
కొచ్చి: వాతావరణ మార్పుల కారణంగానే ఇటీవల కేరళలో భారీ వర్షాలు, వరదలు పెను విధ్వంసం సృష్టించాయని ప్రముఖ పర్యావరణవేత్త, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చంద్ర భూషణ్ తెలిపారు. గత కొన్నేళ్లలో ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, చెన్నైలో కుంభవృష్టితో పాటు అకస్మాత్తుగా భారీ వరద పోటెత్తిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న డ్యాముల నిర్వహణ వ్యవస్థను పునఃసమీక్షించాల్సిన అవసరముందని భూషణ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులతో పశ్చిమ కనుమల్లో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిందని తెలిపారు.
ఇటీవల వాతావరణ మార్పుల కారణంగానే కేరళలో కుంభవృష్టి సంభవించిందనీ, కాంక్రీటు నిర్మాణాలు, ఇతర మానవ చర్యల కారణంగా వరద పోటెత్తి అపార నష్టం సంభవించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా పశ్చిమ కనుమల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిటీ లేదా కస్తూరిరంగన్ కమిటీ చేసిన సూచనల అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) సంస్థ భూషణ్‌కు గతేడాది ఓజోన్ అవార్డును అందజేసింది. మాంట్రియల్ ప్రోటోకాల్‌ను సవరిస్తూ కిగాలీలో కుదుర్చుకున్న పర్యావరణ ఒప్పందం చర్చల సందర్భంగా చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు అవార్డును ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment