సాక్షి, అమరావతి: పాకిస్తాన్ చెర నుంచి విడిపించిన ఏపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆంధ్రా జాలర్లు తెలిపారు. మంగళవారం మత్స్యకారులు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారి వెంట మంత్రి మోపిదేవి ఉన్నారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మత్స్యకారులు కలవనున్నారు. మీడియాతో మత్స్యకారులు మాట్లాడుతూ.. పదిహేను నెలలుగా నరకం అనుభవించామన్నారు. తమ విడుదలకు చొరవ చూపిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్తాన్ చెర నుంచి విడుదలయిన 20 మంది ఆంధ్రా జాలర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారని మంత్రి మోపిదేవి తెలిపారు.
పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున గుజరాత్ తీరం వద్ద పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు తీసుకొచ్చారు. తక్షణమే విడుదలకు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్.. ఎంపీ విజయసాయిరెడ్డికి ఆదేశాలిచ్చారు. అప్పటి నుంచి విదేశాంగ శాఖపై ఎంపీ విజయసాయిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు ఆయన లేఖలు రాశారు. విజయసాయి రెడ్డి లేఖతో కేంద్ర విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిపించేందుకు చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment