సాక్షి,కొత్తూరు(శ్రీకాకుళం): రెండు పదుల వయసులోనే ఓ యువకుడి ఆయుష్షు ముగిసిపోయింది. బాల్య వివాహం ఏ మేరకు జీవితాలను ధ్వంసం చేస్తుందనడానికి ఉదాహరణగా నిలిచిపోతూ అతడి బతుకు అర్ధంతరంగా ఆగిపోయింది. 18 ఏళ్లకే వివాహం.. ఆపై భార్యతో ఎడబాటు.. అది తట్టుకోలేక 20 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్తూరు మండలం నేతాజీనగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
నేతాజీనగర్ కాలనీకి చెందిన సిందియా సింహాద్రికి రెండేళ్ల కిందట విశాఖపట్నంకు చెందిన శివానీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అయితే పెళ్లయ్యాక ఒక్క రోజు మాత్రమే భర్తతో ఉన్న శివానీ ఆ తర్వాత కన్నవారింటికి వెళ్లిపోయింది. రెండేళ్ల నుంచి కాపురానికి రావడం లేదు. భర్త సింహాద్రి, మా మయ్య రాంబాబులు చాలాసార్లు పిలిచినా ఆమె రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సింహాద్రి సోమవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి దూలానికి ఉరి వేసుకున్నాడు.
సింహాద్రి కుటుంబ సభ్యులు బొమ్మల వ్యాపారం చేస్తుంటారు. భామిని మండలం లివిరిలో జరుగుతున్న యాత్రలో ప్రస్తుతం బొమ్మల షాపు నిర్వహిస్తున్నారు. కుటుంబమంతా అక్కడకు వెళ్లిపోవడంతో సింహాద్రి ఒక్కడే ఇంటిలో ఉండి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాత్రలో ఉన్న తండ్రి రాంబాబు కుమారుడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ యన మంగళవారం ఉదయం పక్క ఇంటిలో ఉన్న వారికి ఫోన్ చేశారు. సింహాద్రి తన ఫోన్ లిఫ్ట్ చే యడం లేదని చెబితే.. వారు వెళ్లి చూడగా దూ లానికి ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని వారు రాంబాబుతో చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అడిగర్లు చంద్రకళ తెలిపారు. సంఘటన స్థలం వద్దకు సీఐ ఎస్.సూర్యచంద్ర మౌళి, ఎస్‌ఐ చంద్రకళతో పాటు సిబ్బంది చేరుకొని సంఘటనపై వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment