coast gurad
-
అగ్రరాజ్యాలకు దీటుగా.. సాగర జలాల్లో ఇక నిరంతర నిఘా!
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటూ డిఫెన్స్ సెక్టార్ కీలకంగా వ్యవహరిస్తోంది. కేవలం నౌకాదళం, ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే కాకుండా... సాంకేతికతను అందిపుచ్చుకుంటూ... అగ్రరాజ్యాలకు దీటుగా బలాన్ని, బలగాన్ని పెంచుకుంటోంది. వైరి దేశాల కవ్వింపు చర్యలకు సరైన సమాధానం ఇచ్చేందుకు నిరంతరం నూతన రక్షణ వ్యవస్థలతో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సాగర జలాల్లో నిరంతరం పహారా కాసేలా ఇండియన్ కోస్ట్ గార్డ్ తొలిసారిగా మానవ రహిత మల్టీకాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండియన్ కోస్ట్‌గార్డ్(ఐసీజీ) హెలికాప్టర్లకు బదులుగా... సరికొత్త సాంకేతికతతో మల్టీకాప్టర్లను తన అమ్ములపొదిలో చేర్చుకుంది. నిరంతరం పహారా కాసే సామర్థ్యం ఉన్న ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు... కోస్ట్‌గార్డ్ రక్షణ వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి. వెర్టికల్‌గా టేకాఫ్‌తోపాటు ల్యాండింగ్ కూడా అయ్యేలా ఇవి పనిచేస్తాయి. కోస్ట్‌గార్డ్ నౌకల్లోనూ, ఆఫ్‌షోర్ స్టేషన్ల నుంచి వీటిని ప్రయోగించొచ్చు. మూడేళ్లలో 100 మల్టీకాప్టర్లు.. ప్రస్తుతం కోస్ట్ గార్డ్.. తొలి విడతగా 10 మల్టీకాప్టర్లను కొనుగోలు చేసుకుంది. వీటిని విశాఖ, కోల్‌కతా ప్రాంతాల్లోని ఐసీజీ ప్రధాన స్థావరాలకు కేటాయించాలని నిర్ణయించింది. తీరప్రాంత నిఘా, భద్రత వ్యవస్థలను మరింత పటిష్టం చేసేలా.. సరిహద్దు ప్రాంతాల్లో ఈ మల్టీకాప్టర్ డ్రోన్లు రాత్రి, పగలు పహారా కాస్తాయి. నిఘాకు మాత్రమే కాకుండా... ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లలోనూ, యాంటీ పైరసీ, యాంటీ స్మగ్లింగ్, ఆయిల్స్పిల్, కాలుష్య నియంత్రణ ఆపరేషన్స్ మొదలైనవాటికి కూడా వీటిని వినియోగించనున్నారు. ఏడాది నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ తీర ప్రాంత భద్రతపై మరింత పట్టు సాధించింది. యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి నిర్వహించిన ఏడు జాయింట్ ఆపరేషన్లలో రూ.1,900 కోట్ల విలువైన 350 కిలోల హెరాయిన్ దేశంలోకి రాకుండా స్వా«దీనం చేసుకుంది. ఈ ఆపరేషన్లలో పాక్, ఇరాన్ దేశాలకు చెందిన చొరబాటుదారుల్ని కూడా అదుపులోకి తీసుకుంది. ఇకపై భద్రత వ్యవస్థను మరింత స్మార్ట్‌గా పటిష్టం చేసేందుకు మల్టీకాప్టర్లను వినియోగించాలని కోస్ట్‌గార్డ్ నిర్ణయించింది. ఇందుకోసం 2025 నాటికి మరో 100 మల్టీకాప్టర్ డ్రోన్లను కొనుగోలు చేసే దిశగా అడుగులేస్తోంది. -
తౌక్టే తుపాను: 9 మందిని కాపాడిన కోస్ట్‌గార్డ్
బనశంకరి: తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. స్థానికులు ముగ్గురిని కాపాడగా, ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కావేరినది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇళ్లు కూలి, విద్యుత్ ప్రమాదాలతో ఆరుగురు దాకా మరణించారు. సురక్షితం అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. మంగళూరు నుంచి 13 నాటికల్ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. తుపాను వల్ల ముందుకు వెళ్లలేకపోయారు. రక్షించాలని వీడియో కాల్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఐదుమందిని హెలికాప్టర్ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు. తుపాను మృతులకు పరిహారం తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు. తుపాను వల్ల రాష్ట్రంలో 6 మంది మృతిచెందగా 22 జిల్లాల్లో 121 పల్లెల్లో 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో పంటలు నాశనమైయ్యాయని 57 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. -
జాలర్ల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: పాకిస్తాన్ చెరలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జాలర్లను విడిపించే విషయంలో తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ కోస్టు గార్డులను అరెస్ట్ చేసి జాలర్లను విడిపించి క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చే విధంగా భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు వైఎస్ జగన్ శుక్రవారం ఒక ట్వీట్ చేశారు. ( ఇది చదవండి: గొల్లుమన్న మత్స్యకార పల్లెలు) Seeking the urgent intervention and help of MEA,GoI in ensuring the safe return of fishermen from Andhra Pradesh arrested by the Pakistan Coast Guard. — YS Jagan Mohan Reddy (@ysjagan) 30 November 2018 -
పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో జిల్లా మత్స్యకారులు
బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో చిక్కుకున్న తమవారు ఎలా ఉన్నారో.. ఏం జరుగుతుందోనని ఆ కుటుంబాలు కలవర పడుతున్నాయి. క్షేమంగా తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని తమవారిని కాపాడాలని వేడుకుంటున్నారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీకి చెందినవారితోపాటు జిల్లాలోని మరి కొంతమంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ వలస వెళ్లి అక్కడ సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. అయితే వీరు నిబంధనలకు విరుద్ధంగా పాకిస్థాన్ బోర్డర్లోకి పొరబాటున వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఈ సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్: పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఉన్న తమవారిని క్షేమంగా ఇంటికి చేర్చాలని డి.మత్స్యలేశం పంచాయతీ పరిధి బడివానిపేట పంచాయతీ వాసులు వేడుకుంటున్నారు. కాగా జిల్లాకు చెందిన మత్స్యకారులు పాకిస్థాన్‌కు చెందిన భద్రతా దళాల చెరలో ఉన్నట్టు తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. డి.మత్స్యలేశం, బడివానిపేట గ్రామాలను ఎచ్చెర్ల ఎస్సై కృష్ణతోపాటు పోలీసులు, మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు గురువారం సందర్శించారు. వీరు మత్స్యకారుల పూర్తిసమాచారం సేకరించే పనిలో ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. స్థానికుల సమాచారం మేరకు శత్రు దేశం పాకిస్థాన్ కోస్టుగార్డుకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన 10 మంది,బడివానిపేట గ్రామానికి చెందిన ముగ్గురు, తోటపాలెం గ్రామానికి చెందిన వారు ఒకరు, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన వారు ఒకరు ఉండగా.. విజయనగరం జిల్లా కుప్పలవలసకు చెందిన నలుగురు, కాకినాడకు చెందిన ఇద్దరు..మొత్తం 21 మంది ఉన్నట్టు సమాచారం. వీరంతా మూడు బోట్లలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ బోర్డర్లోకి అనుకోని పరిస్థితిలో చొరబడి అక్కడి భద్రతాదళాలకు చిక్కుకున్నారు. వీరంతా గత ఆగస్టులో వీరావల్ వెళ్లారు. డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, కలాసీ, వంట మనిషిగా చేపల వేట కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. వీరికి భోజనం పెట్టి నెలకు పది వేల రూపాయల నుంచి రూ. 25 వేల వరకూ జీతంగా కాంట్రాక్టర్ చెల్లిస్తున్నారు. 20 నుంచి 30 రోజుల వరకు సముద్రంలో చేపల వేట సాగిస్తారు. పట్టుబడిన చేపలు చెడిపోకుండా కోల్డ్ స్టోరేజీలు బోట్లలోనే ఉంటాయి. ఈ క్రమంలోనే చేపల వేటకు వెళ్లి.. పని ముగించుకొని వచ్చే ప్రక్రియలో అరేబియన్ సముద్రంలో 12 వేల నాటికల్ మైళ్లు దాటి పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లిపోయి అక్కడి భద్రతాదళాలకు చిక్కారు. ప్రస్తుతం వీరు కరాచీలో ఉన్నట్లు తెలిసింది. పాక్ చెరలో ఉన్న జిల్లా మత్స్యకారులు.. డి.మత్స్యలేశం పంచాయతీకి చెందిన గనగళ్ల రామారావు, కేశవ, ఎర్రయ్య, రాజు, మైలిపల్లి సన్యాసిరావు, రాంబాబు, సూరాడ అప్పారావు, కల్యాణ్, కిశోర్, చీకటి గురుమూర్తి, సుమంత్, బడివానిపేటకు చెందిన వాసనల్లి శ్యామ్యూల్, బడి అప్పన్న, కొనాగ వెంకటేష్, తోటపాలెం గ్రామానికి చెందిన మణి, శ్రీకాకుళం రూరల్‌కు చెందిన శివ ఉన్నట్టు సమాచారం. అయితే అధికారులు పాకిస్థాన్ కోస్టుగార్డు చెరలో ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతోపాటు కేంద్ర రక్షణశాఖ సమాచారం కోసం నిరీక్షిస్తున్నారు. క్షేమంగా విడిపించాలి.. తమ వారిని క్షేమంగా పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని డి,మత్స్యలేశం, బడివానిపేట గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎలాంటి హాని తలపెట్టకుండా చూడాలని పాక్ కోస్టుగార్డు చెరలో ఉన్న అప్పారావు భార్య మంగమ్మ, రామారావు భార్య నూకరత్నం, రాజు భార్య లక్ష్మ మ్మ, గురుమూర్తి భార్య లక్ష్మి విలపిస్తున్నారు. తమ వారు ఎప్పుడు వస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పాక్‌కు పట్టుబడ్డ మత్స్య కారులను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మత్స్యకార యూనియన్ నాయకులు మూడి రామారావు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మూగి శ్రీరాములు, న్యాయవాదులు చింతపల్లి సూర్యనారాయణ, మూగి గురుమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరావు మాట్లాడుతూ సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
మెట్టు దిగని జాలరన్న
సాక్షి, చెన్నై: ‘అబ్బే..ఫైరింగ్ జరగనే లేదు’ అని ఓ వైపు ప్రకటించి, మరో వైపు మెట్టు దిగి మరీ ‘సారీ’తో జాలర్లను బుజ్జగించే పనిలో కోస్టుగార్డు వర్గాలు నిమగ్నమయ్యాయి. సారీతో సరి పెట్ట వద్దంటూ పట్టువీడని విక్రమార్కుల వలే జాలర్లు పోరుబాటలో నిమగ్నం అయ్యారు. రామేశ్వరంలో సమ్మె సైరన్ మోగడంతో పాటు, గురువారం భారీ నిరసనకు జాలర్ల సంఘాలు నిర్ణయించాయి. తమిళ జాలర్లకు కడలిలో నిత్యం శ్రీలంక సేనల రూపంలో ముప్పు ఎదురవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో రక్షణగా నిలవాల్సిన భారత కోస్టు గార్డు వర్గాలు, తమ మీదే తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారి తీసింది. అయితే, తమ వాళ్లెవ్వరూ కాల్పులు జరప లేదని, అస్సలు కడలిలో అలాంటి ఘటనే జరగలేదంటూ కోస్టుగార్డు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. జాలర్లు కపటనాటకాన్ని ప్రదర్శిస్తున్నారంటూ, ఓ కుంటిసాకును తెర మీదకు తెచ్చారు. ఫైరింగ్ జరగ లేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. నిషేధిత వలల్ని కప్పి పుచ్చడం లక్ష్యంగా జాలర్లు తమ మీద నిందల్ని వేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్ వర్గాలు రంగంలోకి దిగడం గమనార్హం. సమ్మెబాట: తమ మీద దాడికి నిరసనగా రామనాథపురం జిల్లా జాలర్లు బుధవారం భగ్గుమన్నారు. వీరికి మద్దతుగా నాగపట్నం, పుదుకోట్టై జాలర్లు కదిలే పనిలో పడ్డారు. రామేశ్వరం జాలర్లు వేటను బహిష్కరిస్తూ నిరవధిక సమ్మెబాట పట్టారు. జాలర్లు తమ వైపు నుంచి ఒత్తిడి పెంచే పనిలో పడడంతో సముద్ర తీర భద్రతా విభాగం రంగంలోకి దిగింది. కేసు నమెదు చేసిన ఆ విభాగం అధికారులు, ప్రత్యేక విచారణ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం రామేశ్వరం, కచ్చదీవు సమీపంలో పరిశీలించింది. గాయపడ్డ జాలర్లను విచారించింది. అదే సమయంలో తమ మీద ఎక్కు పెట్టిన తూటాను ఆ విచారణ బృందానికి జాలర్లు అందించడంతో కోస్టుగార్డు వర్గాలు సందిగ్ధంలో పడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు సమాచారం. అస్సలు కాల్పులే జరగలేదన్నప్పుడు, పేలిన ఆ తూటా శకలం జాలర్లకు ఎలా చిక్కిందోనన్న ప్రశ్న బయలుదేరింది. దీంతో కోస్టుగార్డు వర్గాలు మెట్టు దిగి సారీ చెప్పుకోక తప్పలేదు. మెట్టు దిగని జాలరన్న సముద్ర తీర భద్రతా విభాగం, కోస్టుగార్డు, మత్స్యశాఖ, రెవెన్యూ అన్ని విభాగాల అధికారులు బుధవారం మధ్యాహ్నం ఆగమేఘాలపై జాలర్ల సంఘాల ప్రతినిధులకు సమాచారం అందించారు. మండపంలో ప్రత్యేక సమావేశానికి ఏర్పాటు చేసిన హాజరు కావాలని ఆహ్వానం పలికారు. తొలుత ఆ సమావేశానికి వెళ్లడానికి జాలర్ల సంఘాలు నిరాకరించాయి. అయితే, స్థానిక అధికారులు ఆహ్వానించడంతో వారికి గౌరవాన్ని ఇవ్వాలన్న భావనతో అక్కడికి వెళ్లారు. సమావేశం ప్రారంభం కాగానే, కోస్టుగార్డు తరఫున ‘సారీ’ అన్న పలుకు వినబడడం, క్షణాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం చోటు చేసుకున్నాయి. అలాగే, ఇక ప్రతి నెలలో ఓ రోజు జాలర్లు, కోస్టుగార్డుతో పాటు అన్ని విభాగాల సమన్వయంతో సమావేశాలు జరిగే విధంగా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగిందని సూచించారు. కోస్టుగార్డు స్థానిక అధికారుల నుంచి సారీ అన్న పలుకు విన్న జాలర్ల సంఘాల ప్రతినిధులు విస్మయంలో పడ్డారు. అయితే, ఆ అధికారులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. తూటాల్ని పేల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్థానిక అధికారులు అది జరుగుతుందని, అయితే, అందుకు సమయం పడుతుందని వివరణ ఇచ్చుకున్నారు. విచారణ జరుగుతున్నదని, చర్యలు తప్పనిసరిగానే ఉంటాయన్న హామీని ఇచ్చినా, జాలర్ల సంఘాల నేతలు మెట్టు దిగ లేదు. ఇది తమ ఒక్కరి సమస్య కాదు అని, జాలర్లందరి సమస్యగా గుర్తు చేస్తూ, అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా, అంత వరకు సమ్మె కొనసాగుతుందని, ముందుగా నిర్ణయించిన మేరకు గురువారం భారీ నిరసన కార్యక్రమం సాగుతుందని జాలర్ల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేయడంతో రామేశ్వరంలో ఉత్కంఠ తప్పడం లేదు. ఇక, నిన్నటి వరకు ఫైరింగ్ జరగ లేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రామనాథ పురం జిల్లా రామేశ్వరానికి చెందిన జాలర్లపై భారత్ కోస్టుగార్డు వర్గాలు తుపాకుల్ని ఎక్కు బెట్టడం వివాదానికి దారితీసింది. ఫైరింగ్ జరగలేదుగానీ, నిషేధిత వలల్ని ఉపయోగించడంపై హెచ్చరికలు మాత్రమే చేశామని ప్రకటించారు. అనంతరం హఠాత్తుగా ‘సారీ’ అంటూ జాలర్లను బుజ్జగించేందుకు కోస్టుగార్డ్ వర్గాలు రంగంలోకి దిగాయి. నిన్నటి వరకు ఫైరింగ్ జరగలేదన్న వాళ్లు, హఠాత్తుగా సారీ చెప్పడాన్ని తాము అంగీకరించబోమని, ఫైరింగ్ ఘటనలు పునరావృతంకాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని జాలర్ల సంఘాల ప్రతినిధులు, పలు రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులతో ఉత్కంఠ వీడలేదు. -
'ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది'
చెన్నై: నెల రోజుల కిందట గల్లంతైన తీర రక్షకదళ గస్తీ విమానం శకలాల ఆనవాళ్లు దొరికాయన్న వార్తలపై కో పైలెట్ సుభాష్ సురేష్ తల్లి పద్మా సురేష్ స్పందించారు. తమ కుమారుడి క్షేమ సమాచారంపై ఆమె ఆందోళన చెందుతున్నారు. 'జూన్ 8 నుంచి నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఎపుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని గాభరాగా ఉంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావడం లేదని' పద్మా సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విమానం ఆనవాళ్లు లభించాయని వార్త విన్నప్పటినుంచీ మరింత కంగారుగా, భయంగా ఉందన్నారు. వాట్పాప్ గ్రూప్ సందేశాల ద్వారా, మీడియా ద్వారా మాత్రమే ఈ వార్త తమకు తెలిసిందనీ, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం లేదని ఆమె అన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తదుపరి సమాచారం కోసం వేచి చూడాలని కోస్ట్ అధికారులు విజ్ఞప్తి చేశారని, సుభాష్ బంధువు వెంకటేష్ తెలిపారు. మరింత సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని మరో సిబ్బంది సోనీ బంధువు తెలిపారు. కాగా తమిళనాడు సముద్ర తీర ప్రాంతం చిదంబరం-కడలూరు మధ్య జలాల్లో డార్నియర్ గస్తీ విమానం శకలాలతో పాటు దాని ఫ్లయిట్ డాటా రికార్డర్‌ను 950 మీటర్ల అడుగున గుర్తించినట్లు రక్షణశాఖ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సితన్షు కర్ ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. రిలయన్స్ సంస్థకు చెందిన ఒలింపిక్ అనే నౌక వీటిని గుర్తించింది. జూన్ 8న ముగ్గురు డిప్యూటీ కమాండెంట్లతో వెళ్లిన ఈ విమానం విధుల తర్వాత తిరిగొస్తుండగా చెన్నై తీరంలో అదృశ్యమైన విషయం తెలిసిందే. దీనికోసం 33 రోజులుగా గాలింపు చర్యలు విస్తృత కొనసాగుతున్నాయి. ఈ విమానంలో డిప్యూటీ కమాండెంట్ (పైలట్) విద్యాసాగర్, డిప్యూటీ కమాండెంట్ (కో పైలట్) సుభాష్ సురేష్, నావిగేటర్ ఎంకె సోనీ ఉన్నారు. ఈ తరహా ప్రమాదాల్లో ఇది రెండోది. గత మార్చిలో గోవాలో జరిగిన ఎయిర్ క్రాప్ట్ కూలిపోయిన ప్రమాదంలో ఇద్దరు నేవీ అధికారులు మరణించారు.