వాతావరణ శాఖ అధికారులే అవాక్కైన వైనం
గత 48 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుపాను పుట్టి భారత వాతావరణ శాఖ అధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఆగస్ట్ నెలలో తుపాన్లు ఏర్పడటం చాలా అరుదైన విషయం. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంత జలాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు అనేవి తుపాన్లు ఏర్పడేందుకు అనువైన వాతావరణం కాదు.
అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుంచి వీచే పొడిగాలులు సైతం ఇక్కడ తుపాన్లను ఏర్పర్చలేవు. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని దాటుతూ తుపాను ఏర్పడటం వాతావరణ శాఖ అధికారులను సైతం ఆలోచనల్లో పడేసింది. చివరిసారిగా 1976లో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. అది కూడా ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం చివరకు పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి చివరకు అరేబియా సముద్రంలో తుపానుగా రూపాంతరం చెందింది. తర్వాత అది అలాగే వెళ్లి ఒమన్ తీరం వద్ద బలహీనపడింది.
అరేబియాలో తుపాన్లు ఎందుకు రావంటే?
వర్షాకాల సీజన్‌లో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో జూలై, సెప్టెంబర్‌లో తుపాన్లు ఏర్పడటం కష్టం. అల్పపీడనం ఏర్పడినపుడు గాలులు గంటకు 52–61 కి.మీ.ల వేగంతో వీస్తాయి. అదే తుపాను ఏర్పడితే గంటకు 63–87 కి.మీ.ల వేగంతో వీస్తాయి. తుపాను ఏర్పడాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉండాలి.
అయితే అరేబియా జలాలు ఇంత వేడి ఉండవు. అదే బంగాళాఖాతంలో ఉండే వాతావరణం తుపాన్లు ఏర్పడటానికి అత్యంత అనువుగా ఉంటుంది. చారిత్రకంగా బంగాళాఖాతం, అరేబియాసముద్రాన్ని కలిపి హిందూ మహాసముద్ర ఉత్తరప్రాంతంగా పరిగణిస్తారు. హిందూ మహాసముద్రం ఉత్తరాన 1976 తర్వాత తుపాను ఏర్పడటం ఇదే తొలిసారికావడం విశేషం. 1891 ఏడాది నుంచి చూస్తే ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఆగస్ట్‌నెలలో కేవలం నాలుగుసార్లే తుపాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రప్రాంతంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపాన్లు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. మే, నవంబర్ మధ్యలో ఇవి విజృంభిస్తాయి.
భూతాపం కారణమా?
మితిమీరిన కాలుష్యం, విచ్చలవిడిగా పెరిగి పోయిన మానవ కార్యకలాపాలు, పారిశ్రా మికీకరణ, శిలాజ ఇంధనాలను మండించడంతో భూతాపోన్నతి కారణంగా వాతావ రణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో తుపాన్లకు ఈ భూతాపోన్నతికి సంబంధం ఉందేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూతాపం కారణంగా ఇది సంభవించినా ఆశ్చర్యపడా ల్సిన పనిలేదని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అభిప్రాయపడ్డారు. ‘‘దశాబ్దాలుగా ప్రాంతీయ వాతావరణంపై శాస్త్రవేత్తలకు ఉన్న అంచనాలను ఈ కొత్త పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి.
వాతావరణ మార్పుల్లో కొత్త ధోరణులు అరేబియా సముద్రప్రాంతంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని చాటిచెప్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగే వర్షాకాల సీజన్, అల్ప పీడనాలు, తుపాన్ల సీజన్లపై మనకున్న అవగాహనను మరింతగా అప్‌డేట్ చేసుకో వాల్సిన సమయమొచ్చింది. వాతావరణంలో తరచూ ఇలాంటివే సంభవిస్తే మన ఉష్ణమండల ప్రాంత పరిస్థితుల్లోనూ మార్పులు గణనీయంగా రావొచ్చు. ఇలాంటి తుపాన్లు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి’’ అని రాజీవన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment