇద్దరు..మొత్తం 21 మంది ఉన్నట్టు సమాచారం.
వీరంతా మూడు బోట్లలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ బోర్డర్‌లోకి అనుకోని పరిస్థితిలో చొరబడి అక్కడి భద్రతాదళాలకు చిక్కుకున్నారు. వీరంతా గత ఆగస్టులో వీరావల్ వెళ్లారు. డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, కలాసీ, వంట మనిషిగా చేపల వేట కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. వీరికి భోజనం పెట్టి నెలకు పది వేల రూపాయల నుంచి రూ. 25 వేల వరకూ జీతంగా కాంట్రాక్టర్ చెల్లిస్తున్నారు. 20 నుంచి 30 రోజుల వరకు సముద్రంలో చేపల వేట సాగిస్తారు. పట్టుబడిన చేపలు చెడిపోకుండా కోల్డ్ స్టోరేజీలు బోట్లలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లి.. పని ముగించుకొని వచ్చే ప్రక్రియలో అరేబియన్ సముద్రంలో 12 వేల నాటికల్ మైళ్లు దాటి పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లిపోయి అక్కడి భద్రతాదళాలకు చిక్కారు. ప్రస్తుతం వీరు కరాచీలో ఉన్నట్లు తెలిసింది.
పాక్ చెరలో ఉన్న జిల్లా మత్స్యకారులు..
డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన గనగళ్ల రామారావు, కేశవ, ఎర్రయ్య, రాజు, మైలిపల్లి సన్యాసిరావు, రాంబాబు, సూరాడ అప్పారావు, కల్యాణ్, కిశోర్, చీకటి గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన వాసనల్లి శ్యామ్యూల్, బడి అప్పన్న, కొనాగ వెంకటేష్, తోటపాలెం గ్రామానికి చెందిన మణి, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన శివ ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతోపాటు కేంద్ర రక్షణశాఖ సమాచారం కోసం నిరీక్షిస్తున్నారు.
క్షేమంగా విడిపించాలి..
తమ వారిని క్షేమంగా పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని డి,మత్స్యలేశం, బడివానిపేట గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎలాంటి హాని తలపెట్టకుండా చూడాలని పాక్ కోస్టుగార్డు చెరలో ఉన్న అప్పారావు భార్య మంగమ్మ, రామారావు భార్య నూకరత్నం, రాజు భార్య లక్ష్మ మ్మ, గురుమూర్తి భార్య లక్ష్మి విలపిస్తున్నారు. తమ వారు ఎప్పుడు వస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పాక్‌కు పట్టుబడ్డ మత్స్య కారులను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యకార యూనియన్ నాయకులు మూడి రామారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మూగి శ్రీరాములు, న్యాయవాదులు చింతపల్లి సూర్యనారాయణ, మూగి గురుమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment