చినుకు కురిసింది.. నేల మురిసింది
జిల్లాలో విస్తారంగా వర్షాలు
పాలమూరు: వరుణుడు కరుణించాడు. జిల్లాలో విస్తారంగా వాన కురిపించి.. నేలను మురిపించాడు. రైతన్నల్లో ఆనందం నింపేందుకు మొలకలకు ప్రాణం పోశాడు. ఆల స్యమైనా మంచి అదునులో వర్షం కురియడంతో సోయా, పత్తి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బుధవారం సాయంత్రం గురువారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 14.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భూత్పూర్ మండలంలో 108 మి.మీ వర్షపాతంతో అత్యధికంగా నమోదుకాగా.. ఆ తర్వాతి స్థానంలో మహబూబ్‌నగర్‌లో 80.0 మి.మీతో వర్షం కురిసింది.
కల్వకుర్తి 52.8 మి.మీ, తిమ్మాజీపేట 51.0 మి.మీ, వంగూరు 50.0 మి.మీ, హన్వాడ 44.4 మి.మీ, అడ్డాకుల 44.0 మి.మీ, ఆమనగల్లులో 42.0 మి.మీ, మిడ్జిల్ 42.0 మి.మీ, ఖిల్లా ఘనపూర్ 34.6 మి.మీ, నర్వ 30.0 మి.మీ వర్షం పడింది. మరో 15 మండలాల్లో చినుకుపడలేదు. మిగిలిన మండలాల్లో 30 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ పంటలకు అనుకూలమైన ఈ సమయంలో వర్షం రైతులకు మేలు చేస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలు ప్రస్తుతం మొలకదశలో ఉన్నాయి. జూన్ నెల చివరి వరకు వర్షంలేదు. దాంతో అప్పటికే పత్తి విత్తుకున్న రైతులు ఇతర పంటల వైపు మొగ్గుచూపారు. తాజాగా నమోదైన వర్షపాతం పంటలకు లాభదాయకమని చెబుతున్నారు.