![Tauktae Cyclone: Coast Guard Saved 9 Lives In Karnataka - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/18/Coast-Guard.gif.webp?itok=7j_dXAB7)
బనశంకరి: తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. స్థానికులు ముగ్గురిని కాపాడగా, ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కావేరినది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇళ్లు కూలి, విద్యుత్ ప్రమాదాలతో ఆరుగురు దాకా మరణించారు.
సురక్షితం
అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. మంగళూరు నుంచి 13 నాటికల్ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. తుపాను వల్ల ముందుకు వెళ్లలేకపోయారు. రక్షించాలని వీడియో కాల్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఐదుమందిని హెలికాప్టర్ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు.
తుపాను మృతులకు పరిహారం
- తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు.
తుపాను వల్ల రాష్ట్రంలో 6 మంది మృతిచెందగా 22 జిల్లాల్లో 121 పల్లెల్లో 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో పంటలు నాశనమైయ్యాయని 57 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment