ప్రదీప్‌కుమార్ (ఫైల్)
ఎచ్చెర్ల క్యాంపస్/ఆమదాలవలస/రాజాం: పరీక్షలో ఫెయిలయ్యాడు.. అడ్డదారిలోనైనా పాసవ్వాలని భావించి తన బదులు స్నేహితుడితో పరీక్ష రాయించాడు. ఆ సమయంలో ఇన్విజిలేటర్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించడం.. తల్లిదండ్రులతో కలిసి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో సదరు విద్యార్థి అవమానానికి గురయ్యాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం మోదుగులపేటకు చెందిన లావేటి సాయిప్రదీప్‌కుమార్(21) చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ తృతీయ ఏడాది చదువుతున్నాడు.
గణితంలో మొదటి ఇంజినీరింగ్ బ్యాక్‌లాగ్ ఉంది. జంబ్లింగ్ నేపథ్యంలో ఈ పరీక్షను ఎచ్చెర్ల శ్రీవేంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో గత ఏడాది డిసెంబర్ 8న రాయాల్సి ఉంది. ఎలాగైనా ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో స్నేహితుడిని ఆశ్రయించి తప్పుడు హాల్ టిక్కెట్‌తో పరీక్ష రాయించాడు. ఆ సమయంలో జేఎన్‌టీయూ పరిశీలకులకు సదరు స్నేహితుడు పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి జేఎన్‌టీయూ పరీక్షల విభాగం అధికారులు కమిటీ వేశారు. విచారణ నిమిత్తం జేఎన్‌టీయూ కాకినాడకు ఈ నెల 28న హాజరుకావాలంటూ ప్రదీప్‌కుమార్, తల్లిదండ్రులు, పరీక్ష రాసిన విద్యార్థికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చేసిన తప్పును ఒప్పుకోలేక, తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లలేక అవమాన భారంతో శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి వయోడెక్ట్ సమీపంలో గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థి మృతి నేపథ్యంలో శ్రీశివానీ కళాశాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
విషాదంలో కుటుంబ సభ్యులు
ప్రదీప్ మృతితో మోదుగులపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు లలిత, ప్రభాకరరావు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.